రక్త పరీక్ష ఎందుకు?

నీరసంగా ఉన్నా, జ్వరం వచ్చినా.. డాక్టర్‌ దగ్గరికి వెళ్లగానే ముందుగా చేయించేది రక్త పరీక్ష. అనేక రకాల సమస్యలను కేవలం కొన్ని మిల్లీ లీటర్ల రక్తాన్ని పరీక్షించడం ద్వారా తెలుసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో వ్యాధుల గుట్టు విప్పవచ్చు. రక్త పరీక్ష ద్వారా ఏమేమి తెలుసుకోవచ్చంటే…

మన ఆరోగ్యం ఎప్పటికప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలంటే అవసరమైనప్పుడు రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు డాక్టర్లు. ఏడాదికోసారి సాధారణ రక్తపరీక్షలు చేయించుకుంటే మంచిదంటారు. శరీరంలోని రకరకాల రుగ్మతలకు మూలం చాలావరకు రక్తంలోనే తెలుస్తుంది. పోషకాలు తక్కువైనా, హార్మోన్ల సమస్యలున్నా, ఇన్‌ఫెక్షన్లున్నా, కిడ్నీ పనితీరు తెలుసుకోవాలన్నా.. ఇలా రకరకాల సందర్భాల్లో రక్తపరీక్షలు అవసరం అవుతాయి. అసాధారణంగా బరువు తగ్గుతున్నా, పెరుగుతున్నా, తీవ్రమైన నీరసం ఉంటున్నా డాక్టర్లు రక్తపరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు.

గ్రూపు తెలుసుకోవడం కోసం..

రక్తంలో ఎ,బి,ఎబి,ఒ అనే గ్రూపులుంటాయి. రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఆయా గ్రూపు రక్తమే ఎక్కించాల్సి వస్తుంది. కాబట్టి సాధారణంగా సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు బ్లడ్‌ గ్రూప్‌ చెక్‌ చేస్తారు. బిడ్డ పుట్టగానే కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారు.

కంప్లీట్ బ్లడ్‌ పిక్చర్‌

రకక్తంలో ఉండే కణాల సంఖ్యతో పాటుగా రక్తంలో ఉండే 10 రకాల కాంపొనెంట్స్‌ గురించి ఈ పరీక్ష తెలుపుతుంది. ప్రధానంగా ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్‌ కణాలు, హిమోగ్లోబిన్‌ మోతాదు వంటివి తెలుసుకోవచ్చు. బి6, బి12 లాంటి విటమిన్‌ లోపాలు, ఇనుము లాంటి ఇతర సూక్ష్మ పోషకాలు లోపించినప్పుడు, బోన్‌ మ్యారో సమస్యలున్నా, ఇన్‌ఫెక్షన్లున్నా, గుండె, క్యాన్సర్‌ సంబంధిత సమస్యలున్నప్పుడు సిబిపి పరీక్షలో బేసిక్‌ సమాచారం తెలుస్తుంది.

రక్తహీనతకు..

సాధారణంగా రక్తం తక్కువగా ఉన్నప్పుడు త్వరగా అలసిపోతుంటారు. చిన్న పనికే విపరీతమైన నీరసం వచ్చేస్తుంటుంది. ఇలాంటప్పుడు రక్తంలో ఇనుము తక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా హిమోగ్లోబిన్‌ తక్కువ అవుతుంది. దాంతో కణాలకు ఆక్సిజన్‌ తక్కువైపోయి నీరసం వస్తుంటుంది. ఇలాంటప్పుడు రక్తపరీక్ష చేయించుకుని హిమోగ్లోబిన్‌ మోతాదు తెలుసుకుంటే సాధారణంగా ఇనుము ఎక్కువగా ఉండే క్యారెట్‌, బీట్‌రూట్‌, పాలకూర వంటివి ఆహారంలో చేర్చడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. అవసరం అయితే ఐరన్‌ సప్లిమెంట్లు వాడాల్సి రావొచ్చు.

మధుమేహానికి..

డయాబెటిస్‌ ఉందో లేదో తెలుసుకోవడానికి చేసేవి రక్తపరీక్షలే. ఏమీ తినకముందు ఫాస్టింగ్‌లో ఒకసారి, తిన్న రెండు గంటల తర్వాత పోస్ట్‌ లంచ్‌ ఒకసారి షుగర్‌ టెస్ట్‌ కోసం బ్లడ్‌ శాంపిల్‌ తీసుకుంటారు. అయితే మధుమేహం ఉందో లేదో తెలుసుకోవడానికి మొదటిసారిగా చేసే పరీక్ష గ్లూకోజ్‌ టాలరెంట్‌ టెస్ట్‌ (జిటిటి). దీనిలో ఖాళీ కడుపుతో వచ్చినవారికి 75 గ్రాముల గ్లూకోజ్‌ను ఇస్తూ రెండు గంటల పాటు అరగంటకో శాంపిల్‌ రక్తాన్ని తీసుకుని పరీక్షిస్తారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు చేసే మరో ముఖ్యమైన పరీక్ష గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌. సాధారణంగా అధిక శ్రమ చేసినప్పుడు, భావావేశాలకు లోనైనప్పుడు రోజూ గ్లూకోజ్‌ విలువలు మారుతుంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పరీక్షను ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది.

గుండె కోసం..

ట్రైగ్లిజరైడ్స్‌, కొలెస్ట్రాల్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌ టెస్టుల కోసం రక్తంలోని సీరమ్‌ను ఉపయోగిస్తారు. గుండెజబ్బుల రిస్కు తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ప్రధానమైనవి. రిస్కు ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

నోట్‌ : మధుమేహం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నవాళ్లు నలభయ్యేళ్ల వయసు నుంచే ఏడాదికోసారి రక్తపరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందుజాగ్రత్త పడేందుకు వీలుంటుంది.

ఇన్‌ఫెక్షన్‌ ఉందా?

జ్వరంతో బాధపడుతున్నవారిలో ఇన్‌ఫెక్షన్‌ రకాన్ని తెలుసుకోవడానికి సీరమ్‌ టెస్టులు అవసరం అవుతాయి. సేకరించిన రక్తాన్ని కల్చర్‌ చేయడం ద్వారా బాక్టీరియా రకాన్ని కనుక్కునే వీలుంటుంది. సీరలాజికల్‌ మార్కర్స్‌ ద్వారా యాంటిజెన్‌ లేదా యాంటీబాడీ పరీక్షలు చేసి, వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను కనుక్కోవచ్చు. ఎయిడ్స్‌ వంటి వ్యాధుల నిర్ధారణలో సాధారణంగా యాంటీబాడీ టెస్టులనే వాడుతారు.

ప్లాస్మా పరీక్ష

రక్తంలో కణాలు కాకుండా మిగిలిన ద్రవాన్ని ప్లాస్మా అంటారు. దీన్ని పరీక్షించడం ద్వారా రక్తాన్ని గడ్డ కట్టించే కారకాల మోతాదు, లోపాలను తెలుసుకోవచ్చు.

కాలేయం, కిడ్నీ..

రక్తంలో బిల్‌రుబిన్‌ పరిమాణాన్ని బట్టి కాలేయ వ్యాధులను గుర్తించవచ్చు. క్రియాటినిన్‌ లెవల్స్‌ని బట్టి కిడ్నీ పనితీరును అంచనా వేయవచ్చు.

హార్మోన్ల సమస్యలు

అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారంటే ముందుగా వచ్చే అనుమానం థైరాయిడ్‌. ఈ హార్మోన్లలో తేడాలు తెలుసుకోవడానికి టి3, టి4, టి ఎస్ హెచ్, టి యాంటిజెన్‌ పరీక్షలు చేస్తారు. ఇందుకోసం రక్తపరీక్ష అవసరం అవుతుంది. ఇతర హార్మోన్లు ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌, టెస్టోస్టిరాన్‌ల మోతాదును కూడా రక్తపరీక్ష ద్వారానే తెలుసుకుంటారు.

క్యాన్సర్లకు

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అయినా, ఇతర సమస్య అయినా ప్రొస్టేట్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ ఉపయోగపడుతుంది. బ్లడ్‌ క్యాన్సర్లు కనుక్కోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన పరీక్ష బ్లడ్‌ టెస్టే.

Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *