పోస్ట్‌ కొవిడ్‌ నీరసానికి ఇక చెక్‌!

తొందరగా అలసిపోతున్నారా..? ఒంట్లో శక్తి లేనట్టుగా ఉంటోందా..? పరిశోధకులు దీనికి ఓ మంచి పరిష్కారం చూపిస్తున్నారు. నీరసానికి బై చెప్పడం ఇక మీ చేతుల్లోనే.. అదెలాగంటారా..? చదవండి మరి.

వైరల్‌ ఇన్‌ ఫెక్షన్‌ తరువాత కొద్ది రోజుల వరకూ చాలా అలటగా, నీరసంగా ఉండటం సర్వసాధారణం. ఇక కొవిడ్‌ లాంటి వైరస్‌ వ్యాధులు వచ్చిన తర్వాత నీరసం ఒక రేంజ్‌ లో ఉంటుంది. కొవిడ్‌ బారిన పడిన వారిలో చికిత్స పూర్తయి, వ్యాధి తగ్గిపోయినప్పటికీ దాని ప్రభావం నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలు చాలామందిని బాధిస్తున్నాయి. వీటిలో నీరసం, నిస్సత్తువ లాంటివి తగ్గడంలో కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు పరిశోధకులు ఇటీవలి అధ్యయనాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఆమ్‌ స్టర్‌ డామ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ లో సైకాలజీ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న హాన్స్‌ నూప్‌ పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. కొవిడ్‌ తర్వాత ఎన్నాళ్లయినా నీరసం తగ్గకుండా అవస్థలు పడేవాళ్లలో ఈ లక్షణాలు తగ్గించడానికి కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ సహాయపడుతుందని ఆయన చెబుతున్నారు. కాగ్నిటివ్‌ థెరపీ ద్వారా లక్షణాలు మరింత తీవ్రం కాకుండా నివారించడమే కాకుండా, అప్పటికే ఉన్న నీరసం కూడా తగ్గి, యాక్టివ్‌ గా అవుతున్నట్టు ప్రొఫెసర్‌ నూప్‌ అంటున్నారు.

సాధారణంగా మానసికంగా కుంగిపోయినప్పుడు, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ లాంటి సమస్యలున్నప్పుడు కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ ఇస్తారు. సైకలాజికల్‌ స్ట్రెస్‌ తగ్గించడానికి ఈ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. సైకియాట్రిక్‌ మందులు అవసరమైనవాళ్లలో కూడా కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (సిబిటి) ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను అందుకోవచ్చు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే విధంగా తమ ఆలోచనలను మార్చుకోవడానికి, భావోద్వేగాలను బ్యాలెన్స్‌ చేసుకోవడానికి, సానుకూల దృక్పథాన్ని ఏర్పరుచుకుని, కాన్ఫిడెంట్‌ గా ముందుకు సాగడానికి ఈ థెరపీ సహాయపడుతుంది. పోస్ట్‌ కొవిడ్‌ వల్ల కలిగే స్ట్రెస్‌ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కుంగదీస్తుంది. అందుకేనేమో.. కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ పోస్ట్ కొవిడ్‌ లేదా లాంగ్‌ కొవిడ్‌ నీరసం నుంచి బయటపడటానికి కూడా హెల్ప్‌ చేస్తున్నట్టు ఈ అధ్యయనాల్లో తేలింది.

పోస్ట్‌ కొవిడ్‌ బాధితులకు కాగ్నిటివ్‌ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్లను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా చేయడం సాధ్యమవుతుందని ప్రొఫెసర్‌ నూప్‌ భావిస్తున్నారు. వీళ్లలో నీరసం తగ్గడంతో పాటుగా ఏకాగ్రత పెరిగినట్టు కూడా తమ అధ్యయనంలో తేలిందని ఆయన చెబుతున్నారు.

ప్రొఫెసర్‌ హాన్స్‌ నూప్‌
సైకాలజీ ప్రొఫెసర్‌
ఆమ్‌ స్టర్‌ డామ్‌ యుఎంసి
Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *