అమ్మో థర్డ్ వేవ్ వచ్చేస్తుందేమో… అంటూ అందరం భయపడుతున్నాం. కానీ మన ముందు ఇప్పటికే ఉన్న సమస్య గురించి పట్టించుకోవడం లేదు. కరోనా నుంచి బయటపడినప్పటికీ ఆ తర్వాత కొన్ని వారాలకు పొంచి ఉన్న ముప్పు గురించి ఆలోచించడం లేదు. ఆ ముప్పే కొవిడ్ సెకండ్ వేవ్ వదిలి వెళ్లిన పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్.
కానీ పోస్ట్ కొవిడ్ సమస్యల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటివరకూ ఎటువంటి గణాంకాలూ లేవు. అందుకే ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వీటిపై ఒక పాన్ ఇండియా సర్వే నిర్వహించింది. దానిలో తేలిన విషయాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి.
కొవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్లలో 40 శాతం మంది ఈ పోస్ట్ కొవిడ్ బారిన పడుతున్నారు. మనదేశంలో కోటికి పైగా పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ వల్ల బాధపడుతున్నారని అంచనా. పోస్ట్ కొవిడ్ సమస్యలపై దృష్టి సారించాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ పోస్ట్ కొవిడ్ సమస్యల కోసం ప్రత్యేకంగా వైద్య విభాగాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సర్వే వివరాలతో పాటు, పోస్ట్ కొవిడ్ సమస్యల గురించి వివరిస్తున్నారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి.
సర్వే ఫలితాలివీ…
పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా 5 వేల 347 మందిపై సర్వే నిర్వహించగా అందులో 2 వేల 38 మంది పాల్గొన్నారు. వీరిలో మొదటి 3 నెలల్లో పోస్ట్ కొవిడ్ లక్షణాలు వచ్చినవాళ్లు 48 శాతం. 3 నెలల తర్వాత వచ్చినవాళ్లు 34.2 శాతం. కాగా కొవిడ్ తగ్గిన నెలలోపే పోస్ట్ కొవిడ్ సమస్యలు వచ్చినవాళ్లు 18.4 శాతం.
వీళ్లలో హాస్పిటల్‌లో చేరినవాళ్లు – 38 శాతం.
ఆక్సిజన్ అవసరమైనవాళ్లు – 34. 28 శాతం.
ఆక్సిజన్ అవసరం లేనివాళ్లు – 56.5 శాతం.
హాస్పిటల్‌లో చేరిన వాళ్లలో స్టిరాయిడ్ థెరపీ తీసుకున్నవాళ్లు – 75 శాతం.
రెండు వారాలు స్టిరాయిడ్ తీసుకున్నవాళ్లు – 40 శాతం.
ఒక వారం తీసుకున్నవాళ్లు – 24 శాతం.
కేవలం హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మాత్రమే స్టిరాయిడ్ తీసుకున్నవాళ్లు – 33.73 శాతం.
పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ వల్ల హాస్పిటల్‌లో చేరినవాళ్లు – 6 శాతం.
కొవిడ్ వల్ల హాస్పిటల్‌లో చేరి, తర్వాత పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ వచ్చినవాళ్లు – 48 శాతం.
హాస్పిటల్‌లో చేరకుండా కొవిడ్ నుంచి బయటపడి, పోస్ట్ కొవిడ్ వచ్చినవాళ్లు 37.6 శాతం.
స్టిరాయిడ్స్ తీసుకున్నవాళ్లలో పోస్ట్ కొవిడ్ వచ్చినవాళ్లు – 53 శాతం.
స్టిరాయిడ్స్ తీసుకోకుండా పోస్ట్ కొవిడ్ వచ్చినవాళ్లు – 36.41 శాతం.
స్టిరాయిడ్స్‌తో పాటు, ఆక్సిజన్ అవసరమై, తర్వాత పోస్ట్ కొవిడ్ వచ్చినవాళ్లు – 49 శాతం.
ఈ సర్వే ఫలితాలను బట్టి విశ్లేషిస్తే, కొవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నవాళ్లలో పోస్ట్ కొవిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తున్నది. హాస్పిటల్‌లో చేరినవాళ్లు, స్టిరాయిడ్స్ తీసుకున్నవాళ్లు, ఆక్సిజన్ థెరపీ అవసరమైనవాళ్లు పోస్ట్ కొవిడ్ సమస్యల బారిన ఎక్కువగా పడుతున్నారు. అయితే వీళ్లలో కేవలం 40 శాతం మంది మాత్రమే ఈ సమస్యల్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. అవసరమైన చికిత్స తీసుకుంటున్నారు. కాని ఇది సరికాదు. ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొవిడ్ గురించి మనకు ఇంకా పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు దాని ప్రభావాలను పట్టించుకోకుండా ఉండటం మంచిది. కాదు. అందుకే దేశవ్యాప్తంగా పోస్ట్ కొవిడ్ కేర్ క్లినిక్స్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది.