పూణె క్యాన్సర్ హాస్పిటల్‌లో అన్ని క్యాన్సర్లకీ ఒకే ఉచిత మందు.. వార్త నిజం కాదు. ఇది అసత్యపు వార్త.
గడ్డిపోచను పట్టుకుని ఏరు ఈదినట్టు… అనే సామెత విన్నారు కదా. నదిలో కొట్టుకుపోయేవాడికి ఒక చిన్న గడ్డిపోచ దొరికినా.. దాని ఆధారంగా ఒడ్డుకు చేరగలనేమో అనే ఆశ కలుగుతుంది. అలాగే తీవ్రమైన జబ్బుతో బాధపడేవాళ్లకు ఎవరేం చెప్పినా చేయడానికి రెడీగా ఉంటారు. ఏ పుట్టలో ఏ పాముందో.. ఏ మందుతో జబ్బు తగ్గుతుందో.. అనే ఆశ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్లనే టార్గెట్ చేస్తూ కొందరు అబద్ధపు ప్రచారాలు చేస్తుంటారు. క్యాన్సర్ పేషెంట్ల కోసం అలాంటి మిస్ ఇన్‌ఫర్‌మేషన్ ఒకటి ప్రచారం అవుతోంది.
అందులో నిజాలేంటో ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం.
క్లెయిమ్ 1 :
వివిధ రకాల సోషల్ మీడియా ద్వారా పూణెలోని యశోద హెమటాలజీ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, ఇమిటినెఫ్ మెర్సిలెట్ అనే మెడిసిన్ గురించి తీవ్రమైన అసత్యపు ప్రచారం జరుగుతున్నది. ఇమిటినెఫ్ మెర్సిలెట్ అనే మెడిసిన్ పూణెలోని ఈ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఉచితంగా లభిస్తున్నదనీ, ఇది బ్లడ్ క్యాన్సర్‌తో పాటు అన్ని రకాల క్యాన్సర్లకూ మందుగా పనిచేస్తుందని వాట్సప్‌లో వైరల్ అవుతున్నది. ఈ సమాచారం తప్పుదారి పట్టిస్తున్నది. ఇది తప్పని పలు పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ మెసేజ్ వాట్సప్ ద్వారా వైరల్ అవుతున్నది. గతంలో యశోద క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ స్థానంలో, చెన్నైలోని అడయార్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నదన్న అసత్యపు వార్తలు వైరల్ అయ్యాయి.
డీబంక్ ఎలా చేశానంటే…
ముందుగా ఆ మెసేజ్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు కాల్ చేశాను. కానీ అవి డిస్‌కనెక్ట్ అయి ఉన్నాయి. లేదా నెట్‌వర్క్ పరిధిలో లేవు. ఇక తర్వాత గూగుల్ సెర్చ్ ద్వారా పూణెలో యశోద హెమటాలజీ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఉందా లేదా అన్నది తెలుసుకున్నాను. ఆ హాస్పిటల్ వెబ్‌సైట్‌లో ఈ ఉచిత ఔషధం గురించిన సమాచారం ఉందేమో చూశాను. కానీ అటువంటిదేమీ లేదు. పైగా ఈ వైరల్ మెసేజ్‌ని ఖండిస్తూ హెచ్‌సిజి క్యాన్సర్ హాస్పిటల్‌కి చెందిన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ విశాల్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. 2012లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన మాట్లాడిన మాటలు యథాతథంగా….
‘‘అసలు ఈ రూమర్లను ఎవరు వ్యాపింపచేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది కేవలం పోస్ట్ వైరల్ కావడానికి ఒక ట్రిక్ మాత్రమే. దీని గురించి చాలామంది అడుగుతున్నారు. అయితే అన్ని క్యాన్సర్లనూ నయం చేయగలిగే ఒకే ఒక మెడిసిన్ ప్రపంచంలోనే లేదు. అలాంటి మ్యాజికల్ మెడిసిన్ ఏదీ లేదు. అల్లోపతిక్ మెడికల్ సిస్టమ్‌లో మేము కేవలం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్‌ని మాత్రమే సూచిస్తాం. ఏ హాస్పిటల్ కూడా రాండమ్‌గా ఒక మెడిసిన్‌ను పంపిణీ చేయదు…..’’
నిజ నిర్ధారణ :
పూణెలోని యశోద క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్లడ్ క్యాన్సర్ మెడిసిన్ ఉచిత పంపిణీ చేస్తున్నారన్నది అబద్ధపు వార్త. వైరల్ మెసేజ్‌లో ఇమిటినెఫ్ మెర్సిలెట్ గా చెప్పబడుతున్న ఇమాటినిబ్ మెసిలేట్ మెడిసిన్ అన్ని రకాల క్యాన్సర్లకూ పనిచేస్తుందనే వార్త పూర్తి అసత్యం.
క్లెయిమ్ 2 :
ఇప్పుడు పూణె హాస్పిటల్ గురించి వైరల్ అవుతున్నట్టుగానే గతంలో చెన్నైలోని అడయార్ క్యాన్సర్ హాస్పిటల్‌లో కూడా గ్లివెక్ పేరుతో మార్కెట్‌లో లభ్యమవుతున్న ఇమాటినిబ్ మెసిలేట్ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న అబద్ధపు వార్తల ప్రచారం జరిగింది. కానీ ఇది నిజం కాదు.
డీబంక్ ఎలా చేశానంటే…
ఈ వార్త నిజానిజాలను శోధించడానికి అడయార్ క్యాన్సర్ హాస్పిటల్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఈ బ్లడ్ క్యాన్సర్ ఔషధం ఇవ్వడమనడంలో వాస్తవం లేదు. కానీ కొంతవరకు ఆ హాస్పిటల్‌లో ఉచిత చికిత్స అందించడం మాత్రం నిజమే. ఈ క్యాన్సర్ సెంటర్‌లో ఉన్న 535 పడకల్లో 40 శాతం పడకలకు మాత్రమే ఛార్జ్ చేస్తారు. మిగిలినవి జనరల్ వార్డుకు సంబంధించినవి. వీళ్లలో 40 శాతం మందికి పూర్తి ఉచిత చికిత్స అందించగా మిగిలిన వాళ్లకు నామమాత్రపు ఫీజులతో చికిత్స చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్లడ్ క్యాన్సర్ ఔషధమైన ఇమాటినిబ్ మెసిలేట్‌ను ఉచితంగా అందిస్తున్నారనే వార్త నిజం కాదు. ఉచిత చికిత్సలు అందుబాటులో ఉండటం మాత్రం వాస్తవమే. అంటే ఈ వైరల్ వార్త తప్పుదారి పట్టించే సమాచారం.
అసలేమిటి ఈ ఔషధం?
ఈ వైరల్ మెసేజ్‌లోని నిజానిజాల గురించి హైదరాబాద్‌లోని సోమాజిగూడ, యశోద హాస్పిటల్‌కి చెందిన హెమటాలజిస్ట్, హెమటోఆంకాలజిస్ట్ డాక్టర్ గణేశ్ జైషట్వార్ ఏం చెబుతున్నారంటే……, “ఇమిటినెఫ్ మెర్సిలెట్ (IMITINEF MERCILET) అసలు పేరు ఇమాటినిబ్ మెసిలేట్ (Imatinib mesylate). ఇది మార్కెట్‌లో గ్లివెక్ పేరుతో ఉంది. దీన్ని క్రానిక్ మైలాయిడ్ ల్యుకేమియా (సిఎంఎల్) చికిత్సలో వాడుతారు. ఇది కూడా ఒక రకమైన బ్లడ్ క్యాన్సరే. ఇమాటినిబ్ మెసిలేట్ క్రానిక్ మైలాయిడ్ ల్యుకేమియాకి టార్గెటెడ్ థెరపీ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్‌కి ఇది ఔషధంగా మంచి ఫలితాలను ఇస్తున్నది. ఈ మెడిసిన్ మార్కెట్‌లో రకరకాల పేర్లతో చాలా చవకగా లభిస్తున్నది. దీన్ని ఉచితంగా ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. ప్రతీ క్యాన్సర్ కణాలకు నిర్దుష్టమైన యాంటిజెన్ రీసెప్టార్లు ఉంటాయి. కాబట్టి ఒక క్యాన్సర్‌కు సంబంధించిన మెడిసిన్ మరో రకమైన క్యాన్సర్ కణాలపై పనిచేయదు. కాబట్టి అన్ని క్యాన్సర్లకూ ఒకే మందుగా ఇమాటినిబ్ పనిచేస్తుందన్నా, దీన్ని దేశంలో ఎక్కడైనా ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ప్రచారం చేసినా.. అలాంటి అసత్యపు వార్తలను నమ్మి మోసపోవద్దు. వైరల్ చేయవద్దు.”