థాలసీమియా, సికిల్‌ సెల్‌ పేషెంట్ల కోసం వెయ్యి యూనిట్ల రక్తం

థాలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా సొసైటీతో కలిసి పనిచేయనున్న ఏఐజీ హాస్పిటల్స్‌
ఇకపై బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంట్‌ కోసం కూడా సేవలందించనున్న ఏఐజీ

హైదరాబాద్, 14 జూన్ 2023: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, ఏఐజీ హాస్పిటల్స్ నగరంలో అతిపెద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ క్యాంపులో 877 మంది వాలంటీర్లు రక్తదానం చేశారు. #PintOfLife ప్రచారంలో భాగంగా, ఏఐజీ హాస్పిటల్స్ థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా సొసైటీ (TSCS)తో కలిసి కలసి పనిచేయడానికి శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘థాలసీమియా, సికిల్ సెల్ అనీమియాతో బాధపడేవాళ్లు మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో వాళ్లకు సహాయం చేయడం మా సమష్టి బాధ్యతగా భావిస్తున్నాం. జన్యుపర లోపాల వల్ల వచ్చే ఈ వ్యాధుల వల్ల ఇలాంటి పిల్లలకు జీవితాంతం రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. పేషెంట్ల పట్ల బాధ్యతగా, నిబద్ధతతో వ్యవహరించే ఏఐజీ పేషెంట్ల పట్ల తమ కర్తవ్యాన్ని మరింత సమర్థంగా నిర్వర్తించడానికి రక్తదానం పై శ్రద్ధ పెడుతుంది. థాలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా పేషెంట్ల కోసం వెయ్యి యూనిట్ల రక్తాన్ని దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం’’ అని చెప్పారు.


ఈ పేషెంట్ల కోసం థాలసీమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ ఎంతో కాలంగా అందిస్తున్న సామాజిక సేవలను గుర్తించి, సొసైటీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ చంద్రకాంత్‌ అగర్వాల్‌ ను ఏఐజీ హాస్పిటల్స్‌ సత్కరించింది. ‘‘మేము 25 సంవత్సరాల క్రితం సొసైటీని ప్రారంభించినప్పుడు, బ్లడ్ బ్యాంక్‌లు లేవు. వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మేము కష్టపడి మా ప్రయాణాన్ని కొనసాగించాం. ఈ రోజు మేము 3700 మంది తలసేమియా రోగులకు సేవ చేస్తున్నాం. ఇప్పుడు మాతో పాటు ఏఐజీ హాస్పిటల్స్‌ లాంటి పెద్ద సంస్థ చేయి కలిపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్‌ చంద్రకాంత్‌ అగర్వాల్‌.

థాలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా జన్యుపరమైన లోపాల వల్ల పుట్టుకతోనే వచ్చే వ్యాధులు. ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లలు పుట్టిన కొన్ని నెలల తర్వాత లక్షణాలు ప్రారంభమవుతాయి. కాబట్టి దీని బాధితుల్లో పిల్లలే ఎక్కువ. థాలసీమియా వ్యాధితో పుట్టిన పిల్లల్లో రక్తంలో హిమోగ్లోబిన్‌ చెయిన్‌ ను ఏర్పరిచే జన్యువులో లోపం ఏర్పడుతుంది. అందువల్ల ఇలాంటి పిల్లల్లో హిమోగ్లోబిన్‌ తయారవదు. మనం పీల్చుకున్న ఆక్సిజన్‌ ను శరీరంలోని అన్ని కణాలకూ చేరవేయడంలో ఈ హిమోగ్లోబిన్‌ పాత్ర ముఖ్యమైనది. అందువల్ల ఇలాంటి పిల్లల్లో తరచుగా రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇకపోతే, సికిల్‌ సెల్‌ అనీమియా కూడా జన్యుపరమైన లోపం వల్ల వచ్చే వ్యాధే. వీళ్లలో ఎర్ర రక్తకణాల నిర్మాణంలో తేడాలు ఉంటాయి. డిస్క్‌ ఆకారంలో ఉండాల్సిన ఎర్రరక్తకణాలు జన్యులోపం వల్ల కొడవలి ఆకారంలో ఉంటాయి. అందువల్ల అవి ఆక్సిజన్‌ ను రవాణా చేయలేవు. కాబట్టి సికిల్‌ సెల్‌ బాధితుల్లో రక్తహీనత ఏర్పడుతుంది. అందువల్ల వీళ్లకు కూడా రక్తమార్పిడి అవసరం. ఈ జబ్బులతో పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి నిరంతరం రక్తమార్పిడి అవసరం అవుతుంది. ఇలా జీవితాంతం వీళ్లకు రక్తమార్పిడి చేస్తూనే ఉండాలి. అందుకే ఎంత ఎక్కువ మంది రక్తదానం చేయడానికి ముందుకు వస్తే, అంత ఎక్కువ మంది పేషెంట్లను బతికించడం వీలవుతుంది.

‘‘రక్తమార్పిడి పైనే జీవితం ఆధారపడిన థాలసీమియా పేషెంటుకు సంవత్సరానికి 30 యూనిట్ల రక్తం అవసరం అవుతుండగా, ఒక వ్యక్తి మూడు నెలలకు ఒకసారి ఒక యూనిట్‌ మాత్రమే రక్తాన్ని దానం చేయగలుగుతారు. అంటే ఎనిమిది మంది దాతలు ఒక రోగికి అవసరం అవుతారు. రక్తదానం చేయడం పట్ల ఇంకా అపోహలు ఉండటం వల్ల ఎక్కువమందికి సరిపడా రక్తం అందుబాటులో ఉండటం లేదు. అందుకే అత్యధిక సంఖ్యలో రక్తదాతలు ముందుకు వచ్చి, స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేయాలి. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి హానీ కలుగదు. నీరసపడిపోవడమో, రక్తహీనత రావడమో లాంటి సమస్యలేమీ ఉండవు. ఆరోగ్యంగా ఉన్న 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైనా 65 ఏళ్ల వయసు లోపు రక్తదానం చేయవచ్చు’’ అని చెప్పారు ఏఐజీ హాస్పిటల్స్‌ ట్రాన్స్‌ ఫ్యూజన్‌ మెడిసిన్‌ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ హెడ్‌ డాక్టర్‌ ప్రగతి నాయక్‌.

ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించిన బ్లడ్‌ క్యాంపులో ఆందోళనకరమైన విషయం తెలిసిందని చెప్పారు డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు రక్తదానానికి ముందుకు వచ్చిన 800కు పైగా రక్తదాతల్లో 15 శాతం మంది రక్తదానం చేయడానికి అనర్హులుగా తేలింది. వీళ్లలో హిమోగ్లోబిన్‌ స్థాయి తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. వీళ్లందరూ ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోని అమ్మాయిలే. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. చిన్ విషయమే అని నిర్లక్ష్యం చేస్తే ఇది అతి పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నిర్దుష్టమైన గ్రూప్‌ అమ్మాయిల్లో అనీమియా వెనుక కారణాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తాం. యువత ముఖ్యంగా అమ్మాయిలు ఇనుము ఎక్కువగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలని’’ అన్నారాయన.
ఏఐజీ హాస్పిటల్స్‌ తో కలిసి పనిచేస్తున్న బయలాజికల్‌ ఇ, హెటిరో, గ్రాన్యూల్స్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌, జి.పుల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ సంస్థలు గత ఏడాదిలో 1500 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు వాళ్లను కూడా ఏఐజీ తరపున డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి సత్కరించారు.

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *