దగ్గాలన్నా.. తుమ్మాలన్నా భయం. చివరికి గట్టిగా నవ్వాలన్నా బెరుకు. చాలామంది మహిళలను ఇలాంటి సందర్భం ఇబ్బంది పెడుతుంటుంది. దీని వెనుక అసలు కారణం.. మూత్రం లీక్ కావడం. అంటే గట్టిగా దగ్గినా, తుమ్మినా, నవ్వినా మూత్రం చుక్కలు బయటకు వస్తాయి. బయటకు చెప్పుకోలేక, బాధ భరించలేక సతమతం అవుతుంటారు మహిళలు. పెద్దవయసులో ఇది మామూలే అని ఏం చేయలేక సరిపెట్టుకుంటారు. కానీ చిన్న చిన్న వ్యాయామాలతో కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
మూత్రం లీకేజీ సమస్యకు ప్రధానంగా రెండు కారణాలుంటాయి. కటి భాగంలో ఉండే కండరాలు బలహీనపడినా, నాడులు దెబ్బతిన్నా ఇలాంటి సమస్య వస్తుంది. ఇలాంటప్పుడు మూత్రాశయం మీద ఏమాత్రం ఒత్తిడి పడినా మూత్రం లీక్ అవుతుంది. దీన్ని స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటారు. మరో కారణం మూత్రాశయ గోడలోని కండరాలు అతిగా సంకోచించటం. దీన్ని ఓవర్‌యాక్టివ్ బ్లాడర్‌గా చెబుతారు. దీనికి తాత్కాలిక ఇన్‌ఫెక్షన్లు కారణమవ్వొచ్చు. లేదా మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్‌సన్స్, పక్షవాతం, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా కారణం కావొచ్చు. కొందరిలో ఈ రెండు సమస్యలూ ఉండవచ్చు. ఈ సమస్యలకు పరిష్కారాలివి.
కీగెల్ వ్యాయామాలు
కటి భాగంలోని కండరాలను బిగపట్టడం, వదలడమే కీగెల్ వ్యాయామం. మూత్ర విసర్జన సమయంలో మూత్రాన్ని హఠాత్తుగా ఆపాలి. ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెట్టి, మూత్రాన్ని వదిలేయాలి. కొన్ని సెకన్ల తరువాత మళ్లీ ఇలాగే చేయాలి. ఇలా ఒకట్రెండు రోజులు చేస్తే ఆ సమయంలో ఏ కండరాలు బిగుసుకుంటున్నాయో అర్థమవుతుంది. మూత్రం ఆపడానికి తోడ్పడే ఈ కండరాల తోనే రోజూ వ్యాయామం చేయాలి. ఇందుకోసం వెల్లకిలా పడుకొని గానీ, మోకాళ్లు కాస్త దూరంగా ఉండేలా కూర్చుని గానీ కటి కండరాలను అయిదు సెకన్ల పాటు బిగపట్టి, అయిదు సెకన్ల సేపు వదిలేయాలి. ఇలా రోజుకి మూడుసార్లు ఈ వ్యాయామం చేస్తే మూత్రాన్ని పట్టి ఉంచడానికి ఉపయోగపడే కండరాలు పటిష్టం అవుతాయి.
మూత్ర విసర్జన ఆలస్యం చేయడం
గంటకు ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్లేవాళ్లయితే మరో 15 నిమిషాల పాటు ఆగిన తర్వాత వెళ్లాలి. మూత్రం వస్తున్నట్టు అనిపించకపోయినా అదే సమయానికి మూత్రవిసర్జనకు వెళ్లాలి. కొన్ని రోజులయ్యాక క్రమంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన సమయాన్ని పొడిగించుకోవాలి. మూత్రం రాగానే వెంటనే వెళ్లకుండా ఓ 5 నిమిషాలు ఆపుకోవడానికి ప్రయత్నించాలి. క్రమంగా ఆ సమయాన్నీ పెంచాలి. ఇలా 3 నుంచి 4 గంటలకు ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్లేలా అలవాటు చేసుకోవచ్చు.
బరువు తగ్గటం
అధిక బరువు కూడా ఇన్‌కాంటినెన్స్‌కి కారణమవుతుంది. బరువు ఎక్కువ ఉండటం వల్ల మూత్రాశయం, కటి కండరాల పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకోవాలి. శారీరకంగా చురుగ్గా ఉండే మహిళల్లో ఈ సమస్య వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఈ మార్పులూ అవసరం
మూత్రం లీకయ్యే సమస్య ఉన్నవాళ్లు అవసరమైనంత మేరకే ద్రవాలను తీసుకోవాలి. పొగ తాగే అలవాటుంటే మానేయాలి. కెఫీన్ పానీయాలు తగ్గించాలి. మద్యం ముట్టవద్దు. కూల్‌డ్రింకులు, మసాలా పదార్థాలు తగ్గించాలి. పుల్లనివి తక్కువగా తీసుకోవడం మంచిది.