ఎంద‌రో మ‌హా వైద్యులు… అంద‌రికీ వంద‌నాలు!

వ్యాధులు బాధ‌లు ముసిరేవేళ‌.. మృత్యువు కోర‌లు సాచే వేళ‌… గుండెకు బదులుగ గుండెను పొదిగి… కొన ఊపిరుల‌కు ఊపిరులూది.. జీవ‌న‌దాత‌లై వెలిగిన మూర్తుల‌.. సేవాగుణం మాకందించ‌రావా…

ప్రాణం పోసే వైద్యుల సేవాగుణం గురించి ఏనాడో స్తుతించారు డాక్ట‌ర్ సి. నారాయ‌ణ రెడ్డి. రోగాల బాధ‌లు చుట్టుముట్టి, ప్రాణభ‌యంతో అల్ల‌ల్లాడేట‌ప్పుడు త‌న హ‌స్త‌వాసితో అభ‌యం ఇచ్చేవాళ్లు… అవిశ్రాంతంగా ప‌నిచేస్తూ ఉండే గుండెకు జ‌బ్బు చేస్తే, కొత్త గుండెను సైతం అమ‌ర్చి ఊపిరి పోసే ప్రాణ దాత‌లు….

స‌మ‌యానికి తిండి ఉండ‌దు.. కంటి నిండా నిద్ర ఉండ‌దు… కుటుంబంతో హాయిగా గ‌డిపే స‌మ‌యం ఉండ‌దు… వ్య‌క్తిగ‌త జీవిత‌మంతా ధార‌పోసి, త‌మ పేషెంట్ల చిరున‌వ్వుల్లోనే ఆనందాన్ని వెతుక్కునే నిత్య శ్రామికులు.

అందుకే… ఎంద‌రో మ‌హా వైద్యులు… అంద‌రికీ వంద‌నాలు!

డాక్ట‌ర్లంటే డ‌బ్బు సంపాద‌నే ధ్యేయంగా ఉంటార‌నుకుంటాం.

డాక్ట‌ర్లంటే అతిగా టెస్టులూ, అన‌వ‌స‌ర‌మైన మందులూ రాస్తార‌నుకుంటాం.

డాక్ట‌ర్లంటే చిరాకుప‌డుతూ, పొడిపొడిగా మాట్లాడే అహంకారుల‌నుకుంటాం.

డాక్ట‌ర్లంటే అవ‌స‌రం లేని స‌ర్జ‌రీలు చేసి, డ‌బ్బు దండుకునే ధ‌న పిపాసుల‌నుకుంటాం.

ఇదంతా నాణానికి ఒక‌వైపే. అన్ని రంగాల్లోనూ ఉన్న‌ట్టే వైద్య రంగంలో కూడా కొన్ని క‌లుపు మొక్క‌లు పెరుగుతూనే ఉంటాయి. కానీ… నాణానికి ఇంకోవైపు… చ‌దువు మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచీ.. ఒక‌వైపు ల‌క్ష‌ల్లో ఫీజులు, మ‌రోవైపు చిన్న చిన్న సంతోషాల‌ను కూడా త్యాగం చేయ‌డం ఆరంభ‌మ‌వుతుంది. ప‌గ‌లైనా.. రాత్ర‌యినా… ఇంట్లో ఫంక్ష‌న్ ఉన్నా.. సినిమాకు వెళ్లినా… పెద్ద‌వ‌య‌సు త‌ల్లిదండ్రులున్నా.. ప‌సిబిడ్డ‌ల త‌ల్లిదండ్రులుగా ఉన్నా… త‌న‌కు అనారోగ్యంగా ఉన్నా…. ఎలా ఉన్నా.. ఎక్క‌డున్నా… త‌న పేషెంటు డేంజ‌ర్ లో ఉన్నాడంటే కాళ్ల‌కు చ‌క్రాలు క‌ట్టుకుని వాలిపోవాల్సిందే. ఇదీ… వైద్యుల జీవితం.

ఆరోగ్యంగా ఉండే వ్య‌క్తే మాన‌సికంగా కూడా బ‌లంగా ఉంటాడు. దేశం అభివృద్ధి చెందాలన్నా, స్వేచ్ఛా స్వాతంత్య్రాల‌తో విల‌సిల్లాల‌న్నా… స‌మాజంలోని ప్ర‌తి వ్య‌క్తీ ఆరోగ్యంగా ఉండాలి. అది వాళ్ల హ‌క్కు…. అంటారు డాక్ట‌ర్ బి.సి. రాయ్‌. 1919, జూలై 1న జ‌న్మించిన డాక్ట‌ర్ బిదాన్ చంద్ర రాయ్ భార‌తీయ వైద్య చ‌రిత్ర‌లో కీల‌క పాత్ర పోషించి, ప్ర‌జారోగ్యం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన లెజెండ‌రీ ఫిజీషియ‌న్‌. అందుకే ఆయ‌న జ‌యంతి, వ‌ర్ధంతి అయిన జూలై 1న వైద్యుల దినోత్సవంగా జ‌రుపుకుంటాం. ఈ సంద‌ర్భంగా ఒక మెడిక‌ల్ జ‌ర్న‌లిస్టుగా నేను క‌లిసిన, ఎంతోమంది వైద్య మ‌హాశ‌యుల‌కు వంద‌నం… అభివంద‌నం.

Spread the love

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *