ముక్కు బాధ ఇంతింతగాదయా!!

ముక్కు ఉన్న ప్రతి వాడికీ జలుబు రాకుండా ఉండదు. అయితే కొందరికి అసలు జలుబు అయినట్టు కూడా ఉండదు. ఏదో నాలుగు సార్లు ముక్కు కారడం, ఆరుసార్లు తుమ్మడం లాగా ఉంటుంది. కానీ కొందరికి జలుబంటే నరకమే. అంతకన్నా జ్వరంతో నాలుగు రోజులు పడుకుని ఉండటం మేలు అనుకుంటారు. అసలే జలుబుల కాలం.. దానికి తోడు అలర్జీలు.. సైనస్‌ సమస్య..!! జలుబుకే ఇంత ఏడుపా అనేవాళ్లకేం తెలుసు.. వాళ్లకెంత కష్టంగా ఉంటుందో! అలా దీర్ఘకాలం జలుబు సమస్యతో బాధపడుతున్న ఓ సైనస్‌ పేషెంట్‌ మనసులోని మాటలు…..

చలికాలం అని రకాల రొంప ల కి అనువైన కాలం… కాలాలన్నింటిలోనూ ఈ చలికాలం వచ్చిందంటేనే చిన్నప్పటినుండి ఏదో డిప్రెషన్ లా అనిపించేది. ముక్కు ఉంది చూశారూ…. బాబోయ్! చిన్నప్పుడు ఈ ముక్కుని తాత్కాలికంగా కోసి పక్కకు పెట్టి, జలుబు తగ్గిన తర్వాత అతకబెట్టుకోగలిగితే బాగుండు అనుకునేదాన్ని. నా ముక్కు మీద అంత కోపంలో నేనుంటే, ‘‘ముక్కే నీకు అందమే! అది లేకపోతే నీకు మొహం బాగుండదు’’ అని ఏడిపించే స్నేహితులూ, చుట్టాలు. ఇంకా బీపీ హై లెవెల్ లోకి వెళ్ళియిపోయేది… A mole on the nose అని సర్టిఫికెట్ లో చూసినప్పుడల్లా ‘ఇక్కడ కూడా నా ముక్కునే జ్ఞాపకం చెయ్యాలా’ అని కోపం వచ్చేది. నాకు ముక్కున్నదే ఈ దిక్కుమాలిన జలుబు వచ్చి హింసించడానికేమో అని ఫిక్స్ అయిపోయా. చిన్నప్పుడు స్కూల్ మానేస్తే క్లాస్ మిస్ అవుతానని ఎంత తీవ్రంగా జలుబు బాధపెట్టినా వెళ్లిపోయేదాన్ని కానీ మా టీచర్స్ నా జలుబు ముక్కు బాధ చూడలేక ఇంటికి పంపించే వారు. (చూడలేకనో!, వాళ్ళు భరించలేకనో! ) నాకు జలుబు అయిందంటే బీభత్సమేనని స్కూల్ అందరికీ తెలిసిపోయింది. నా మీద చిన్న చూపో, ఇంకేదో చూపో ఉన్నవాళ్లకు నా జలుబు అవస్థ నన్ను మాటలనడానికి ఒక ఆయుధంలా దొరికేది. ‘‘ఈ మాత్రం జలుబుకే అంత ఓవర్‌ యాక్షన్‌ చేస్తావేంటి! మాకు కాదా ఏంటి? మేము నీలాగా సీన్‌ క్రియేట్‌ చేస్తున్నామా…!’’ అనేవాళ్లు. ‘‘నీకు కూడా నాలాగా అయితే తెలిసుండేది. పోనీ.. మనిద్దరం ముక్కులు ఎక్స్‌ చేంజ్‌ చేసుకుందామా….?’’ అనేదాన్ని సీరియస్‌గా.


జలుబు లేదా కామన్‌ కోల్డ్ చిన్న సమస్యగా కనిపిస్తుంది. కానీ బాబోయ్! వచ్చిందంటే వదలదు. దీని కన్నా ఫీవర్ వచ్చింది నయం అనిపిస్తుంది… నిరంతరం ముక్కులోంచి వచ్చే జలపాతం.. దానికి 24 గంటలు సరిపోవు. దానికి తోడు ఈ పాడు సైనస్ వల్ల ముక్కు క్లీనింగ్ చేసినప్పుడల్లా పెద్ద పెద్ద శబ్దాలు. పక్కవాళ్లని భయపెట్టే పెద్ద తుమ్ములు.
‘‘ఇక్కడ బాంబు ఏమైనా పేలిందా?’’ అని నా సుపుత్రుడు.
వాడివంక కోపంగా చూసిన నాతో, ‘‘నువ్వు బాధగా ఉన్నవని జోక్ వేసా’’ అంటూ కిలకిలా నవ్వడం. నా ముక్కు కూడా వాడి సెన్సాఫ్‌ హ్యూమర్‌ కి ఒక సబ్జెక్ట్‌ అయిపోయిందన్నమాట.
హాస్టల్ లో ఉన్నప్పుడు నా ముక్కు బాధ ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో అని నేనే ఒకపక్క బిడియపడుతుండేదాన్ని. దీనికి తోడు నా పక్కన గదిలోని అమ్మాయి ఓరోజు నాతో, ‘‘కాస్త మెల్లగా క్లీన్ చేస్కోండి. నాకు డిస్ట్రబ్‌ గా ఉంది’’ అని మొదలుపెట్టి, పెద్ద గొడవే చేసింది. అదేంటి! నేనేమైన స్టైల్ కి సౌండ్ చేస్తున్నానా! ముక్కులోంచి శబ్దాలు పుట్టించడం నాకేమైనా హాబీనా!
‘‘నాకు ఉన్న ముక్కుకి ఇలాగే వస్తుంది. ఇదీ నా సమస్య’’ అని ఆమెకి ఎంత చెప్పినా అర్థం కాలేదు. ఆమె హాస్టల్‌ వార్డెన్ కి కంప్లైంట్ చేసింది. ఆ ఆంటీ నాతో చాలా అభిమానంగా ఉండేది. బహుశా గదిని శుభ్రంగా పెట్టుకుంటానని కాబోలు. ఎప్పుడూ ఈ విషయంలో మెచ్చుకుంటూ ఉండేది. సో.. గది శుభ్రంగా పెట్టుకునే నా అలవాటే ఇక్కడ నాకు హెల్ప్‌ అయింది. హాస్టల్‌ ఆంటీ ఆ అమ్మాయికే సర్ది చెప్పింది. కానీ ఆ అమ్మాయి గొడవ పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక, ‘‘నీకు డిస్ట్రబెన్స్ ఉంటే నువ్వు వేరే చోటికి వెళ్లు. ఇష్టం లేకుంటే హాస్టల్ వదలి వెళ్ళు’’ అంది. నాకు తెగ ఆశ్చర్యమేసింది. నాకోసం డబ్బులు పోగొట్టుకుంటుందే ఆంటీ అని, ఈ గొడవంతటికీ కారణమైన నా ముక్కు మీదే వేలేసుకున్నా.
పెళ్లయ్యాక కూడా ఈ ముక్కు తో పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు బాబోయ్. మా పక్కింటి అతను అన్నం తినేప్పుడే నేను ముక్కు క్లీనింగ్ కి వెళ్లేదాన్నట. దానికేమైనా టైమంటూ ఉంటుంది. అతను అన్నం తింటున్నాడా లేదా అని చూసి ముక్కు కారదు కదా! నా ముక్కుకి గానీ, నాకు గానీ అతని పైన కక్ష ఏముంటుంది! కానీ ఆ విషయం వాళ్లకేం అర్థమవుతుంది. ఇక వాళ్ళతోనూ గొడవ.
చిన్నప్పుడు ఏదో స్టోరీ విన్నట్టు గుర్తు. ఒక కాలంలో పేలు బాగా ఉన్నవాళ్లు తల తీసి ముందుకు పెట్టుకుని వాళ్ళ పేలు వాళ్ళే తీసి, తర్వాత తల ఎప్పటిలాగా పెట్టుకునేవాళ్లని. అలా ముక్కు కి కూడా ఇలాంటి సౌలభ్యం ఉంటే బాగుండు అనిపిస్తుంది. జ్వరం వచ్చినా నేను భయపడను. కానీ ఈ కోల్డ్, చలికాలం అంటేనే పారిపోతాను నేను. దానికి తోడు ఇక్కడ ఉత్తర భారతంలో సింగిల్‌ డిజిట్‌ టెంపరేచర్లు.
జలుబు చేస్తే ఒంట్లో బలం పోతుంది, మనిషి పీక్కుపోతారంటారు. అమ్మమ్మా.. ఆ ఛాన్స్ నాకు మాత్రం రాదు. ఎంత తీవ్రంగా బాధపెట్టే జలుబు అయినప్పటికీ బరువు మాత్రం తగ్గను. ఇంకా ఏమన్నా అంటే బరువు పెరుగుతుంది కూడాను.
ఈ ఇయర్ హెల్త్ రిజల్యూషన్ అని జిమ్ సైకిల్ తెచ్చుకున్నా. వ్యాయామం, యోగా, సైక్లింగ్‌ అన్నీ మొదలుపెడితే బరువు తగ్గుతానని ఆశ. కానీ అలా మొదలుపెట్టానో లేదో… ఇలా ఈ దిక్కుమాలిన జలుబు పట్టుకుంది. ఇక అన్నింటికీ బ్రేక్‌. ఇటు చలి ఉష్ణోగ్రత 4-6 డిగ్రీలు ఉన్నా శక్తిని కూడబలుక్కుని చేద్దామంటే ఇలా అయిపోయింది. అందుకే జలుబే కదా.. చిన్నదే అనుకుంటే.. ముక్కు పీకేస్తుంది! నా ఆల్‌ టైమ్‌ ఫ్రెండ్‌ ఎండాకాలం ఎప్పుడొస్తుందో.. నన్నీ చల్లగాలి, జలుబుల బారి నుంచి ఎప్పుడు కాపాడుతుందో!
ఇంతటితో నా ముక్కు బాగోతం సమాప్తం.

వేదశ్రుతి వెంకట్రామన్, ఇండోర్, మధ్యప్రదేశ్‌.

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *