కొవిడ్ వచ్చిన తర్వాత చాలామంది రియాలైజ్ అయ్యారు. ఉన్నది ఒక్క జిందగీ నా కాదా అన్నది పక్కన పెడితే.. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నన్నాళ్ళూ ఆరోగ్యంగా ఉండాలన్న నిర్ణయానికి మాత్రం వచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండటం ముఖ్యం. ఇందుకు రిలేషన్స్ ప్రాతిపదిక. మరి వాటిని కాపాడుకోవాలంటే..
నివేదితకి అయిదేళ్ళ బాబు ఉన్నాడు. భర్తతో మనస్పర్థలు. దాంపత్యం గాడి తప్పింది. ఆమె మనసులోకి మరో వ్యక్తి వచ్చాడు. అతని మాటల చాతుర్యాయానికి లొంగిపోయి, అతనితో వెళ్ళిపోయింది. ఓ నెల రోజుల పాటు అతనితో సహజీవనం చేశాక అప్పుడు అర్థమైంది.. తాను తప్పు చేసిందని. అనుక్షణం అనుమానించే ఇలాంటి వ్యక్తి కోసమా తాను బాబును కూడా వదిలేసి వచ్చాను.. అని పశ్చాత్తాపం చెందింది. భర్త చెంతకు చేరింది.
అతని స్థానంలో ఎవరున్నా ఏం చేస్తారు..? ఇంకోసారి ఇంటి గడప తొక్కవద్దంటారు. విడాకులు తీసుకుంటారు. కానీ ఆ భార్యా భర్తలు ఇద్దరూ ఇప్పుడు అన్యోన్యంగా ఉన్నారు. చేరదీసిన భర్త పట్ల కృతజ్ఞత ఆమెకు ఎల్లకాలం ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో ఈ సంతోషానికి కారణం.. అతని లోని క్షమాగుణం.
*********
ఫస్ట్ నైట్ రోజున పాల గ్లాసుతో పాటు ఓ ఉత్తరం కూడా ఇచ్చిందామె. తన కన్నా పదేళ్ళు చిన్నదైన తన మరదలు ఇచ్చిన యా ఉత్తరం చదివి అవాక్కయ్యాడు అతను. కాలేజీలో చదువుకునేటప్పుడు తాను వేరే వ్యక్తిని వన్ సైడ్ గా ప్రేమించానని, ఇప్పుడు ఈ భర్త మీద ప్రేమ లేదని దాని సారాంశం. బయటికి వచ్చి ఎటువంటి రాద్దాంతం చేయలేదు అతను. చిన్నపిల్ల తనంగా భావించి ఆమెను క్షమించేశాడు. ఫలితంగా నాలుగు రోజుల్లోనే ఆమెకు అతని మీద ప్రేమ పుట్టింది.
ఇవి యదార్థ గాథలు. క్షమించడం వల్ల కలిగే మంచి ఫలితాలకు ఉదాహరణలివి. ఆమె చేసిన పొరపాటును అతను అన్నీ కోణాల్లో అర్థం చేసుకోవడం వల్ల క్షమించగలిగాడు. తనవల్ల ఆమె మరింత సంతోషంగా ఉండటం కోసం ప్రయత్నించాడు. అతను క్షమించడం వల్ల ఆమె మరింత అపరాధ భావనకు లోనైంది. జీవితంలో మరే తప్పూ చేయొద్దనుకుంది. అతనికి ఏమాత్రం కష్టం కలుగకుండా చూసుకుంది. అప్పటి వరకూ ఉన్న మనస్పర్థలు తొలగిపోయాయి. వాళ్ళ దాంపత్య బంధం మరేనాడూ ఏ కారణం వల్ల కూడా విచ్చిన్నం కానంతగా బలపడింది. అదే క్షమ ఫలితం. భార్యా భర్తల మధ్య ఇది తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం.
*******
అనుబంధాలు బలపడాలంటే, పెట్టని గోడలా నిలబడాలంటే వదిలేయాల్సింది కోపతాపాలు. కావాల్సింది క్షమించగలగటం. అవతలి వాళ్ళు తమను బాధ పెట్టే పని “ఏదో” చేశారని కోపం తెచ్చుకోవడం సహజం. ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. అయితే యా కోపం తాత్కాలికమై మనస్పర్థలను తొలగించుకుంటే పరవాలేదు. కానీ కోపం తీవ్ర స్థాయికి చేరి, ద్వేషంగా మారితే అనుబంధపు గోడలు బీటలు వారుతాయి. తీయని అనుబంధాలు చేదుగా మారుతాయి. అవతలి వాళ్ళు చేసిన ఆ “ఏదో” అనేదాన్ని పక్కన పడేస్తే సంతోషంగా ఉండగలుగుతాం. అప్పటి వరకు పటిష్టంగా నిలబడి ఉన్న మంచి బంధమంతా యా “ఏదో” అన్న ఫీలింగ్ వచ్చిపడగానే తుడిచిపెట్టుకుపోతుంది. వ్యతిరేక భావనలు మొదలవుతాయి. అప్పటి నుంచి యా అనుబంధం పట్టాలు తప్పి సంతోషాన్ని దూరం చేస్తుంది. కొన్ని సందర్భాలలో అవతలి వాళ్లు చేసిన పొరపాటును క్షమించలేక చివరికి ద్వేషంగా మారుతుంది. ఫలితంగా వాళ్ళని మన జీవితంలో నుంచి పూర్తిగా తొలగిస్తాం.
క్షమిస్తే..
ఒకవేళ అవతలి వ్యక్తి చేసిన దానికి మనం క్షమించేశాం అనుకోండి. దీనివల్ల రెండు రకాలుగా లాభం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని బాగు చేస్తుంది. అంటే రిలేషన్ బాగవుతుంది. ఇక రెండోది, కోపం – దానివల్ల కలిగే పరిణామాలను నివారిస్తుంది. మన మనసు ప్రశాంతం అవుతుంది. అప్పటి వరకు ఉన్నట్టుగా రిలేషన్ ఉండకపోవచ్చు. కానీ మీరు మోసుకుంటూ వస్తున్న బాధల బరువును తప్పనిసరిగా దింపుతుంది అని చెప్తారు సద్గురు జగ్గీ వాసుదేవ్. కొన్నిసార్లు రిలేషన్ కొత్త రూపును సంతరించుకోవచ్చు. మరింత నిజాయతీగా, మరింత అవగాహనతో ఉండవచ్చు. అప్పటి వరకూ ఏర్పడిన చిక్కుముడులు విడిపోవచ్చు అని చెప్తారాయన.
కర్మ సిద్దాంతం
క్షమించడం అనే అంశం కర్మ సిద్దాంతం పరిధి లోకి కూడా వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారంటే ఇంతకు ముందు మీరు కూడా మరెవరినో బాధ పెట్టి ఉంటారన్నది నిజమే. మనం ఇచ్చిందే మనకు తిరిగి వస్తుంది కదా. ఒకరి తప్పును ఒప్పుకోని, క్షమించాలి. అదే విధంగా మనం తప్పు చేసినప్పుడు క్షమించమని అడగాలి. ఈ రెండూ చేయాలంటే మన ఇగో ను వదిలేయాలి.
క్షమించడం ఎలా పని చేస్తుంది?
క్షమించాలంటే ఉన్న పరిస్థితిని ఒప్పుకోగలగాలి. ఎదురైన పరిణామాలను ఆక్సెప్ట్ చేయగలగాలి. అవతలి వాళ్ళ తప్పును పోనీలే అని సర్దుకు పోగలగాలి. ఏదైనా సంఘటన లేదా ప్రవర్తన బాధపెట్టినప్పుడు అవతలి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి. ప్రతి ఒక్కరి లోనూ లోపం ఉంటుంది. తప్పు ఎందుకు చేశారు లేదా ఎందుకు బాధపెట్టారు అనడానికి ఒక వివరణ ఉంటుంది. అలా వాళ్ళ కోణంలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. యా చెడు ఘటనను మనసులో నుంచి తుడిచిపెట్టేయాలి. లోతుగా శ్వాస తీసుకుని, శ్వాసతో పాటుగా ఆ విషయాన్నీ వదిలేయాలి. అందుకే కోపం వచ్చినప్పుడు గట్టిగా శ్వాస తీసుకుని వదలమని చెప్తారు మానసిక నిపుణులు. ఇలా క్షమించడం వల్ల, క్షమా పొందడం వల్ల గానీ చివరికి సంతోషమే మిగులుతుంది. ప్రశాంతత సొంతమవుతుంది. మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉండటానికి కూడా తొలి మెట్టు క్షమించడమే.
– రచన ముడుంబై
Great analisis. Keep it up rachana. 👏👏
thank you ne.