బెల్ మోగింది… పిల్లలందరూ తరగతి గది నుంచి లేడి పిల్లల్లా గ్రౌండ్ లోకి పరుగులు తీశారు. వరుణ్ కూడా లేని ఉత్సాహం తెచ్చుకుని ప్లే గ్రౌండ్ వైపు నడిచాడు. పిల్లలందరూ ఒక వైపు ఫుట్ బాల్.. మరో వైపు షటిల్… ఇంకోవైపు క్రికెట్… కబడీ…. ఇలా ఎన్నో రకాల ఆటలు ఆడుతున్నారు. వారి కేరింతలతో క్రీడామైదానం అంతా ప్రతిధ్వనిస్తోంది. కానీ, వరుణ్ మాత్రం ఓ చెట్టు కింద మౌనంగా కూర్చున్నాడు. వాళ్లతో పాటు చెంగు చెంగున ఎగురుతూ ఆడుకోవాలని ఉంది. కానీ ఎవరూ తనతో ఆడరు.
“అటు చూడండిరా… ఏలియన్ అక్కడ కూచున్నాడు…” అంటూ వరుణ్ వైపు చూస్తూ నవ్వుకుంటున్నారు కొందరు పిల్లలు. “అరే.. ఏలియన్.. ఇక్కడ గ్రౌండ్ లో ఎందుకు… క్లాస్ లోకి వెళ్లి కూర్చో. ఈ ఆటలన్నీ నీకెందుకు..?” ఇంకో ఇద్దరు పిల్లలు వరుణ్ దగ్గరికి వచ్చి, ఎగతాళి చేశారు. వరుణ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. మనసులో బాధ గుండెను మెలిపెడుతోంది. నాకే ఎందుకీ అవస్థ..? నేనెందుకు అందరిలా లేను..? నాతో పాటు చదువుకునే పిల్లల్లా కాకుండా ఇంత పొట్టిగా ఎందుకు ఉన్నాను? అసలు బలమే లేకుండా ఇంత సన్నగా ఎందుకు ఉన్నాను..? వరుణ్ మనసు బాధగా మూలిగింది. గ్రౌండ్‌లో ఆటలే ఆడలేని తాను ఇక ఆస్ట్రోనాట్ ఎలా అవుతాడు?
బాధగా కూర్చున్న వరుణ్ దగ్గరికి “ఏమైందిరా..?” అంటూ, అతని ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. “నన్నెవరూ ఆడనివ్వడం లేదు. టీచర్లు కూడా ఆడొద్దు.. ఓ పక్కన కూర్చో అంటున్నారు. నాకూ ఆడుకోవాలని ఉంటుంది కదా….” అన్నాడు వరుణ్. “నీకు ఆరోగ్యం బాగా ఉండదు కదా. చాలా సెన్సిటివ్ గా ఉంటావు. ఆ ఆటలు ఆడితే నీకు కష్టం అవుతుంది…” అంటూ నచ్చజెప్పారు.
వరుణ్ మిత్ర.. పుట్టుకతోనే కాలేయంలో వ్యాధి. కామెర్లు, ఒంటి నిండా దురదలు, వాటి వల్ల చర్మమంతా దద్దుర్లతో రోజంతా అవస్థపడేవాడు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. నిద్రపోవడం గగనమే. మల పదార్థం నార్మల్ గా కాకుండా నూనెలా ఉండేది. 80 రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడే అన్ని రకాల పరీక్షలూ చేశారు. రకరకాల పరీక్షలు చేసి, బిలియరీ అట్రేషియా అనే పుట్టుకతో వచ్చే కాలేయ వ్యాధిగా నిర్ధారణ చేశారు. ఇందుకోసం కసాయ్ అనే చికిత్స కూడా చేశారు. కానీ వరుణ్ ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పూ లేదు. వరుణ్ తల్లిదండ్రులు ఇద్దరూ ఆయుర్వేద డాక్టర్లు. అయినా ఎక్కడా తమ బిడ్డను రక్షించుకునే మార్గం కనిపించక అల్లల్లాడిపోయారు.
ఇక బతకడా….?!
వరుణ్ కి 8 ఏళ్ల వయసులో అసలు విషయం తెలిసింది. తనకు ఉన్నది అరుదైన వ్యాధే. కానీ బిలియరీ అట్రేషియా కాదు. వరుణ్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అలిగలె సిండ్రోమ్ వ్యాధి వల్లనే వరుణ్ లో ఎదుగుదల లేదనేది నిర్ధారణ అయింది. సాధారణంగా జన్యుపరమైన వ్యాధులకు చికిత్స ఉండదు. చాలావరకు ప్రాణాపాయం తప్పదు. అందుకే వరుణ్ మిత్ర కూడా ఇక బతికే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు డాక్టర్లు. కానీ వరుణ్ తల్లి అరుణా రాణి ఓటమిని అంగీకరించలేదు. తన బిడ్డను బతికించుకోవచ్చు అని భావించిన ఏ అవకాశాన్నీ ఆమె వదలలేదు. ఏ పుట్టలో ఏ పాముందో… అన్నట్టుగా… ఎక్కడ ఏ డాక్టర్ బెస్ట్ అని తెలిసినా వరుణ్ ని తీసుకెళ్లారు. కానీ అందరిదీ ఒకటే మాట… ఆశలు పెట్టుకోవద్దని. కాలేయ మార్పిడి ఆపరేషన్ చేసినా కూడా అంత సెన్సిటివ్ గా ఉన్న పిల్లవాడి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం దాదాపుగా లేదనే చెప్పారు. “బతికే ఆశ లేనప్పుడు బాబుకు ఆపరేషన్ పెయిన్ ఇవ్వడం ఎందుకు.. ఉన్నన్ని రోజులైనా హాయిగా ఉంటాడు కదా అనుకున్నాం. ఒకానొక సందర్భంలో ఇక బాబు పై పూర్తిగా ఆశ వదులుకున్నాం….” అంటూ చెమర్చిన కళ్లతో చెప్తారు అరుణా రాణి.
కష్టంలో గుండె..
కాలేయంలోనే సమస్య ఉందని ఒకవైపు బాధపడుతుంటే.. మరోవైపు అశనిపాతంలా వరుణ్ పల్మనరీ ఆర్టరీలో కూడా సమస్య ఉందని తేలింది. ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళమైన పల్మనరీ ఆర్టరీలో బ్లాక్ ఉండటం వల్ల విపరీతమైన ఆయాసంతో బాధపడేవాడు. ఆ అడ్డంకులను తొలగించడానికి పల్మనరీ ఆర్టరీలో స్టెంట్ వేశారు. మళ్లీ బ్లాక్స్ ఏర్పడకుండా ఉండటం కోసం రక్తాన్ని పలుచబరిచే బ్లడ్ థిన్నర్ మందులను కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిలో వరుణ్ కి కాలేయానికి సర్జరీ చేయాలంటే కత్తిమీద సామే. అందుకే తనకు చికిత్స కష్టమని చాలామంది డాక్టర్లు అభిప్రాయపడ్డారు.
చిగురించిన ఆశ
మన జీవితంలో ఎవరితో పరిచయమైనా దాని వెనుక ఏదో కారణం ఉంటుందంటారు. అలాగే డాక్టర్ నయీమ్ ని కలవడం తన బాబు పాలిట వరమైందంటారు అరుణ. బాబుకి లివర్ ట్రాన్స్ ప్లాంట్ తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని ఆయన ఇచ్చిన భరోసాతో తల్లిగా తాను గెలుస్తానన్న ఆశ కలిగిందామెకు. తన బిడ్డడికి తన కాలేయమే తీసుకోమని ముందుకొచ్చింది. అలా.. అరుణ నుంచి కాలేయ భాగాన్ని తీసుకుని వరుణ్ మిత్రకు ట్రాన్స్ ప్లాంట్ చేశారు. కడుపులో తన ఊపిరితో ప్రాణం నిలిపిన ఆ అమ్మ… ఇప్పుడిలా తన కాలేయంతో కొత్త ఊపిరి పోసింది.
గెంతులేసే లేడి… వరుణ్
ఇప్పుడు వరుణ్ ని చూస్తే… మొన్నటి వరకూ రకరకాల అనారోగ్యాలతో అవస్థపడ్డ పిల్లవాడేనా.. అనే అనుమానం కలుగుతుంది. అందుకేనేమో… “అప్పటి మా వరుణ్ అసలు లేడు. వీడు వేరే. వాడిని కోల్పోయాం. వీడిని మళ్లీ కన్నాం… అనిపిస్తుంది. లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీకి ముందు వరుణ్ కీ… ఇప్పుడు వరుణ్ కీ అంత తేడా ఉంది” అని చెప్తారు వరుణ్ తల్లి అరుణ. గలగలా మాట్లాడేసే 12 ఏళ్ల వరుణ్.. ఈ 12 ఏళ్లలో తాను కోల్పోయిందంతా ఇప్పుడే అనుభవించాలనేలాగ ఉంటారు. ఇన్నాళ్లూ ఆడని ఆటలన్నీ ఆడేయాలన్నట్టు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టే పరుగులు తీస్తుంటాడు. అంతేకాదు, వరుణ్ మంచి గాయకుడు. కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాడు. పాటలూ, పద్యాలే గాక, భగవద్గీత శ్లోకాలు, స్తోత్రాలు కూడా కరతలామలకం. చలాకీగా మాట్లాడుతూనే ఉంటాడు. తను అలా మాట్లాడుతూ ఉంటే.. ఎన్ని గంటలైనా అలా వింటూ ఉండాలనిపిస్తుంది. భవిష్యత్తులో ఆస్ట్రోఫిజిక్స్ లో సైంటిస్ట్ కావాలనుకునే వరుణ్ కల తప్పక తీరుతుందనే ఆశిద్దాం.
అరుదైనదే.. కానీ..!
అలిగలె సిండ్రోమ్ అనేది జన్యులోపం వల్ల వచ్చే వ్యాధి లక్ష మందిలో ఒకరికి కనిపించే అరుదైన ఈ వ్యాధి శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కాలేయ నిర్మాణంలో లోపం ఉంటుంది. వీళ్లలో బైల్ డక్ట్ లు సరిగా ఏర్పడక పిత్తరసం రక్తంలోకి చేరుతుంది. కాలేయంలో కూడా నిండుతుంది. దానివల్లనే కామెర్లు, దురదలు. లివర్ ఫెయిల్ అయిపోతుంది. లివర్ మాత్రమే కాకుండా గుండె, కళ్లు, ముఖం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, వెన్నుపాము లాంటి ప్రధాన అవయవాలన్నీ ఈ వ్యాధి వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొందరిలో లక్షణాలు మైల్డ్ గా ఉంటాయి. కొందరిలో మాత్రం ప్రాణాపాయానికి దారితీసేలా ఉంటాయి. వరుణ్ విషయంలో కేవలం లివర్ పై మాత్రమే తీవ్రమైన ప్రభావం పడింది. అయితే, పల్మనరీ ఆర్టరీలో స్టెంటింగ్ చేయడం, బ్లడ్ థిన్నర్లు ఇవ్వడం వల్ల లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేయడం చాలా రిస్క్ అయింది. కానీ అదృష్టవశాత్తు సక్సెస్ అయింది. ఇక వేరే అవయవాలకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఇమ్యునో సప్రెసెంట్ మందులు వాడాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వరుణ్ తెలివైన పిల్లవాడు. ధైర్యవంతుడు. త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు స్విమ్మింగ్ కూడా చేస్తున్నాడు.
డాక్టర్ మహమ్మద్ నయీమ్
లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్.