చెంగు చెంగున గెంతులేసే ఆరేళ్ల పిల్లవాడు ఆడుకుని రాగానే ఒక్కసారిగా డల్ అయిపోయాడనుకోండి.. ఆటల వల్ల అలసిపోయాడేమో అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు కాళ్లు నొప్పులమ్మా అంటూ ఏడుస్తూ ఉంటే.. బాగా ఆడావ్ కదా.. నొప్పులు అవే పోతాయ్ లే అంటూ సర్దిచెప్తుంటాం. చాలావరకు ఇలా ఎక్కువగా ఆడడం వల్లనే కాళ్ల నొప్పులు రావొచ్చు. కానీ పిల్లలు కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు అంటుంటే వాటి వెనుక వేరే కారణాలు కూడా ఉండొచ్చంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుందామా…
పిల్లలు బాడీ పెయిన్స్ అంటున్నారంటే సాధారణంగా సాయంకాలం 6-7 గంటల టైం లో చాలా బాధపడుతుంటారు.. ఒక్కొక్కసారి రాత్రిపూట కూడా కాళ్లనొప్పులంటూ బాధపడుతుంటారు. దీనికి కారణం తెలియక కంగారుపడుతుంటారు తల్లిదండ్రులు. అయితే నొప్పులు ఉన్నప్పటికీ పిల్లల ఎదుగుదలలో గానీ, శారీరక పెరుగుదలలో గానీ ఎటువంటి సమస్యలు లేకపోతే కంగారుపడాల్సిన పనిలేదు. గ్రోత్, డెవలప్ మెంట్, యాక్టివ్ గా ఆడుకోవడం, అల్లరి చేయడం అన్నీ సాధారణంగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఎత్తు, బరువు, తల కొలత, వయసుకు తగిన పనులన్నీ చేస్తుంటే ఏ సమస్యా లేనట్లే.
నొప్పులు.. ఎందుకంటే…
ఈ నొప్పులకు అతి సాధారణమైన కారణం గ్రోయింగ్ పెయిన్స్. శారీరక, మానసిక ఎదుగుదల బావుండి.. అన్ని విషయాల్లో మంచిగా రాణిస్తుంటే.. అన్నీ బావున్నాయి గానీ నొప్పులొకటే సమస్య అనుకున్నప్పుడు అవి సహజమైన నొప్పులే అనుకోవాలి. శరీరం ఎదిగేటప్పుడు.. బాడీతో పాటు ఎముకలు స్ట్రెచ్ అవుతాయి. ఎముక పై భాగాన్ని పెరియాస్టియమ్ అంటారు. దీనికి నర్వ్ సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎముకలోని పెరియాస్టియమ్ భాగం స్ట్రెచ్ అయినప్పుడు నొప్పి రావడం సహజం. గ్రోయింగ్ పెయిన్స్ రావడానికి ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా కారణమే. పిల్లలది ఆడుకునే వయసు. ఆ వయసులో చాలా ఎక్కువగా ఆడుతారు వాళ్లు. చిన్న పిల్లలు అంత విపరీతంగా ఆటలు ఆడినప్పుడు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ వల్ల కండరంలో పెయిన్ రావడం సహజం. దానికి రెస్ట్ కావాలి. రెస్ట్ తో చాలావరకు నొప్పి పోతుంది. అలా తగ్గకపోతే కొబ్బరి నూనెతో కాళ్లు అంతటా మసాజ్ చేస్తే రిలీఫ్ ఉంటుంది. ఒక వేళ ఇంకా తీవ్రమైన నొప్పి ఉంటే సింపుల్ పారాసిటమాల్ మందు సరిపోతుంది. కిలో శరీర బరువుకి 15 మి.గ్రా. వేయాలి. పారాసిటమాల్ సిరప్ గానీ, టాబ్లెట్ గానీ శరీర బరువును బట్టి ఆ మోతాదులో ఇస్తే నొప్పి తగ్గిపోతుంది. వేడినీళ్ల కాపడం పెట్టినా కూడా తగ్గుతుంది. ఈ సింపుల్ చిట్కాలతో గ్రోయింగ్ పెయిన్స్ తగ్గిపోతాయి.
పోషకాల లోపం..
ఎత్తు, బరువు, తల కొలత అదేవిధంగా వయసుకు తగిన డెవలప్ మెంట్ గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, పర్సనల్-సోషల్ స్కిల్స్, భాష, తెలివితేటలు లాంటివి వయసుకు తగినట్టు లేని పక్షంలో అంటే గ్రోత్, డెవలప్మెంట్ లో తేడా కనిపిస్తే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కొందరిలో బాడీ పెయిన్స్ తో పాటు వేరే లక్షణాలు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు చాలామంది పిల్లలు సరిగా తినరు. నొప్పి వస్తుందని చెప్పలేరు గానీ అస్తమానం చిరాకు పడుతుంటారు. కోపంగా అన్నీ విసిరికొడుతుంటారు. చాలా ఇరిటబుల్గా ఉంటారు. స్కూల్‌కి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. లక్షణాలుంటే సాధారణంగా పోషకాల లోపం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తగినంత రక్తం లేక అనీమిక్ పరిస్థితి ఉండొచ్చు. వీళ్లు చలాకీగా ఆడుకోకుండా ఒకేచోట స్తబ్దుగా ఉంటారు. పదే పదే ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇలాంటివి గమనించాలి.
డి విటమిన్ తగ్గితే…
ఒంట్లో రక్తం లేకపోవడానికి కారణం సింపుల్ గా నులిపురుగులు అయివుండొచ్చు. నట్టలు కూడా అయివుండొచ్చు. రెండో ముఖ్యమైన కారణం విటమిన్ డి లోపం. పిల్లలకు సూర్యరశ్మి తగలడం చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్లు ఎండలో తిరగాలి. మన ఒంట్లో కాల్షియం ఉన్నా కూడా అది బోన్ లోకి తనకు తానే ప్రవేశించదు. విటమిన్ డి సహాయంతోనే అది ఎముకలకు చేరి వాటికి బలం ఇస్తుంది. విటమిన్ డి టాబ్లెట్లు, మందుల ద్వారా కన్నా కేవలం సూర్యరశ్మిలోనే ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు విటమిన్ సి, బి12 లోపం వల్ల కూడా బాడీ పెయిన్స్ వస్తాయి.
అందుకే పిల్లలు గంట, గంటన్నర ఆరుబయట ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న పిల్లలకి మన సంప్రదాయం ప్రకారం వారానికి 7 రోజులు కుదరకపోయినా కనీసం 3,4 రోజులైనా కూడా పిల్లల్ని ఎండలో కూర్చోబెట్టి వాళ్ల ఒళ్లంతా నూనె పట్టించాలి. నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె దేంతోనైనా సరే మసాజ్ చేసి, కొద్దిసేపు ఎండలో వాళ్లను వదిలేయాలి. సమయం సరిపోదంటే ఆ టైంలో టిఫిన్ అయినా పెట్టేయొచ్చు. ఉదయం కుదరకపోతే స్కూల్ నుంచి వచ్చాక 4 గంటల టైంలో చేయండి.
ఏ కారణం.. ఏ నొప్పి?
గ్రోయింగ్ పెయిన్స్ వల్ల ఒళ్లునొప్పులు, కాళ్లనొప్పులు వస్తున్నాయా.. లేక వేరే కారణం ఏదైనా ఉందా అని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లవచ్చు. గ్రోయింగ్ పెయిన్స్ అయితే ఎక్కువ మటుకు శరీరం మొత్తం నొప్పులు రావు. చాలావరకు పిక్క మజిల్ లేదా తొడ మజిల్స్ లో గాని ఉన్న ఎముకల్లో కనిపిస్తాయి. విటమిన్ లోపం గానీ, ఎనీమియా వల్లగానీ అయితే సాధారణంగా శరీరం మొత్తం నొప్పి ఉంటుంది. కాళ్లు, జబ్బలు, వెన్నుపూసల్లో కూడా నొప్పులు ఉంటాయి. ఈ నొప్పి చాలా ఎక్కువగా బాధపెడ్తుంది. ఒక్కోసారి 7,8 సంవత్సరాల పిల్లలు కూడా విపరీతమైన నొప్పి అంటారు. ముట్టుకుంటే కూడా నొప్పి అని ఏడుస్తుంటారు. ఇలాంటప్పుడు డాక్టర్ ను కలిసి అవసరమైన మందులు తీసుకోవాలి.
ఈ జబ్బులున్నా.. నొప్పులే
- పిల్లల్లో కనిపించే జన్యు వ్యాధుల్లో ఒకటి ఫైబ్రోమయాల్జియా. ఇది మస్కులో స్కెలిటల్ సిస్టమ్ కి సంబంధించిన వ్యాధి. ఎముక, కీలు, ఎముక మీద ఉండే కండరాలను కలిపి మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అంటారు. ఎముకను కండరానికి కనెక్ట్ చేసి ఉంచడానికి లిగమెంట్ అనే ఫైబ్రస్ కణజాలం ఉంటుంది. వీటిలో దేనికి సంబంధించిన సమస్యైనా ఫైబ్రోమయాల్జియాగా కనిపించవచ్చు. దీనికి కొన్ని జన్యుపరమైన కారణాలు గానీ, ఎన్విరాన్ మెంటల్ కారణాలయిండొచ్చు. ఇది ఉన్నప్పుడు పిల్లల్లో శరీరం మొత్తం కాళ్లూ, చేతులు, తల, వెన్నుపూస ఎక్కడైనా కూడా విపరీతమైన నొప్పి ఉండొచ్చు. బ్లడ్ టెస్ట్ లో ఏ లోపాలూ ఉండవు. బోన్ లో ఏమీ లోపం ఉండదు. ఏమీ కనబడదు. కానీ పెయిన్ ఎక్కువ కనిపిస్తుంది.
- పిల్లల్లో కొందరిలో అరుదుగా కనిపించే వ్యాధి బోన్ క్యాన్సర్. ఎముకలో క్యాన్సర్ ఉన్నప్పుడు సాధారణంగా నొప్పి వెంటనే కనిపించదు. ఒకట్రెండు నెలల తరువాత నెమ్మదిగా నొప్పి రావొచ్చు. ఇతర లక్షణాలేవీ ఉండవు. అయితే ఏదో ఒక కాలిలో మాత్రమే ఈ నొప్పి కనిపిస్తుంది. మొత్తం శరీరం నొప్పులు గానీ, రెండు కాళ్ల నొప్పులు గానీ కాకుండా ఒకే కాలులో ఒకే భాగంలో నొప్పి వస్తుంటే అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇది ఎక్స్‌రేలో తెలిసిపోతుంది. తొందరగా గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించొచ్చు.
- చాలా సందర్భాల్లో పెద్దవాళ్లకు కూడా ఏదైనా జ్వరం వచ్చి తగ్గిన తరువా కాళ్ల నొప్పులు రావడం కనిపిస్తుంటుంది. సాధారణంగా వైరల్ ఫీవర్లు వచ్చినప్పుడు ఇలాంటి పెయిన్స్ వస్తుంటాయి. పిల్లల్లో కూడా అంతే జ్వరంతో పాటుగా ఒళ్లునొప్పులు లేదా కాళ్ల నొప్పులు ఉండొచ్చు. కొన్ని సార్లు జ్వరం తగ్గిన తరువాత కూడా ఒళ్లు నొప్పులు ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఇన్ ఫెక్షన్ కి మందులు తీసుకుంటే క్రమంగా సమస్యలు తగ్గిపోతాయి.
- తరచుగా శరీరం మొత్తం నొప్పి అంటున్నారంటే పోషకాహార లోపమేమో అని చెక్ చేసుకోవాలి.
ఏది ఏమైనా నొప్పులు తీవ్రంగా బాధపెడుతున్నాయన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే సమస్య ఏదనేది అసెస్ చేస్తారు. మిగతా సమస్యలు లేవని రూలౌట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.