క్యాన్సర్ వచ్చిందంటే ఇక బతకడం కష్టం అని భయపడతాం. కానీ కొత్త పరిశోధనలు క్యాన్సర్ చికిత్సలను మరింత విజయవంతం చేస్తున్నాయి. అయినా క్యాన్సర్ గురించి అనేకానేక సందేహాలు గందరగోళపరుస్తూనే ఉంటాయి. అందుకే వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అమోర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఆర్థో ఆంకాలజిస్ట్, డాక్టర్ కిశోర్ బి. రెడ్డి ఏం చెబుతున్నారంటే…
క్యాన్సర్ వస్తే డెత్ సెంటెన్స్ అన్నట్టేనా?
ఒకప్పుడు క్యాన్సర్ ముదిరేవరకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు తొందరగా గుర్తించగలుగుతున్నాం. క్యాన్సర్ వచ్చిన అవయవాన్ని బట్టి చికిత్సలలో కూడా స్పెషలైజేషన్లు రావడం వల్ల చికిత్సా నైపుణ్యం పెరిగింది. కణితి చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాలు డ్యామేజీ కాకుండా చికిత్సలు అందించగలుగుతున్నాం. కాబట్టి క్యాన్సర్ వస్తే ఇక అదొక డెత్ సెంటెన్స్ అనే భయం ఇప్పుడు లేదు.
క్యాన్సర్ రాకుండా నివారించొచ్చా?
హెచ్ పీవీ వాక్సిన్ తో సర్వికల్ క్యాన్సర్ రాకుండా 90 శాతం నివారించవచ్చు. స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వీలు కలిగింది. 50 దాటిన వాళ్లు రెగులర్ గా ప్రతి ఏటా ఈ స్క్రీనింగ్ టెస్టులను చేయించుకోవాలి.
బయాప్సీతో క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా?
ఓపెన్ బయాప్సీలో ఈ రిస్కు ఉంటుంది. కానీ కొన్ని సూత్రాలకు లోబడి బయాప్సీ చేస్తే స్ప్రెడ్ ఉండదు. సాధారణంగా నీడిల్ బయాప్సీనే ఎంచుకుంటాం.
క్యాన్సర్ పేషెంట్లు మసాజ్ చేయించుకోవచ్చా?
మసాజ్ లూ, మాలిష్ లూ వీళ్లకు అస్సలు వద్దు. కొన్ని రకాల క్యాన్సర్లు మసాజ్ చేయడం ద్వారా స్ప్రెడ్ కావొచ్చు.
చక్కెర పదార్థాలు తింటే క్యాన్సర్ పెరుగుతుందా?
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ పెరిగే ప్రమాదం లేకపోలేదు. సంక్లిష్టమైన చక్కెరల కన్నా సింపుల్ షుగర్స్ తో ఈ రిస్కు ఎక్కువ.
ప్రతి గడ్డా క్యాన్సరేనా?
శరీరంలో ఏర్పడే గడ్డలన్నీ క్యాన్సర్ కాదు. హానికరం కాని బినైన్ ట్యూమర్లు కూడా ఉంటాయి. కొవ్వుల ద్వారా లిపోమాస్ అనే గడ్డలు కూడా ఏర్పడుతుంటాయి. కాబట్టి అన్ని గడ్డలనూ క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. అయితే సడెన్ గా గడ్డ సైజు పెరిగినా, దాని నిర్మాణంలో ఏమైనా మార్పులు వచ్చినా, దాని నుంచి ఏవైనా స్రావాలు వచ్చినా, నొప్పి ఉన్నా… అని క్యాన్సర్ గడ్డ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
బాధ లేని కీమోథెరపీ ఉండదా?
కొన్ని రకాల కీమోథెరపీల వల్ల సైడ్ ఎఫెక్టులు రావడం సహజం. అయితే ఇవన్నీ తాత్కాలికమే. చికిత్స అయిపోయిన కొద్ది వారాలకు ఇవి తగ్గిపోతాయి.
గర్భిణులు క్యాన్సర్ చికిత్స తీసుకోవచ్చా?
ఇది గైనకాలజిస్టు, ఆంకాలజిస్టు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. చికిత్స ద్వారా బేబీ సురక్షితంగా డెలివరీ అయ్యే పరిస్థితి ఉందా లేదా అనేది గమనించి, తదనుగుణంగా చికిత్స అందించాలి.
వంశపారంపర్యంగా వస్తుందా?
క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని జన్యువులు వంశానుగతంగా వస్తాయి. రొమ్ము క్యాన్సర్, కొన్ని రకాల ఆర్థోక్యాన్సర్లు కూడా వంశానుగతంగా రావొచ్చు.
క్యాన్సర్ అంటువ్యాధా?
ఇది పూర్తిగా అపోహే. క్యాన్సర్ ఒకరి నుంచి మరొకరికి అంటుకోదు.
మొబైల్స్, టవర్స్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందా?
రేడియో ఫ్రీక్వెన్సీ, రేడియేషన్ తరంగాల వల్ల కొన్ని రకాల ట్యూమర్లు వచ్చే అవకాశం గురించి జంతువుల్లో అనేక అధ్యయనాలు చేశారు. వీటివల్ల జంతువుల్లో మార్పులు కలిగాయి కానీ మనుషుల్లో మాత్రం ఇంతవరకు రుజువు కాలేదు.
ఆహారపదార్థాలలో క్యాన్సర్ కు కారణమయ్యేవి ఉన్నాయా?
ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లో కలిపే నిలవ పదార్థాలు, ఫుడ్ ఫ్లేవర్లు, అడిటివ్స్ లాంటివి క్యాన్సర్ రిస్కు పెంచుతాయని రీసెర్చ్‌లో తేలింది. వీటిలోని హెవీ మెటల్స్, ఇతర కంటామినెంట్స్ క్యాన్సర్ కు కారణమవుతాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎక్కువగా వాడే ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ కూడా మంచివి కావు.
సర్జరీ చేయించుకుంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా?
నిపుణులైన సర్జన్ ద్వారా చేయించుకుంటే రిస్కు ఉండదు.
డియోడరెంట్స్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రావొచ్చా?
దీనిమీద చాలా స్టడీస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ రాండమ్ స్టడీస్. పూర్తి స్థాయిలో రుజువు కాలేదు.
హెర్బల్ మెడిసిన్స్ తో క్యాన్సర్ ను నయం చేయవచ్చా?
ఆయుర్వేదం, నాచురోపతి లాంటి చికిత్సలతో కలిపి క్యాన్సర్ చికిత్స అందిస్తే మరిన్ని మంచి ఫలితాలను సాధించవచ్చు. ఆయుర్వేదంలో వాడే పసుపు, అశ్వగంధ లాంటివి క్యాన్సర్ చికిత్సకు సహాయం చేయగలవని స్టడీస్ లు ఉన్నాయి.
పాజిటివ్ థింకింగ్ ద్వారా క్యాన్సర్ ను జయించవచ్చా?
ఏ జబ్బు నుంచి అయినా త్వరగా కోలుకోవాలంటే మానసిక ధైర్యం ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ విషయంలో కూడా అంతే. మైండ్ పవర్ తో క్యాన్సర్ ను ఎదుర్కొని విజయవంతంగా నిలబడినవాళ్లు ఎంతమందో ఉన్నారు.
డైట్ తో క్యాన్సర్ ను ఎదుర్కోగలమా?
రిఫైన్డ్ పదార్థాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేవి.. ఇలా పొట్టకు చేటు చేసేవేవైనా క్యాన్సర్ రిస్కు పెంచేవే. వీటికి దూరంగా ఉంటూ, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మేలు. పసుపులో యాంటీ కార్సినోజెనిక్ పదార్థాలున్నాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి పసుపు వాడకాన్ని పెంచాలి. అశ్వగంధ కూడా ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసే యాంటీ కార్సినోజెనిక్ పదార్థం.
డాక్టర్ కిశోర్ బి. రెడ్డి,
మేనేజింగ్ డైరెక్టర్ & సీనియర్ ఆర్థో ఆంకాలజిస్ట్,
అమోర్ హాస్పిటల్స్,
కూకట్ పల్లి వై జంక్షన్,
హైదరాబాద్.