కొవిడ్ పాజిటివ్ వచ్చిందని భయపడుతున్నారా..? భయం అసలే వద్దు. హాస్పటిల్‌లో చేరాల్సిన అవసరం లేకుండా చేసే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స కొవిడ్ పాజిటివ్ వాళ్లకు వరంగా మారనున్నదా? అంటే అవుననే హామీ ఇస్తున్నారు వైద్యరంగ నిపుణులు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స ఇప్పుడు మనదేశంలో.. అదీ మన హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. హాస్పిటల్‌కి లక్షల బిల్లు లేకుండా ఒక్క ఇంజెక్షన్‌తోనే కొవిడ్ తీవ్రత తగ్గించే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీల మాయాజాలం ఏంటో తెలుసుకుందామా…!
అసలే స్థూలకాయం.. దానికి తోడు ఏ డయాబెటిసో.. కిడ్నీ వ్యాధో… పులి మీద పుట్రలాగా కొవిడ్ ఇన్‌ఫెక్షన్…! ఇంకేం..! గుండెల్లో గుబులు మొదలు. కానీ ఎన్ని సమస్యలున్నా.. కొవిడ్ వల్ల ఇక భయం లేదంటున్నారు డాక్టర్లు. ముందు భయం వదలండి… వ్యాధి తీవ్రం కాకుండా ఆపే బ్రహ్మాస్త్రం మా దగ్గరుంది అంటున్నది ఆధునిక వైద్యరంగం. కొవిడ్‌ను ఎదుర్కొనే కొత్త చికిత్స వచ్చేసింది. కరోనా వైరస్‌ను టార్గెట్ చేసి మరీ తుదముట్టించే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స ప్రస్తుత కొవిడ్ సంక్షోభంలో ఒక భరోసానిస్తున్నది. ఈరోజే (గురువారం) హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఈ చికిత్స ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స విశేషాలు చెప్తున్నారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి.
ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధం.. యాంటీబాడీ. మొన్నటివరకూ ప్లాస్మా థెరపీ ద్వారా కొవిడ్‌కి యాంటీబాడీ చికిత్స అందించారు. అయితే అది అంత సమర్థవంతమైనది కాదని తేలింది. ప్లాస్మాలో యాంటీబాడీల సాంద్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇందుకోసం ఎక్కువమొత్తంలో ప్లాస్మా కావాలి. అంతేగాకుండా ఇందులో ఉండేవి పాలీక్లోనల్ యాంటీబాడీలు. అంటే ఎన్నో రకాల కణాల నుంచి వచ్చినవన్నమాట. కానీ ఒకే రకమైన కణాల సమూహం నుంచి తయారైనవి మోనోక్లోనల్ యాంటీబాడీలు. వీటిని ఉపయోగించి కొవిడ్‌కి చికిత్స చేయగలమని ఇప్పుడు నిరూపితమైంది. డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్‌లలో అంటువ్యాధులు కాని వ్యాధుల్లో మోనోక్లోనల్ యాంటీబాడీలను వాడుతున్నారు. ఇప్పుడు కొవిడ్ లాంటి అంటువ్యాధికి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది.అమెరికాలో 13 వేల మందిలో ఇది విజయవంతం అయింది. మనదేశంలో ఇప్పుడే ఈ చికిత్సను ప్రారంభించారు. అయితే మన దగ్గర కనిపిస్తున్న కొవిడ్ వేరియెంట్లపైన ఈ చికిత్స ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ అధ్యయనం ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో జరుగుతున్నది. కొద్దిరోజుల్లో దీని ఫలితాలు వస్తాయి.
మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స అంటే…
డైరెక్ట్‌గా యాంటీబాడీని మాత్రమే ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడాన్నే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స అంటారు. ఇది రెండు రకాలుగా అందుబాటులో ఉంది. అంటే రెండు రకాల యాంటీబాడీ రూపాలను ఒక మందుగా చేసి ఇస్తారు. Casirivimab, Imdivimab అనే రెండు రకాల మోనోక్లోనల్ యాంటీబాడీలను కలిపి ఇవ్వడం వల్ల ఒకచోట మిస్ అయినా, ఇంకోచోట మిస్ కాకుండా పనిచేస్తాయి. ఇవి నిర్దుష్టంగా వైరస్ పైన ఒక్కచోటే టార్గెట్ చేసి దాడి చేస్తాయి. అంటే వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ పైనే దాడిచేసి, దాన్ని అతుక్కుని, వైరస్‌ని నిర్వీర్యం చేస్తాయి. అందుకే కొవిడ్‌కి ఈ చికిత్స మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ చికిత్సకు 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
ఎలా ఇస్తారు?
మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సను రక్తనాళం ద్వారా ఇస్తారు. అంటే చేతిలోని రక్తనాళం (సిర)లోకి మందును ఇంజెక్ట్ చేస్తారన్నమాట. దీన్నే ఇంట్రావీనస్ (ఐవి)గా ఇవ్వడం అంటారు. సబ్‌క్యుటేనియస్‌గా (చర్మం ద్వారా) కూడా ఈ ఇంజెక్షన్‌ను ఇస్తారు. ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ వయల్‌ని ఇద్దరు పేషెంట్లకు వాడవచ్చు. ఒకరికి వాడిన తర్వాత (అంటే దాన్ని ఓపెన్ చేశాక) 36 గంటల సమయంలోగా ఇంకో పేషెంట్‌కి వాడాలి. లేకుంటే వేస్ట్ అయిపోతుంది.
ఎప్పుడు ఇస్తారు?
వైరస్‌తో శరీరంలోకి ప్రవేశించిన వారం తరువాత లేదా పాజిటివ్ రిపోర్టు వచ్చిన మూడు రోజుల తరువాత గానీ మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ ఇస్తారు. ఏడు రోజులు దాటిన తరువాత ఈ చికిత్స ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
సైడ్ ఎఫెక్టులున్నాయా?
మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స వల్ల పెద్దగా దుష్ప్రభావాలేమీ లేవు. అయితే కొందరిలో దురద, వికారంగా ఉండటం, వాంతుల వంటి సమస్యలు రావొచ్చు. కానీ ఇవి కొన్ని రోజులకు తగ్గిపోతాయి.
ఎవరికి అవసరం?
మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్లను ఇష్టానుసారం వాడితే అసలుకే ఎసరు వస్తుంది. యాంటీబయోటిక్స్ విచక్షణారహితంగా వాడితే యాంటీబాడీ రెసిస్టెంట్ బాక్టీరియా పుట్టుకొస్తున్నట్టుగానే కొవిడ్‌లో కూడా అనేకానేక వేరియెంట్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. వీటిలో రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది. అప్పుడిక కొవిడ్‌ను ఎదిరించడం ఎవరి వల్లా కాదు. అంతేకాదు… అనవసరంగా మోనోక్లోనల్ యాంటీబాడీ వాడటం వల్ల యాంటీబాడీ ఎన్‌హాన్స్‌డ్ రియాక్షన్ కూడా అరుదుగా రావొచ్చు.
కొవిడ్ ఇన్‌ఫెక్షన్ మైల్డ్ నుంచి మాడరేట్ గా ఉనవాళ్లకు ఈ యాంటీబాడీల చికిత్స ఇస్తే సత్ఫలితాలుంటాయని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉండి, హాస్పిటల్‌లో చేరి, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉన్నవాళ్లకు ఈ చికిత్స వల్ల ఉపయోగం లేదు. వీళ్లకు వాడవద్దు.
విచక్షణారహితంగా, ఇష్టానుసారంగా వీటిని వాడకూడదు. ఇది వ్యాక్సిన్ కాదు.
కింది సమస్యలున్నవాళ్లకు మాత్రమే మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది :
- 65 ఏళ్ల వయసు పైబడినవారు
- స్థూలకాయులు. అంటే బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ 35 కన్నా ఎక్కువ ఉన్నవారు
- క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) ఉన్నవారు
- మధుమేహులు
- క్యాన్సర్, ఐబిడి, హెచ్‌ఐవి లాంటి ఇమ్యునిటీని అణచివేసే వ్యాధులున్నవారు
- ఇమ్యునో సప్రెసివ్ మందులు వాడుతున్నవారు
- 55 ఏళ్లు పైబడి గుండెజబ్బులు (కార్డియోవాస్కులర్ వ్యాధులు), అధిక రక్తపోటు, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) ఉన్నవారు
వీళ్లకు వద్దు
- మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినవారు
- హాస్పిటల్‌లో ఐసియులో ఉండి చికిత్స తీసుకుంటున్నవారు
మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స… ముఖ్య విషయాలు
- మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స తీసుకున్నవాళ్లు మూడు నెలల తరువాత మాత్రమే వాక్సిన్ వేయించుకోవాలి. అంతకుముందు వాక్సిన్ వేయించొద్దు.
- కొవిడ్ నుంచి కోలుకున్నవాళ్లకు ఈ చికిత్స అవసరం లేదు.
- గర్భిణులకు మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సను ఇప్పటివరకైతే సూచించడం లేదు.
- పాలిచ్చే తల్లులు ఈ చికిత్స తీసుకోవచ్చు.
డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి
చైర్మన్,
ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ,
హైదరాబాద్