మలక్ పేట్ కేర్ హాస్పిటల్ లో అరుదైన స్పైన్ సర్జరీ
వెన్నుపాముకు సర్జరీ అంటేనే చాలా సంక్లిష్టమైనది. ఇక వృద్ధులకు స్పైన్ సర్జరీ చేయడమంటే కత్తి మీద సామే. కానీ హైదరాబాద్ మలక్ పేట లోని కేర్ హాస్పిటల్ వైద్యులు 80 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శివానంద రెడ్డి, అతని బృందం కలిసి ఆమె ఎప్పటిలా నడవగలిగేలా చేశారు. వెన్నులో నొప్పిని తగ్గించి, అతి తక్కువ సమయంలోనే ఆమెలో మొబిలిటీని పునరుద్ధరించారు. వెన్నుపాము చికిత్సల్లో ఇదొక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది.
వయసు పెరిగిన కొద్దీ అన్ని శరీర భాగాల్లాగే ఎముకల్లో కూడా బలం తగ్గుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఏమాత్రం దెబ్బ తగిలినా వెన్నుపాము లాంటి కీలక భాగాల్లో ఫ్రాక్చర్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. వీటివల్ల లేచి తిరగలేక, మంచానికే పరిమితం అయ్యేవాళ్లు కూడా ఉంటారు. కొందరికి సర్జరీ ద్వారా విరిగిన ఎముకలను అతికించి, కొంతవరకు మొబిలిటీ తీసుకురావొచ్చు. అయితే అరుదుగా వెన్నుపాముకు చేసే సర్జరీలు ఫెయిల్ అవుతుంటాయి. అలా సర్జరీ ఫెయిల్ అయిన తర్వాత మళ్లీ వెన్నునొప్పితో బాధపడుతూ, నడవలేక, కూర్చోలేక అవస్థలు పడుతున్న ఓ పేషెంటులో మొబిలిటీ తీసుకువచ్చారు కేర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ శివానంద రెడ్డి.
చిదమ్మ అనే 80 ఏళ్ల మహిళ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ మలక్ పేట్ కేర్ హాస్పిటల్ ను సంప్రదించారు. ఆమెకు గతంలో ఒకసారి వెన్నుపాముకు ఆపరేషన్ జరిగింది. వెన్నెముకలో ఫ్రాక్చర్ ఏర్పడటం వల్ల ఈ ఆపరేషన్ అవసరం అయింది. కానీ ఆపరేషన్ తర్వాత కూడా ఆమెకు లక్షణాల నుంచి ఉపశమనం లభించలేదు. పలు రకాల పరీక్షలు చేసిన తర్వాత గతంలో చేసిన శస్త్రచికిత్స సమయంలో స్క్రూలు సరిగ్గా అమర్చలేదని అర్థమైంది. దానివల్లనే స్పైనల్ కెనాల్ లో సమస్య ఏర్పడుతున్నట్టు తెలుసుకున్నారు. రోగి పరిస్థితులు, వయసు, ఇతరత్రా కొమార్బిడిటీ సమస్యలను బట్టి చికిత్సకు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆమెకు గతంలో వేసిన ఆ స్క్రూలను తొలగించి, అతి తక్కువ కోతతో (మినిమల్లీ ఇన్వేసివ్) వెర్టిబ్రా-స్టెంటోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు. ఈ శస్త్రచికిత్స ఆమెలో విజయవంతం అయింది.
శరీర ఎత్తును సరిచేయడానికి వెన్నుపూసల్లో బైలేటరల్ బ్లిస్టర్స్ ని ఉపయోగించారు. తర్వాత సిమెంటుతో సరిచేశారు. సర్జరీ తర్వాత చిదమ్మ తన నొప్పి నుంచి పూర్తిగా బయటపడింది. ఇప్పుడామె ఏ సపోర్టూ లేకుండా తనకు తానే కూర్చోగలదు. చాలా తక్కువ సమయంలో ఆమె జీవన నాణ్యత మెరుగుపడింది. ఆమె పూర్తిగా కోలుకుంది. ఆమెలో నొప్పి తగ్గడమే కాకుండా, నడవడం, కూర్చోవడం, నిల్చోవడంలో అంతకు మునుపు ఉన్న ఇబ్బందులన్నీ ఇప్పుడు లేవు.
వర్టిబ్రా-స్టెంటోప్లాస్టీ అనే ఈ చికిత్స హైదరాబాద్లో చాలా అరుదుగా నిర్వహించబడే ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ కేసు మరింత అసాధారణమైనది. 80 ఏళ్ల మహిళ రోగిలో ఈప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలంటే అత్యంత నైపుణ్యం ఉండాలి. అలాంటి నైపుణ్యం, నిబద్ధత ఉన్న డాక్టర్లు దొరకడం తన అదృష్టమని చిదమ్మ కృతజ్ఞతలు తెలిపింది.