సమస్య : మా నాన్న చిన్నతనంలోనే పక్షవాతానికి గురై మంచంలోనే ఉండి చాలా కాలం ఇబ్బందులు పడి కొన్నాళ్ళ కిందట మరణించారు. నాకప్పటి నుండీ పక్షవాతం అంటే చాలా భయం పట్టుకుంది. ఒక వేళ ఎవరికైనా పక్షవాతం వస్తే అవయవాలు చచ్చుబడిపోయి కొంతకాలం నరకం అనుభవించి చనిపోవడమేనా? దీనికి చికిత్స, మెరుగుదల, మళ్లీ కోలుకునే అవకాశాలు లేవా? దయచేసి వివరంగా తెలుపండి.
-కలిదిండి విశాలాక్షి, మిర్యాలగూడ.
సలహా : పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటల లోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. పక్షవాతానికి ఒకప్పుడు ట్రీట్‌మెంట్ లేదు. కానీ ఇప్పుడు గత 15 నుంచి 20 ఏళ్లుగా చికిత్స ఉంది. పక్షవాత లక్షణాలు కనిపించిన మొదటి నాలుగున్నర గంటలలోగా హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్‌మెంట్ మొదలుపెడితే అవకరాలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రాణాపాయం తప్పుతుంది. హాస్పిటల్‌కి వెళ్లగానే మొదట సిటి స్కాన్ చేస్తారు. దీనిలో రక్తనాళం చిట్లి రక్తస్రావం కావడం వల్ల పక్షవాతం వచ్చిందా లేక బ్లాక్ వల్ల వచ్చిందా అనేది తెలుస్తుంది. రక్తస్రావం వల్ల కాకుండా బ్లాక్ వల్ల వచ్చిన ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే వెంటనే క్లాట్ కరగడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఇది టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్ (టిపిఎ) లేదా టెనెక్టిప్లేస్ ఇంజెక్షన్. ఇలా ఇంజెక్షన్ ఇవ్వడాన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు. దీనివల్ల అప్పటివరకు చచ్చుబడిన భాగాల్లో మెరుగుదల ఉంటుంది. ఈ ఇంజెక్షన్ వల్ల రక్తసరఫరాకు ఆటంకంగా ఉన్న గడ్డ కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది. దాంతో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. ఫలితంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాడీకణాలకు ఆక్సిజన్ అంది, ఇంప్రూవ్ అవుతాయి. ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ రక్తనాళంలో గడ్డ కరగకుండా రక్తనాళం తెరుచుకోకపోతే, మెకానికల్ థ్రాంబెక్టమీ చేస్తారు. అంటే ఎండోవాస్కులర్ థెరపీ ద్వారా కెథటర్ పంపి, క్లాట్ తీసేస్తారు. ఇది 6 గంటలలోపు చేయాలి. కొందరిలో 24 గంటల లోపు కూడా చేయవచ్చు.
పక్షవాతం నుంచి కోలుకోవడానికి ఫిజియోథెరపీ అత్యంత ముఖ్యమైన చికిత్స. ఫిజియోథెరపీలో స్ట్రెంతెనింగ్ వ్యాయామాలు చేయిస్తారు. స్టిఫ్‌నెస్ పోవడానికి ఇంజెక్షన్లు ఇస్తారు. వాకింగ్ చేయిస్తారు. ఇలాంటి వాటివల్ల పక్షవాతానికి గురైన అవయవాలు శక్తిని పుంజుకుని, వాటి పనితీరు మెరుగుపడుతుంది. థ్రాంబోలైటిక్ థెరపీ ఇంజెక్షన్లు ప్రతి జిల్లాలోనూ జిల్లాస్థాయిలోనైనా అందుబాటులో ఉంటే అక్కడే వెంటనే చికిత్స ఇవ్వవచ్చు. వాళ్లు ఇక్కడివరకూ వచ్చే టైం మిగులుతుంది.