బ్లడ్ క్యాన్సర్.. ఇదిగో భరోసా!

రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తే… జ్వరం వస్తుంది….. రక్తం తక్కువైతే.. శక్తి తగ్గి నీరసం వస్తుంది….. రక్తం ఎక్కువైతే… క్యాన్సర్.. బ్లడ్ క్యాన్సర్..!

ఇతర శరీర భాగాల్లో క్యాన్సర్ ఏర్పడితే అది కణితిలా కనిపిస్తుంది. దాన్ని శస్త్ర చికిత్స చేసి తొలగించవచ్చు. మరి ద్రవరూపంలో ఉండే రక్త కణజాలానికి క్యాన్సర్ ఏర్పడితే కణితి కనిపించదు కదా… మరి దీనినెలా ఎదుర్కోవడం… ఇందుకు పరిష్కారంగా రకరకాల మందులతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది.

శరీరంలో ఉండే ఏ రకమైన కణాలైనా అనియంత్రంగా, క్రమ పద్ధతి లేకుండా పెరుగుతూ ఉంటే వచ్చే జబ్బే క్యాన్సర్. ఇందుకు రక్తం కూడా మినహాయింపు కాదు. ఎరుపు, తెలుపు రక్తకణాలతో పాటు రక్తంలో ప్లేట్ లెట్ కణాలు కూడా ఉంటాయి. ఈ మూడు రకాల కణాల్లో ఏవైనా క్యాన్సర్ కు గురవ్వొచ్చు. తెల్ల రక్తకణాలకు క్యాన్సర్ వస్తే నీరసం, ఆయాసం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎర్ర రక్తకణాల్లో క్యాన్సర్ వస్తే జ్వరం, ఇన్ఫెక్షన్లు కనిపిస్తాయి. ఇక ప్లేట్ లెట్ లకు క్యాన్సర్ వస్తే శరీర భాగాల్లో ఎక్కడి నుంచైనా రక్త స్రావం కావొచ్చు. వీటిని ఎంత త్వరగా కనిపెట్టి, చికిత్స మొదలుపెడితే అంత మంచి ఫలితం ఉంటుంది.

రక్తకణాలు ఎముకలో ఉండే మూలుగ లేదా మజ్జ నుంచి ఏర్పడుతాయి. దీన్నే బోన్ మ్యారో అంటారు. ఈ బోన్ మ్యారో లోని మూలకణాలే (స్టెమ్ సెల్స్) పరిణతి చెంది, ఆయా రక్తకణాలుగా మారుతాయి. ఇక్కడ లోపం ఉన్నప్పుడు ఈ కణాలు అదుపు లేకుండా పెరిగిపోతాయి. ఇవి మామూలు రక్తకణాలు చేసే పనులను నిర్వర్తించలేవు. అందుకే వీటిని క్యాన్సర్ కణాలంటారు.

బ్లడ్ క్యాన్సర్లు తెల్ల రక్తకణాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రధానంగా ల్యుకేమియా, లింఫోమా, మైలోమా అని మూడు రకాలుగా ఉంటాయి. బ్లడ్ టెస్ట్, బోన్ మ్యారో పరీక్షల ద్వారా బ్లడ్ క్యాన్సర్ ను నిర్ధారిస్తారు.

చికిత్స విధానాలు

బ్లడ్ క్యాన్సర్ కు ప్రధానంగా మందులతో పాటు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ (ఎముక మజ్జ లేదా మూలుగ మార్పిడి) ద్వారా చికిత్స అందిస్తారు. బోన్ మ్యారోలోని స్టెమ్ సెల్స్ ను ఇందుకు ఉపయోగిస్తారు కాబట్టి దీన్ని స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ అని కూడా అంటారు. క్యాన్సర్ ఉన్న దశ, రోగి వయసు, ఆరోగ్య పరిస్థితులను బట్టి చికిత్సను ఎంచుకుంటారు. కీమోథెరపీలో సైతం ఇప్పుడు అత్యుత్తమ మందులు అందుబాటులోకి వచ్చాయి.

బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్.. రకాలు

బోన్ మ్యారో మార్పిడిలో రెండు విధానాలున్నాయి. ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ లో రోగి సొంత మూలకణాలనే తిరిగి అదే వ్యక్తికి ఎక్కిస్తారు. లింఫోమా, మైలోమా క్యాన్సర్లకు ఈ పద్ధతి అవలంబిస్తారు. ఇక రెండవది అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్. ఈ విధానంలో దాత నుంచి మూలకణాలను సేకరించి బోన్ మ్యారో మార్పిడి చేస్తారు. అయితే మూలకణాలను దానం చేసే వ్యక్తి హెచ్ఎల్ఎ (హ్యమూన్ ల్యూకోసైట్ యాంటిజెన్) అనే జన్యువు రోగిలోని జన్యువుతో తప్పనిసరిగా సరిపోలాలి. సాధారణంగా రోగి తోబుట్టువుల హెచ్ఎల్ఎ సరిపోయే అవకాశం ఎక్కువ. ల్యుకేమియా క్యాన్సర్లకు తప్పనిసరిగా ఈ పద్ధతే అవసరం అవుతుంది. అప్లాస్టిక్ అనీమియా, సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, ఇమ్యునో డెఫీషియన్సీ సమస్యలకు కూడా ఈ విధానం ద్వారా మూలకణ మార్పిడి చికిత్స అందిస్తారు. సాధారణంగా 75 ఏళ్ల వయసు వరకు ఈ చికిత్స చేయవచ్చు. కానీ వయసు ఎంత తక్కువ ఉంటే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయి.

హెచ్ఎల్ఎ కలవకపోతే…

ఇంతకుముందు వరకు హెచ్ఎల్ఎ పూర్తిగా సరిపోలితేనే ఎముక మజ్జ మార్పిడి చేయడం సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్య నైపుణ్యాలు ఈ సమస్యను అధిగమించాయి. హెచ్ఎల్ఎ సగం వరకు సరిపోయినా పరవాలేదు. బోన్ మ్యారో మార్పిడి చేయడం ఇప్పుడు సుసాధ్యం అవుతోంది. దీన్నే హాఫ్ మ్యాచ్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ అంటారు. దీనివల్ల తోబుట్టువులు లేకపోయినా, లేక వారి హెచ్ఎల్ఎ సరిపోలకపోయినా దాతల నుంచి స్టెమ్ సెల్స్ సేకరించడానికి అవకాశం ఉంటున్నది.

ప్రయోజనాలు

బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా బ్లడ్ క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయవచ్చు. దీర్ఘకాలికంగా కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు.

డాక్టర్ గణేష్ జైషట్వార్
సీనియర్ హెమటో ఆంకాలజిస్టు,
బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ నిపుణులు
యశోద హాస్పిటల్స్
హైదరాబాద్
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

2 Comments

  1. ర‌చ‌న గారూ,

    క్యాన్స‌ర్ గురించి అవ‌గాహ‌న బాగా పెర‌గాల్సి ఉంది. రెండు మూడేళ్ల నుంచి తెలిసిన ఎవ‌రో ఒక‌రు దీని బారిన ప‌డుతున్నారు. వారి వైద్యం కోసం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రుల‌కు త‌ర‌చూ వెళ్లాల్సి వ‌స్తోంది. అక్క‌డ ర‌ద్దీని చూస్తే వ‌ణుకు పుడుతోంది. చాలామంది స్టేజ్ 3.. ఫైన‌ల్ స్టేజ్ వాళ్లే క‌నిపిస్తున్నారు. ప్రాథ‌మిక స్థాయిలో గుర్తిస్తే త‌ప్ప బాగ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం క‌ల‌గ‌డ‌ని మొండి ర‌కం క్యాన్స‌ర్ల‌ను అయిన‌వారిలో చూశాను. మీ ఆర్టిక‌ల్స్‌లో అందుబాటులో ఉన్న వైద్యం గురించే కాకుండా, అనుమానించ‌ద‌గ్గ విష‌యాల‌ను కూడా పొందుప‌ర‌చండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *