ప్రశ్న: మా నాన్నగారి వయసు 60. నా చిన్నప్పటి నుండి ఆయన దాదాపు 30 ఏళ్లుగా ఆస్థమాతో భాధపడుతున్నారు. ఒక రకంగా మా కుటుంభానికంతటికీ నరకమే. అన్ని రకాల స్టెరాయిడ్స్, టాబ్లెట్స్, ఇన్ హేలర్స్ వాడిన ఇప్పడికీ నయం కాలేదు. చలికాలం వస్తే సమస్య మరింత ముదురుతుంది. తీవ్రమ్యైన ఆస్థమాకు శాశ్వత పరిష్కారం గురించి తెలియజేయగలరు.
– షేక్ నాదర్ వలి, చిత్తూరు.
జవాబు: తరతరాలుగా వేధిస్తున్న ఈ దీర్ఘ వ్యాధికి సంబంధించిన చికిత్సా విధానాలు, అదుపుచేసే పరిస్థితులు ఇపుడు వేగంగా మారిపోతున్నాయి. గడచిన ఇరవై ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా సంస్థలు, వైద్యకేంద్రాలలో జరిగిన పరిశోధనల ఫలితంగా ఆస్తమాను అదుపు చేయటమే కాకుండా తీవ్రమైన ఆస్తమా నుంచి రక్షించగల చికిత్సా విధానాలు రూపొందాయి. ఇదివరకటిలాగా జీవిత పర్యంతం స్టిరాయిడ్లు, ఇతర మందులు వాడాల్సిన దుస్థితి ఇప్పుడు లేదు. ప్రపంచస్థాయి వైద్యకేంద్రాలకే పరిమితమవుతూ వచ్చిన ఈ ఆధునిక చికిత్సలు ఇపుడు మన దేశంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి బ్రాంకియల్ థర్మోప్లాస్టీ.
తీవ్రమైన ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం ఇవ్వగల అత్యాధునిక చికిత్స ఇది. ఈ ప్రక్రియలో ఒక ప్రత్యేక పరికరం (ప్రోబ్)ను ఉపయోగించి శ్వాననాళపు గోడలను వేడిచేస్తారు. బ్రాంకోస్కోప్ ద్వార వెళ్లే ఈ ప్రోబ్ అందించిన వేడిమితో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్ తొలగిపోతుంది. దాంతో శ్వాసమార్గం విశాలంగా తెరుచుకుంటుంది. ఈ ప్రక్రియను మూడేసి వారాల చొప్పున వ్యవధిలో ఇస్తూ మూడు దఫాలుగా నిర్వహిస్తారు. ఈ మూడు దఫాల చికిత్సా ప్రక్రియ పూర్తయ్యే సరికి తీవ్రమైన ఆస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. చెప్పుకోదగ్గ ఉపశమనం లభిస్తుంది. సహజంగానే వ్యక్తి జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అదే సమయంలో ఆస్తమా అటాక్స్ సంఖ్య, ఆ కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి రావటం తగ్గిపోతుంది. ఈ చికిత్సా ప్రక్రియ ఫలితం చాలా కాలం పాటు (కనీసం ఎనిమిది సం.లు) నిలిచివుంటుంది. శ్వాసమార్గంలో ఆటంకంగా తయారయిన మృదువైన కండరాల పరిమాణాన్ని తగ్గించే ఒకే ఒక్క చికిత్స బ్రాంకియల్ థర్మోప్లాస్టీ. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన, ఇన్హేలర్ మందుల వల్ల ప్రయోజనం లభించని ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఈ ప్రక్రియను ఎంచుకోవచ్చు. మీరు మీ నాన్నగారిని మీకు దగ్గరలోని శ్వాసకోశ వైద్యునికి చూపించండి. ఈ చికిత్స గురించి అడిగి, తెలుసుకోండి. మీ నాన్నగారు ఇక జీవితాంతం ఆస్తమాతో బాధపడాల్సిన అవసరం లేదు.
డాక్టర్. వి. నాగార్జున మాటూరు
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ-హైదరాబాద్.