‘నేను అన్నీ ఆలోచించే కరెక్ట్‌గా చెబుతాను. నా అంచనా ఎప్పుడూ తప్పు కాదు. కాబట్టి నా మాట వినాల్సిందే..’
‘అయామ్ ఆల్వేస్ రైట్. నా నిర్ణయాన్ని మీరంతా ఆమోదించాల్సిందే.’
‘ఇది తప్పనిసరిగా చేయాలి. నువ్వు చేయకపోయినా నష్టం లేదు. నేను ఏ పనైనా చేసుకోగలను.’
ఇలా మాట్లాడేవాళ్లని చూస్తూనే ఉంటాం. వారి మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నా అంతర్లీనంగా ‘నేను’ అన్న అహం కూడా దాగుంటుంది. ఇలాంటి మనస్తత్వం కరెక్టేనా?
దీని వెనుక అసలు కారణం ఆధిపత్య ధోరణే. ఇలాంటి ధోరణి వల్ల ఇతరులతో సత్సంబంధాలను పెంచుకోలేరు. స్నేహితులు ఉన్నా వారికి భయపడి ఏమీ అనకపోవచ్చు గానీ సాధ్యమైనంత వరకు ఇలాంటి వారికి దూరంగా ఉండాలనే కోరుకుంటారు. దేవుడు దిగివచ్చినా, సూర్యుడు పడమట ఉదయించినా తాను అనుకున్నదే కావాలన్న మొండితనం, తాను ఆలోచించిందే వందశాతం సరైనదని అనుకునేవాళ్లు తమ అహాన్ని సంతృప్తిపరచుకోగలరేమో గానీ తమ చుట్టూ ఉన్న అనుబంధాలను పటిష్టం చేసుకోలేరు.
మన ఆలోచనలు, ఉద్రేకాలు, మన సర్దుబాటు మనస్తత్వం, రాజీపడే ధోరణి పైన ప్రభావం చూపిస్తాయి. నేనే గొప్ప అనుకునేవాళ్లలో కూడా ఈ ఉద్రేకాలు ఎక్కువగానే ఉంటాయి. నేను గొప్పవాడిని అనుకోవడంలో తప్పు లేదు. కానీ నాకన్నా గొప్పవాజళ్లు లేరు. నేను తప్ప ఎవరూ ఈ పని ఇంతబాగా చేయలేరు, మిగిలినవారు నాకు సరితూగలేరని అనుకుంటే మాత్రం అది అవివేకమే అవుతుంది. ఇలాంటివారిలో ఆధిపత్య ధోరణి ఎక్కువ. ఎదుటివారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని, తమ నియంత్రణలోనే ఉండాలని చూస్తారు. కొంతమందిలో ఈ లక్షణాలు ముదిరితే నియంతలుగా ప్రవర్తించవచ్చు. వీరిలో సుపరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల వీరి చుట్టూ ఉన్నవాళ్లు ఇబ్బందులు పడుతుంటారు. వారి నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తారు.
ఆత్మన్యూనతే అసలు కారణం
మనసులో న్యూనతా భావాలు ఎక్కువగా ఉన్నవాళ్లే ఇలా ప్రవర్తిస్తారు. న్యూనత అనేది మనసులో చెలరేగే సునామీ లాంటిది. ఇది మనిషిని చిత్తు చేస్తుంది. దాన్ని తట్టుకోవడం చేతగాక దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయా న్యూనత భావాలను అచేతనలోకి బలవంతంగా నెట్టేస్తారు. అవి మళ్లీ పైకి రాకుండా పైనుంచి సుపీరియారిటీ అనే ముసుగు కప్పేస్తారు. తమ న్యూనతను అడ్డుకునేందుకు సుపీరియర్ భావాలను చేతనలో వ్యక్తపరుస్తారు. ఆధిపత్య ధోరణితో మోనార్క్‌లా ప్రవర్తించేవాళ్లలో ఏమాత్రం మొహమాటం ఉండదు. ఇతరులు ఏమనుకున్నా తమ పద్ధతులు మార్చుకోరు. ఎదుటివారి ఫీలింగ్స్‌తో సంబంధం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఫలానా కావాలనుకుంటే ఆరునూరైనా సాధించాలనుకుంటారు. ఎవరినీ లెక్క చేయరు. కఠినంగా ఉంటారు.
పెంపకం లోనే బీజం
ఇలాంటి మనస్తత్వానికి పెంపకమే ప్రధాన కారణం. కాగా తల్లిదండ్రుల నుంచి కూడా ఇలాంటి లక్షణాలు పిల్లలకు రావచ్చు. సాధారణంగా మగపిల్లల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో తండ్రి ఆధిపత్యం, ఉద్రేకపూరిత మనస్తత్వం కూడా పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. వారు కూడా అలాంటి లక్షణాలతో పెరిగే అవకాశం ఉంది. మన సమాజంలో అబ్బాయిల్ని నువ్వేం చేసినా చెల్లుతుంది.. నువ్వే గొప్ప అన్న పద్ధతిలో పెంచుతారు. ఆ మాటల ప్రభావం వారిపై పడుతుంది. స్కూల్లో టీచర్లు మిగతా పిల్లల్ని బాగా కంట్రోల్ చేస్తున్నావని పొగడటం కూడా దుష్ప్రభావం చూపించవచ్చు. చిన్నప్పుడే కుటుంబ బాధ్యతలు తీసుకున్నవాళ్లను అందరూ ఆకాశానికెత్తేస్తారు. కొందరు ‘నేను కాబట్టే ఇలా చేయగలుగుతున్నాను. నాలాగా ఎవరూ వ్యవహరించలేరు’ అన్న ధోరణి పెంచుకుంటే అహం పెరిగి సమస్య అవుతుంది.
ఎలా డీల్ చేయాలి?
తన ఆలోచన ధోరణి తప్పు అని డైరెక్ట్‌గా వాళ్లతో ఎప్పుడూ చెప్పకూడదు. నువ్వు గొప్పే అని చెబుతూనే అంతకన్నా గొప్పవాళ్లుండే అవకాశం ఉంటుంది కదా అని ఉదాహరణలతో సందర్భానుసారంగా తెలియజెప్పాలి.
పొగడటంతో పాటు పొరపాట్లపై విమర్శలు కూడా చేస్తుండాలి. తన సామర్థ్యం గురించి చెబుతూనే తప్పులను ఎత్తి చూపుతూ ఉండాలి.
వాళ్లను మార్చే ప్రయత్నం చేయడం వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకుంటే ఫలితం ఉంటుంది.
ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు తయారుకాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి అతిగా పొగడకుండా, అబ్బాయిలను ప్రత్యేకంగా చూడకుండా ఉండాలి.