కొవిడ్.. ఊపిరితిత్తుల్లో మొదలైనా అది శరీరం అంతటినీ ప్రభావం చూపిస్తున్నది. అందుకే అది వచ్చి తగ్గిపోయినా ఇతర అవయవాలకు సంబంధించిన సమస్యలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్నిసార్లు వీటివల్ల ప్రాణాపాయం కూడా సంభవిస్తున్నది. కొవిడ్ వచ్చి తగ్గిన 4 నుంచి 8 వారాల తర్వాత అవే లక్షణాలు రిపీట్ కావడం లేదా కొత్త సమస్యలు రావడాన్నే పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్‌గా భావిస్తున్నారు.
పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ ముఖ్యంగా హాస్పిటల్‌లో చేరి, స్టిరాయిడ్స్ తీసుకున్నవాళ్లు, ఆక్సిజన్ థెరపీ అవసరం అయినవాళ్లలో పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తున్నది. ఇటీవల ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో పోస్ట్ కొవిడ్ కేర్ క్లినిక్‌ని ప్రారంభించిన సందర్భంగా పోస్ట్ కొవిడ్ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ప్రముఖ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి.
కష్టాల్లో అవయవాలు…
ఊపిరితిత్తులు
కొవిడ్ వల్ల ముఖ్యంగా నేరుగా ప్రభావితమయ్యేది ఊపిరితిత్తులే. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులు క్రమంగా గట్టిపడి ఫైబ్రోసిస్‌కి గురవుతున్నాయి. ఇలా గట్టిపడిన ఊపిరితిత్తుల కణజాలం పూర్తిగా దెబ్బతిని, పనిచేయకుండా అయిపోతున్నది. ఊపిరితిత్తుల కొంతభాగం పనిచేయకపోయేసరికి శరీరానికి అందే ఆక్సిజన్ తగ్గిపోతుంది. క్రమంగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నది.
జీర్ణ సమస్యలు (గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ సమస్యలు)
మన జీర్ణవ్యవస్థలో శరీరానికి మేలు చేసే బాక్టీరియా ఉంటాయి. కొవిడ్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఈ సూక్ష్మజీవుల్లో మార్పులు వస్తున్నాయి. దాంతో జీర్ణప్రక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. అజీర్తి, డయేరియా, గ్యాస్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు అన్నవాహికలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కూడా కనిపిస్తున్నది.
గుండె సమస్యలు
కొవిడ్ వచ్చి, తగ్గిన 4 నుంచి 6 వారాల్లోపే సడెన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇవి 30 ఏళ్ల లోపు వయసు వాళ్లలో కూడా కనిపిస్తున్నాయి. రక్తనాళాలు వాచిపోయి ఆర్టరైటిస్ సమస్య వస్తున్నది. దాంతో రక్తప్రసరణ సజావుగా జరుగక గుండెపోట్లు వస్తున్నాయి. న్యూరలాజికల్ సమస్యలు కూడా చాలామందిలో వస్తున్నాయి.
మెదడు
కొవిడ్ ఇన్‌ఫెక్షన్ వచ్చి తగ్గిన 6 నుంచి 8 వారాల్లోపల మూడు పదుల వయసు వారు కూడా బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతానికి గురవుతున్నారు. అంతేగాక వాళ్లలో జ్ఞాపకశక్తి తగ్గిపోతున్నది. ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. కొందరిలో అయితే సైకియాట్రిక్ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.
ఆటోఇమ్యూన్ సమస్యలు
కొవిడ్ తర్వాత చాలామందిలో ఆటో యాంటీబాడీలు పెరుగుతున్నాయి. అంటే సొంత శరీర కణజాలం పైనే దాడిచేసే యాంటీబాడీలన్నమాట. 83 రకాల ఆటోయాంటీబాడీలు కొత్తగా కొవిడ్ తర్వాత ఏర్పడుతున్నాయని ఇటీవల జరిగిన జపనీస్ అధ్యయనంలో తేలింది.
ఇవి ముఖ్యంగా గుర్తించిన సమస్యలు మాత్రమే. చాలామందిలో కీళ్లనొప్పులు, కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. పోస్ట్ కొవిడ్‌లో మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఎస్‌ఐఎస్) అనే పరిస్థితి వస్తున్నది. దీనివల్ల చాలా జీవవ్యవస్థల్లో ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తున్నది. అందుకే అన్ని అవయవాలూ ఏదో ఒక రకంగా కష్టంలో పడుతున్నాయి. అందుకే పోస్ట్ కొవిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పోస్ట్ కొవిడ్ కేర్ క్లినిక్‌ని సంప్రదించాలి. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఈ పోస్ట్ కొవిడ్ కేర్ ఇప్పుడు అందుబాటులో ఉన్నది.