అభద్రతను అధిగమిద్దాం

ఏ మనిషిని చూసినా అపనమ్మకం.. ఏ బంధమైనా దూరం అయిపోతుందేమోనన్న భయం.. తనకన్నా పనికిరాని మనిషి ఉండరన్న అపోహ.. అయితే అధికార ధోరణి, లేదంటే ఆత్మన్యూనత.. వెరసి అభద్రతాభావం. బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలు, మానసిక గాయాలు మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తనపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయని చెప్పడానికి నిదర్శనమే అభద్రతాభావం లేదా ఇన్‌సెక్యూరిటీ. మన ఎదుగుదలనే కాదు, అనుబంధాలను కూడా దూరం చేసే అభద్రతాభావాన్ని అధిగమించాలంటే…

అభద్రత లేదా ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌కి బీజం చాలావరకు బాల్యంలోనే పడుతుంది. తిరస్కారాలు, ప్రేమరాహిత్యం వంటి నెగటివ్‌ భావోద్వేగాలను ఎదుర్కొన్నవారిలో ఇలాంటి ఫీలింగ్‌ డెవలప్‌ అవుతుంది. వీళ్లకు పసితనంలో ఏదో ఒకరకమైన చేదు అనుభవం ఉండవచ్చు. ఇలాంటి గాయాలకు సకాలంలో మానసిక సాయం అందకపోతే ఆ మచ్చ మనసులో మరుగునపడి ఉండిపోతుంది. దాంతో ఆత్మన్యూనత, అనుబంధాల మీద నమ్మకం లేకపోవడం, తమలో ఏదో లోపం ఉందని భావించడం వంటి లక్షణాలు ఏర్పడుతాయి. ప్రపంచంలో ఎవరూ తమను ఇష్టపడరని అనుకుంటారు. ఎవరైనా తమతో ప్రేమగా ఉంటున్నారంటే కచ్చితంగా ఏదో ఆశిస్తున్నారనుకుంటారు. అది కాగానే వదిలేస్తారని భ్రమిస్తుంటారు. ఎవరినీ తమ మనసుకు దగ్గరగా రానీయరు. వీళ్లు ఒకరకమైన బెదిరింపు ధోరణితో ఉంటారు. లేదా ఎక్కువ బిడియంగా ఉంటారు. ఈ ఇన్‌సెక్యూరిటీ క్రమంగా కంట్రోలింగ్‌ పర్సనాలిటీ లేదా అవకాశవాదంగా పరిణమించవచ్చు.

ఇన్‌సెక్యూరిటీని అధిగమించాలంటే ముందు సమస్య ఉందని గుర్తించగలగాలి. తమతో అతి దగ్గరి సంబంధం కలిగినవారిపట్ల నమ్మకం పెంచుకునే ప్రయత్నం చేయాలి. చిన్నప్పుడు ఎదురైనా చేదు అనుభవాలు తెలుసుకుని వాటి గాయాలను నయం చేయాలి. పరిస్థితులను ఎదుర్కోలేక తప్పించుకోవద్దు. ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇతరులను నమ్మడం అనే రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధపడాలి. తమలో ఉన్న నమ్మకాలు, భయాలను పక్కన పెట్టి సమస్యలను ఎదుర్కోవాలి. మొండిగా ప్రవర్తించవద్దు. ఆత్మన్యూనతను అధిగమించే ప్రయత్నం చేయాలి. తమ కోసం తాము నిర్మించుకున్న రక్షణ వలయాన్ని ఛేదించి, అందులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాలి. అందరూ తమను బాధపెడతారని ఎవరికీ ఆ అవకాశం ఇవ్వకూడదనే భ్రమ నుంచి బయటపడాలి. ఇందుకు కౌన్సెలింగ్‌ సహాయపడుతుంది.

డా. రాధిక నల్లాన్ ఆచార్య

క్లినికల్ సైకాలజిస్టు

హైదరాబాద్

Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *