రాత్రి బాగానే పడుకున్నాడు.. ఉదయం లేచేసరికి ప్రాణం లేదు. నిద్రలోనే పోయాడు పాపం…! ఏ అర్ధరాత్రో గుండెపోటు వచ్చినట్టుంది… ఇలాంటి మాటలు, సంఘటనలు చాలా వింటుంటాం. చూస్తుంటాం. రాత్రిపూట నిద్రలో వచ్చే గుండెపోట్లు చాలా ప్రమాదకరమైనవంటున్నారు వైద్యులు.
కొందరికి రెండుమూడు సార్లు గుండెపోటు వచ్చినా తట్టుకుంటారు. ఆపరేషన్ చేయించుకునో, స్టెంట్ వేయించుకునో ప్రమాదం నుంచి బయటపడిపోతుంటారు. మరికొందరు మాత్రం ఏ రాత్రిపూటో గుండెపోటు వచ్చి నిద్రలోనే హఠాన్మరణం పొందుతుంటారు. ఇలా నిద్రలో గుండెపోటు వచ్చే వాళ్ల సంఖ్య ఇటీవల పెరుగుతున్నదనీ, ఇలాంటి గుండెపోట్లు ప్రమాదకరమైనవనీ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎస్‌టి ఎలివేషన్ మయకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ అనే రకానికి చెందిన గుండెపోటు మరింత ప్రమాదకరమంటున్నారు పరిశోధకులు. ఈ తరహా గుండెపోటు వల్ల చనిపోయే అవకాశం 10 నుంచి 15 శాతం ఎక్కువగా ఉంటుందని యూరప్, అమెరికా, కెనడా పరిశోధకులు చేసిన వేర్వేరు అధ్యయనాల్లో వెల్లడైంది. రాత్రిపూట, వారాంతంలో గుండెపోటుతో హాస్పిటల్‌కి వచ్చే పేషెంట్లు చికిత్స మొదలుపెట్టేముందే చనిపోతున్నారు. లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన నెల రోజుల్లోగా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటున్నది. ఇతర సమయాల్లో గుండెపోటు వచ్చిన వాళ్ల కన్నా ఇలా రాత్రి సమయంలో గుండెపోటుకు గురైన వాళ్లు చనిపోయే అవకాశం 5 శాతం ఎక్కువగా ఉంటున్నదని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందుకే గుండెజబ్బులున్నవాళ్లు రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.