ఈ మధ్య నాకు కామెర్ల వ్యాధి సోకింది. ఆ సమయంలో పరీక్షలు నిర్వహించి హెపటైటిస్ బి గా నిర్ధారించారు. ఈ వ్యాధి ఒకసారి సోకితే పూర్తిగా శరీరం నుంచి తొలగిపోవడం సాధ్యపడదని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అది నిజమేనా? అంతేకాదు.. పెళ్లి చేసుకుంటే నా భార్యకు కూడా ఇది సోకుతుందని భయపెడుతున్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేనా? దీనివల్ల ప్రాణాపాయం ఉందా? నాకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. ఇంతవరకూ ఏ స్త్రీతోనూ లైంగిక సంబంధం పెట్టుకోలేదు. నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా?
కార్తీక్, విజయవాడ
హెపటైటిస్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల రకరకాల అపోహలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అన్ని హెపటైటిస్ లూ ఒకటి కాదు. ఇది 5 రకాల వైరస్ ల వల్ల వస్తుంది. అవి, హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ. వీటిలో దేనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చినా కనిపించే ప్రధాన లక్షణం కామెర్లు. ఇందులో ఒక్కో వైరస్ ఒక్కోలాగా వ్యాపిస్తుంది. మీకు సోకిన హెపటైటిస్ బి కేవలం శృంగారం ద్వారా మాత్రమే కాదు.. కలుషిత రక్తం, సూదులు, సిరంజిల వల్ల కూడా వ్యాపిస్తుంది. చాలామంది హెపటైటిస్ ను హెచ్ఐవీతో పోలుస్తారు. ఈ రెండు వైరస్ లు వ్యాప్తి చెందే తీరు ఒకేలా ఉండటమే దీనికి కారణం. అంతకు మించి ఈ రెండింటిలో ఎలాంటి సారూప్యం లేదు. హెపటైటిస్ బి వల్ల ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కాలేయం దెబ్బతింటుంది. సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే పూర్తిగా దెబ్బతింటుంది. చివరికి సిర్రోసిస్ గా మారే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి స్థితిలో కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం ఉండదు.
డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటూ ఉంటే హెపటైటిస్ బి వైరస్ తో కూడా సాధారణ జీవితం గడపడం సాధ్యమే. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ, పోషకాహారం, తగినంత వ్యాయామం ఉంటే వ్యాధిని పూర్తి స్థాయిలో అదుపులో పెట్టుకోవచ్చు. హెపటైటిస్ బి వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా సురక్షితం. ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. జీవిత భాగస్వామికి వ్యాక్సిన్ వేయించి, సురక్షితంగా లైంగిక కలయిక జరిపితే ఏ ఆటంకాలు లేకుండా దాంపత్య జీవితం గడపవచ్చు. కాబట్టి మీరు పెళ్లి చేసుకోలేనేమో అని చింతించాల్సిన పని లేదు. ముందుగా డాక్టర్ ను కలిసి, పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోండి. మీరు తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు.