సిసిఎంబి మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు
తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞాన శాస్త్ర ప్రచారం – ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రపై సదస్సు
‘‘మేఘాల్లోంచి పడే వర్షపు చినుకులు… ఉరుము, మెరుపు.., మనం తినే తిండి… మన జీవితం, జీవన విధానంలోనే మమేకమై ఉంది శాస్త్ర విజ్ఞానం. జీవితంలో కీలక పాత్ర ఉన్న సైన్సు మీడియాలో, వార్తల్లో ఎందుకు ముఖ్యంగా లేదు..?’’ అంటూ ప్రశ్నించారు సిసిఎంబి మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు. పలు రకాలుగా మన నిత్య జీవితంలో భాగమైన సైన్సు పట్ల అవగాహన పెంచాల్సిన బాధ్యత మీడియా పైనే ఉన్నది’’ అన్నారు సిసిఎంబి మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు. విజ్ఞాన శాస్త్రం పట్ల సరైన అవగాహన లేకపోవడం అనేక ప్రమాదాలకు అవకాశం కలిగిస్తుందని, మొన్న పాండెమిక్ సమయంలో ఈ సంగతి రుజువైందన్నారాయన. సినిమాలు, క్రికెట్ లేదా రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి మన యువతకు సైన్సు పట్ల కొరవడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనల కోసం పెట్టుబడి పెట్టిన దేశాలన్నీ అభివృద్ధి చెందాయి. దాదాపు 3.5 శాతం నిధులను శాస్త్ర రంగం కోసం ఖర్చు చేస్తున్నారు. మన దేశం మాత్రం కేవలం 0.9 శాతం మాత్రమే సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఖర్చుపెడుతున్నది. విజ్ఞాన శాస్త్ర ప్రాధాన్యత గురించి ఒకవైపు ప్రజలకు, మరోవైపు ప్రభుత్వానికి తెలుపవలసిన బాధ్యత సమాచార మాధ్యమాలదేనని, అందుకోసం కృషి చేయాలని డాక్టర్ మోహన్ రావు పిలుపునిచ్చారు.
విజ్ఞాన్ ప్రసార్ సౌజన్యంతో సైన్స్ కమ్యూనికేషన్, పాపులరైజేషన్ అండ్ ఎక్స్‌టెన్షన్ (స్కోప్), వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం సంయుక్త సారథ్యంలో జరిగిన ఒక రోజు సదస్సులో ఆయన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సైన్స్ వార్తల ప్రాధాన్యం గురించి ప్రసంగించారు. ‘‘తెలుగు రాష్ట్రాలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారం : ప్రింట్, ఎలక్ట్రానిక్ సమాచార మాధ్యమాల పాత్ర’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలోని సీఎఫ్‌ఆర్‌డీలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అనవసర విషయాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించే బదులు సైన్సు ప్రాధాన్య అంశాలపై చర్చలకు శ్రీకారం చుట్టాలని సూచించారు డాక్టర్ మోహన్ రావు.
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల, సోషల్ మీడియాలో మనం ఏ రకమైన వార్తలను చూడాలనే అంశాన్ని కూడా ఆల్గారిథమ్స్ నిర్ణయిస్తున్నాయన్నారు. సైలెన్స్ కిల్స్ సైన్స్ అంటూ, జర్నలిస్టుల నిశ్శబ్దమే సైన్సును చంపేసి, అనేక రకాలుగా అసత్యపు వార్తల ప్రచారానికి దారితీస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్సు వార్తల నిజ నిర్ధారణ ఎలా చేయాలో, దానికి కావాల్సిన వనరులేంటో సదస్సులో పాల్గొన్న జర్నలిస్టులకు సూచించారు.
సీనియర్ సైన్స్ జర్నలిస్ట్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, ‘‘జీవం ఆవిర్భావం నుంచి మనిషి జీవితం అంతటా సైన్సే విస్తరించి ఉంది. ఆహారం, ఆరోగ్యం, భద్రత.. ఇవన్నీ సైన్సులో భాగాలే’’ అన్నారు. తెలుగులో సైన్సు ఎప్పుడూ వెనుకబడలేదు. ఇప్పుడే సైన్సు పట్ల అలక్ష్యం పెరిగిందన్నారు. ‘‘గాలి, వెలుతురు ఎలాగైతే అందరికీ చేరుతున్నాయో, జ్ఞానం కూడా అలాగే అందరికీ చేరాలని చిలకమర్తి వారు ఆనాడే చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గాడిచర్ల రాసిన అబ్రహాం లింకన్ పుస్తకం నుంచి శ్రీశ్రీ పరమాణు రహస్యం, నండూరి వారి నరావతారం.. ఇలా ఎన్నో సైంటిఫిక్ పుస్తకాలు వచ్చాయన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా, నాగసాకి సంఘటన తర్వాత సైన్స్ జర్నలిజం మీద మొదలైన ఆసక్తి ఇప్పుడు క్రమంగా తగ్గుతుండటం బాధాకరమన్నారు. యల్లాప్రగడ సుబ్బారావుతో పాటు అనేక మంది మరుగున పడ్డ మన సైంటిస్టుల గురించి ఈ సందర్భంగా పరిచయం చేశారు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.
‘‘ఏ మీడియాలో అయినా సైన్సు వార్తల కవరేజి 15 శాతం అయినా ఉండాలి, కానీ 3 శాతం ఉండటమే ఎక్కువ. ప్రత్యేకంగా సైన్స్ రిపోర్టర్లను పెట్టుకునే దిశగా ప్రస్తుత మీడియా ఆలోచించడం లేదు’’ అంటూ అభిప్రాయపడ్డారు ఉస్మానియా జర్నలిజం విభాగ హెడ్ ప్రొఫెసర్ స్టీవెన్‌సన్. స్కోప్ సంస్థ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య, ‘‘మాతృభాషలో సైన్సును ప్రచారం చేయకపోతే అభివృద్ధి ఉండదు. జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపే సైన్సు అంశాలను ముఖ్య వార్తలుగా చెయ్యాలి. పరిశోధనా ఫలితాల బ్రేకింగ్ న్యూస్ వెయ్యాలి’’ అని సూచించారు. విజ్ఞాన ప్రసార్ ఆధ్వర్యంలో ప్రతినెల విజ్ఞానవాణి మాగజైన్ సైన్సు వార్తల ప్రచారంలో విస్తృత కృషి చేస్తున్నదని స్కోప్, తెలుగు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ కె. లక్ష్మారెడ్డి చెప్పారు.
ఈ సదస్సులో నవతెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్, ఈనాడు జర్నలిజం స్కూల్ ఫాకల్టీ సురేశ్, సిఎఫ్‌ఆర్‌డి డైరెక్టర్ ప్రొఫెసర్ కరుణాసాగర్, డాక్టర్ పి. మురళీధర్ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక నేతలు ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి, ప్రొఫెసర్ సత్యప్రసాద్, ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వర్ రావు, ప్రొఫెసర్ ఆదినారాయణ, సైన్సు జర్నలిస్టులు, విద్యార్థులు పాల్గొన్నారు.