అత్తగారికి టిఫిన్ పెట్టి మందులివ్వాలి… మామయ్యకు షుగర్ చెక్ చేయాలి… ఆయనేంటో నీరసంగా ఉంటున్నారు.. ఏంటో కనుక్కోవాలి… బుజ్జివాడేంటో సరిగా తినడం లేదు.. కడుపులో ఎలా ఉందో…… నిరంతరం ఇదే ధ్యాస. ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి ఆలోచించే ఆమె తనకు చాలా రోజులుగా తలనొప్పి వేధిస్తున్నదనే విషయమే మరిచిపోతుంది. ఏ జండూబామో రాసుకుని ఊరుకుంటుంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లదు. పీరియడ్స్‌లో నొప్పి ఎక్కువగా ఉంటే ఏ పెయిన్ కిల్లరో వేసుకుంటుందే గానీ హార్మోన్ సమస్యేమైనా వచ్చిందేమో పరీక్ష చేయించుకోదు. ఇలాంటి స్వభావమే మహిళల ప్రాణాల మీదకు వస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనలలో పురుషుల కంటే మహిళలు చాలా త్వరగా మరణిస్తారని నిర్ధారించారు. ఇందుకు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. వీరిలో 8 రకాల వ్యాధులు చాలా త్వరగా మరణానికి కారణం అవుతున్నాయని వెల్లడిస్తున్నారు. అందుకే అందర్నీ పట్టించుకునే ఆమె ఆరోగ్యం గురించి కాస్త పట్టించుకోండని చెప్తున్నారు అధ్యయనకారులు.
భర్త.., పిల్లలు.., కుటుంబం.. ఇదే తన లోకం. వారి ఆరోగ్యమే తన భాగ్యం. తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో బిజీ అయిపోయి.., తన ఆరోగ్యాన్నే అశ్రద్ధ చేస్తుందామె. అప్పటివరకు కంటి మీద కునుకు లేకుండా తన వారి కోసం శ్రమిస్తూ తను అనారోగ్యం పాలైన సంగతే గుర్తించదు. చివరికి ప్రాణాల మీదకు వస్తే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయదు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
క్యాన్సర్లు
ప్రపంచంలో రెండు మిలియన్ల కంటే ఎక్కువగా మహిళలు బ్రెస్ట్, ఓవేరియన్ క్యాన్సర్లతో పోరాడుతున్నారు. స్త్రీలలో క్యాన్సర్లతో మరణించేవాళ్లు చాలా ఎక్కువ. బ్రెస్ట్, సర్వైకల్, ఒవేరియన్ క్యాన్సర్లు మహిళకు మ్రుత్యుపాశాలవుతున్నాయి. మహిళలు 35సంవత్సరాల తర్వాత మామోగ్రామ్ టెస్టును తప్పకుండా చేయించుకోవాలి. దీనివల్ల బ్రెస్ట్ హెల్తీగా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. 23ఏళ్ళతర్వాత ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ చెకప్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా సెల్ఫ్ చెకప్ వల్ల బ్రెస్ట్‌లో ఏర్పడే అసాధారణ కణుతులు గుర్తించినట్లయితే అది బ్రెస్ట్ కేన్సర్‌కు ప్రారంభ చిహ్నంగా గుర్తించాలి.
ఇకపోతే సర్వైకల్ క్యాన్సర్ మల్టిపుల్ సెక్సువల్ రిలేషన్స్ వల్ల కనిపించేది. దురద్రుష్టవశాత్తు భర్తకు అటువంటి సంబంధాలున్నా భార్యలో సర్వికల్ క్యాన్సర్ అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. అండాశయాల్లో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ కూడా ప్రాణాంతక వ్యాధుల్లో ముఖ్యమైందే. ప్రపంచంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో ఈ కేన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్లకు ప్రారంభదశలో ఎలాంటి లక్షణాలుండవు. కాబట్టి ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవడం ఒక్కటే పరిష్కారం. కుటుంబంలో క్యాన్సర్ రిస్కు ఉంటే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
మధుమేహంలోనూ ఫస్టే
క్యాన్సర్లు మాత్రమే కాదు.. కొంతకాలం నుంచి మహిళల్లో మధుమేహ సమస్య కూడా ఎక్కువగా ఉంటోంది. మేనేజ్ చేయగల ఈ సమస్య కూడా ప్రాణాంతకంగా మారుతున్నది. మహిళల్లో 28ఏళ్ల తర్వాత టైప్ 2 డయాబెటిస్ చాలా సాధారణమైపోయింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని బ్యాలెన్స్ చేయలేనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. కాని ఇంటా బయటా పనులు, బాధ్యతలతో సతమతమయ్యే ఆమె టైం కి తినడం, పడుకోవడం మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నది. కుటుంబానికి, ఉద్యోగానికి అంకితమయ్యే ఆమెకు వ్యాయామం చేసే టైం ఉండట్లేదు. అందుకే డయాబెటిస్ కంట్రోల్ తప్పి ప్రాణాలమీదకు వస్తోంది.
గుండెపోట్లూ పెరుగుతున్నాయ్
మహిళల్లోని ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొటెక్షన్ వల్ల వాళ్లలో గుండెపోట్లు తక్కువ అనుకునేవాళ్లం. కాని మెనోపాజ్ దశలోకి వచ్చిన తరువాత మహిళల్లోనే గుండెపోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 38శాతం మంది మహిళలు మొదటి హార్ట్ అటాక్ సమయంలోనే మరణిస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ధూమపానం అలవాటు ఉన్న మహిళల్లో ఈ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.
రక్తహీనత.. అతి ముఖ్యం
అనీమియా కూడా మరణానికి కారణం అవుతున్నది. మహిళలను ఎక్కువగా బాధిస్తున్న సమస్య రక్తహీనత. అనీమియాకు కారణాలు అనేకం. ప్రతి ముగ్గురిలో ఒకరు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా లేదా అధికంగా ఉండటం కూడా అనీమియాకు కారణం అవుతుంది. ఈ హెల్త్ సమస్య గర్భవతుల్లో, అలాగే ఫీటస్‌లో ఇతర సమస్యలకు దారితీస్తుంది. టీనేజి ఆడపిల్లల్లో కూడా పోషకాహార లోపంతో రక్తహీనత కనిపిస్తోంది. దీంతో పాటు మహిళల్లో అధిక రక్తపోటు, కిడ్నీ వ్యాధులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.
ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడాలన్నా, మరికొంత కాలం జీవించాలన్నా అనేక ట్రీట్మెంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాని సకాలంలో వైద్యం కోసం వెళ్లేవాళ్లే అతి తక్కువ మంది అంటున్నారు వైద్యులు.
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయమిది
మహిళలు ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా పురుషాధిక్యత ప్రభావం తప్పడం లేదు. ఇంటా, బయటా శారీరక ఒత్తిడి, మానసికంగా నలిగిపోవడం, డామినేటెడ్ పరిస్థితులు వాళ్లను డిప్రెషన్ లోకి నెడుతున్నాయి. నిస్సహాయ స్థితిలో చాలామంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సోషల్ స్టిగ్మా చాలామందిని బలితీసుకుంటోంది. సామాజిక పరిస్థితులు మారడం గురించి ఆలోచించకుండా ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరుచుకోవాలి నేటి మహిళలు.
మహిళలు ఇప్పటికైనా మేలుకోవాలి. కుటుంబానికే కాదు.. తమకు కూడా హెల్త్ చెకప్తప్పనిసరి చేసుకోవాలి. నెలకొకసారి వైద్యులను సంప్రదించి మెడికల్ టెస్టులు, ఓవరాల్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. ఇలాంటి మెడికల్ విజిట్స్ వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి 25ఏళ్ళు దాటినప్పటి నుంచి మహిళలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎంత బిజీగా ఉన్నా ఎంతోకొంత సమయాన్ని తమ ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించాలి.