కేర్‌ హాస్పిటల్‌లో మొట్టమొదటి రోబోటిక్‌ అసిస్టెడ్‌ హిస్టరెక్టమీ సర్జరీ!

రోబోటిక్ సర్జరీ సెంటర్‌ను ప్రారంభించిన వైద్య, ఆరోగ్య, ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు

హైదరాబాద్‌, 15 సెప్టెంబర్‌, 2022 : వైద్యరంగం ఎప్పుడూ నిత్య నూతనమే. నిరంతరం కొత్త ఆవిష్కరణలే. ఓపెన్‌ సర్జరీల నుంచి మినిమల్‌ ఇన్వేసివ్‌ సర్జరీల దాకా.. ఎన్నో.. ఎన్నెన్నో సౌకర్యవంతమైన, అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వస్తున్నాయి. ఇప్పుడు వైద్యంలో రోబోటిక్‌ శకం నడుస్తున్నది. మొన్నటివరకూ లాపరోస్కోపీ.. ఒక విప్లవం. ఇప్పుడు రోబోటిక్‌ సర్జరీ అటు డాక్టర్లకూ, ఇటు పేషెంట్లకూ ఆత్మబంధువైపోతున్నది. జనరల్‌ సర్జరీలకే కాదు.. సూపర్‌ స్పెషాలిటీల్లో కూడా రోబోలు తమదైన ముద్ర వేస్తున్నాయి. క్యాన్సర్‌ సర్జరీల కోసం తొలి అడుగులు వేసిన రోబోటిక్స్‌ ఇప్పుడు గైనకాలజీలోకి కూడా ప్రవేశించింది. ఆసియా పసిఫిక్‌లోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ ద్వారా హిస్టరెక్టమీ చేసిన ఘనతను కేర్‌ హాస్పిటల్‌ సాధించింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్‌లో అధునాతన రోబోటిక్‌ సర్జరీ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక మంత్రి టి. హరీశ్‌ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘రోబోటిక్‌ సర్జరీల ద్వారా శరీరంపై గాటు పెద్దగా ఉండదు. అధిక రక్తస్రావం జరుగదు. పేషెంటుకూ, డాక్టర్లకూ సౌకర్యంగా ఉండే రోబోటిక్‌ సర్జరీ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషకరం. ఇప్పుడు గైనకాలజీలో రోబోటిక్స్‌ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ పరిణామం’’ అన్నారు. అంతేకాదు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో సిజేరియన్ల రేటు చాలా ఎక్కువగా ఉందనీ, కేర్‌ హాస్పిటల్‌ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కేసులను తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రమంతా కలిపి జిల్లాకో మెడికల్‌ కాలేజీ పెట్టబోతున్నామని కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. సిజేరియన్ల నివారణకు కృషి చేస్తున్న పద్మశ్రీ డాక్టర్‌ అనగాని మంజులను ప్రత్యేకంగా అభినందించారు.

కేర్‌ బంజారా ప్రసూతి, గైనకాలజీ విభాగాధిపతి పద్మశ్రీ డాక్టర్‌ మంజుల అనగాని ఈ అధునాతనమైన మెడ్‌ట్రానిక్‌ హ్యూగో రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌ గురించి వివరించారు. రోబోటిక్‌ సర్జరీలో చాలా చిన్న కోతలు చేస్తారు. కాబట్టి గాయం త్వరగా మానుతుంది. సర్జరీ నుంచి త్వరగా కోలుకుంటారు. చికిత్స సులువే కాకుండా, చికిత్స తరువాత పేషెంట్‌ జీవన నాణ్యత కూడా మెరుగుపడుతుంది. నొప్పి చాలా తక్కువ. రక్తస్రావం పెద్దగా ఉండదు. అంతేగాక, శరీరంపై గాయం తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. సర్జరీని కూడా చాలా కచ్చితత్వంతో చేయడం వీలవుతుంది. హాస్పిటల్‌లో రోజుల తరబడి ఉండే అవసరం లేదు. కాబట్టి హాస్పిటల్‌ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం చాలా తక్కువ. దీన్ని ఉపయోగించి అడినోమయోసిస్‌ సమస్యతో బాధపడుతున్న 46 ఏళ్ల మహిళకు ఈ రోబోటిక్‌ సర్జరీ ద్వారా గర్భసంచిని తొలగించామని చెప్పారు డాక్టర్‌ మంజుల అనగాని.

రోబోటిక్‌ సర్జరీ కేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు హాస్పిటల్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి గ్రూప్ చీఫ్ అఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీవీఎస్ గోపాల్, యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ పి. వంశీ కృష్ణ, ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నీలేష్ గుప్తా ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ గైనకాలజీతో పాటు యూరాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, జనరల్‌ సర్జరీల వంటి సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన సర్జరీల్లో ఉపయోగిస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *