గర్భంలోనే బ్రెయిన్‌ ఆపరేషన్‌..!

ఆ బిడ్డ పుట్టకముందే మృత్యుంజయురాలు. బయటి ప్రపంచం చూడక మునుపే అరుదైన వ్యాధి నుంచి బయటపడింది. అతి క్లిష్టమైన బ్రెయిన్‌ సర్జరీ అంటే పెద్దవాళ్లే భయపడుతూ ఉంటారు. అలాంటిది పసిగుడ్డుకు బ్రెయిన్‌ సర్జరీ చేసి, వార్తల్లో నిలిచారు అమెరికా లోని బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ వైద్యులు. బిడ్డ పుట్టకముందే, ఇంకా కడుపులో ఉండగానే మెదడులో ఉన్న లోపాన్ని సర్జరీ ద్వారా సరిచేశారు. వైద్యరంగంలోనే విప్లవాత్మకమైన చికిత్సతో 34 వారాల వయసున్న గర్భస్థ శిశువును కాపాడారు.

గర్భం దాల్చిన మహిళలకు రెగులర్‌ గా అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ పరీక్ష చేసి, కడుపులో బిడ్డ ఎదుగుదలను పరీక్షిస్తారు. అమెరికాలోని బోస్టన్‌ లో ఒక ప్రెగ్నెంట్‌ మహిళ కూడా అలాగే రెగులర్‌ చెకప్స్‌ కి వెళ్లింది. అంతకాలం బాగానే ఉన్న బిడ్డకు, 34 వారాల వయసు వచ్చిన తరువాత స్కాన్‌ చేసినప్పుడు మెదడులో లోపం కనిపించింది. ఆ పసిపాప మెదడులో రక్తనాళాలు సక్రమంగా రూపుదిద్దుకోలేదని గమనించారు. గుండె నుంచి మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం నిర్మాణంలో ఈ సమస్య ఏర్పడింది. దీన్ని వీన్‌ ఆఫ్‌ గాలెన్‌ మాల్‌ ఫార్మేషన్‌ సమస్యగా గుర్తించారు.

గాలెన్‌ మాల్‌ ఫార్మేషన్‌ అంటే..?

గుండె రక్తాన్ని పంపు చేసినప్పుడు గుండె నుంచి అన్ని శరీర భాగాలకు ధమనులనే రక్తనాళాల ద్వారా రక్తం రవాణా అవుతుంది. గుండె నుంచి ధమనుల్లోకి రక్తం ప్రవేశించినప్పుడు అత్యధిక పీడనంతో ప్రవహించే రక్తం శరీర భాగాలకు చేరుకునే సరికి దాని పీడనం తగ్గుతుంది. చెట్టు కాండానికి ఉన్న కొమ్మల మాదిరిగా ఈ రక్తనాళాలు కూడా ప్రతి అవయవానికీ విస్తరించి ఉంటాయి. చివర్లలో కొమ్మలు, రెమ్మలు చిన్నగా అయిపోయినట్టుగానే అవయవాల దగ్గరికి చేరేసరికి రక్తనాళాల బ్రాంచిలు అతి చిన్న రక్తనాళాలతో ముగుస్తాయి. ఈ అతి చిన్న రక్తనాళాలు వెంట్రుకల లాగా సన్నగా ఉండటం వల్ల వీటిని రక్తకేశ నాళికలుగా (బ్లడ్‌ కాపిలరీస్‌) వ్యవహరిస్తారు.


గుండె దగ్గరి నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం కూడా ఈ సూక్ష్మ రక్తనాళాలైన రక్తకేశ నాళికలతో కలవాలి. కానీ గాలెన్‌ మాల్‌ ఫార్మేషన్‌ ఉన్నప్పుడు ఈ రక్తనాళం బ్లడ్‌ కాపిలరీస్‌ తో కలవడానికి బదులుగా డీఆక్సిజినేటెడ్‌ బ్లడ్‌ తీసుకెళ్లే సిరలతో (వీన్స్‌) కలుస్తుంది. దాంతో రక్తంలో పీడనం పెరిగి అనేక కాంప్లికేషన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా జన్యు లోపాల వల్ల ఈ గాలెన్‌ మాల్‌ ఫార్మేషన్‌ ఏర్పడుతుంది.

ఏ సమస్యలు వస్తాయి?

గాలెన్‌ మాల్‌ ఫార్మేషన్‌ ఉన్నప్పుడు మెదడుతో పాటు గుండెకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి పిల్లలు సాధారణంగా హార్ట్‌ ఫెయిల్యూర్‌ వల్ల గానీ, పల్మొనరీ హైపర్‌ టెన్షన్‌ వల్ల గానీ చనిపోతారు. రక్తనాళాల్లో పీడనం పెరగడం వల్ల గుండె, ఊపిరితిత్తులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అందువల్ల గుండెపై భారం ఎక్కువై కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌ కి దారితీస్తుంది. ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో రక్త పీడనం పెరిగి, పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ వస్తుంది. మెదడులోని రక్తనాళంలో పీడనం ఎక్కువగా ఉండటం వల్ల మెదడు గాయపడుతుంది. కొంతవరకు మెదడు కణజాలం కూడా దెబ్బతినవచ్చు. కొందరు పిల్లలు చాలా పెద్ద తలతో (హైడ్రోసెఫాలిక్‌ హెడ్‌) పుడుతుంటారు. ఇందుకు గాలెన్‌ డిసీజ్‌ కూడా ఒక కారణమే. మెదడులో నార్మల్‌ ఫ్లూయిడ్‌ ఫ్లో కి ఆటంకం ఏర్పడి హైడ్రోసెఫాలే అనే ఈ కండిషన్‌ ఏర్పడుతుంది.

గర్భంలోనే ఆపరేషన్‌!

గర్భస్థ శిశువులో గాలెన్‌ మాల్‌ ఫార్మేషన్‌ ను సాధారణ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా కొన్నిసార్లు కనిపెట్టలేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఎంఆర్‌ఐ స్కాన్‌ లో మాత్రమే ఈ లోపం డయాగ్నస్‌ అవుతుంది. ఈ సమస్యకు మెదడులో సర్జరీ చేసి, రక్తనాళాలను రిపేర్‌ చేయడం ఒక్కటే పరిష్కారం. కాని బిడ్డ పుట్టేవరకు ఆగి, ఆ తర్వాత సర్జరీ చేయాలంటే ఈలోపే బిడ్డకు గానీ, తల్లికి గానీ ప్రాణాపాయం సంభవించవచ్చు. అందుకే బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ కి చెందిన డాక్టర్‌ డారెన్‌ బి. ఆర్బాక్‌ బృందం బిడ్డ ఇంకా పుట్టకముందే ప్రయోగాత్మకంగా బ్రెయిన్‌ కి సర్జరీ చేయాలనుకున్నారు. అలా శిశువు తల్లి గర్భంలో ఉన్న సమయంలోనే అల్ట్రా సౌండ్‌ గైడెన్స్‌ లో మెదడుకు సర్జరీ చేశారు. లోపం ఉన్న రక్తనాళాన్ని సరిచేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా ప్రయోగాత్మకంగా చేసిన ఈ సర్జరీ సక్సెస్‌ అయింది. ఇప్పుడా శిశువు ఆరోగ్యంగా ఉంది. ఆహారం తీసుకుంటూ సాధారణంగానే బరువు పెరుగుతున్నది. మందులు కూడా ఏమీ వాడాల్సిన అవసరం రాలేదని డాక్టర్‌ డారెన్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

డారెన్‌ బి. ఆర్బాక్‌
MD, PhD
బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌
Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *