వయసు మీద పడుతున్న కొద్దీ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తినలేరు. ఇష్టం కొద్దీ తిన్నా అరిగించుకోలేరు. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల పోషకాలు కూడా తగిన మొత్తంలో అందవు. అందుకే పెద్దవాళ్లకు ఆహారం విషయంలో ప్రత్యేక సూత్రాలను అందిస్తోంది ఆయుర్వేదం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్యవంతులు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నా.. రోగులు వ్యాధుల బారి నుంచి విముక్తం పొందాలన్నా ఆహారమే కీలకం. జీవితంలో అన్నిదశల్లోనూ అడుగడుగునా శక్తినిస్తూ.. మనల్ని వెన్నంటి నడిపించే ఈ ఆహారం గురించి ఆయుర్వేదం విపులంగా చర్చించింది. ఎలా తినాలి? ఎంత తినాలి? ఏయే వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనేవీ వివరించింది. ముఖ్యంగా వార్ధక్యంలో ఆహార నియమాల ప్రాముఖ్యతను మరింత ప్రధానంగా చెప్పింది. వయసు మీద పడుతున్నకొద్దీ మందగించే జఠరాగ్ని, జీర్ణక్రియలను పెంచుకోవటానికి మార్గాలనూ సూచించింది.
• కడుపు పూర్తిగా నిండేలా ఆహారం తీసుకోకూడదు. ఆయుర్వేదం జీర్ణాశయాన్ని 3 భాగాలుగా భావిస్తుంది. దీనిలో ఒక భాగం ఘన పదార్థాలు, ఒక భాగం ద్రవాలు ఉండేలా ఆహారం తీసుకోవాలని చెప్తుంది. ఇక మూడో భాగం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. కాస్త ఆలస్యంగా జీర్ణమయ్యే పదార్థాలైన నెయ్యి, నూనె, కొవ్వులతో కూడుకున్నవి తీసుకున్నప్పుడు ఈ నియమాన్ని పాటించాలి. అదే తేలికగా జీర్ణమయ్యే పదార్థాల విషయంలోనైతే జీర్ణాశయంలో సగభాగం వరకు ఆహారం తీసుకోవచ్చు.
• కొందరు అన్నం పూర్తిగా తిన్నాక ఒకేసారి నీళ్లు తాగుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. భోజనం చేసేటప్పుడు మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు తాగుతుండాలి. దీంతో ఆహారం మొత్తానికి నీరు సమంగా అందుతుంది. ఒకేసారి నీళ్లు తాగితే ఆహారం కిందే ఉంటుంది. నీరు పైకి తేలుతుంది. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాదు. మరీ వేగంగా గానీ మరీ ఆలస్యంగా గానీ భోజనం చేయరాదు. మరీ వేగంగా తింటే పొర పోయే అవకాశముంది. ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. అలాగే ఆలస్యంగా తిన్నా సరిగా జీర్ణం కాదు.
• ఒకప్పుడు భోజనం చేయటానికి ముందు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఐదు ముద్దలు తినేవారు. దీన్నే ఆజ్య సంస్కారం అంటారు. నెయ్యితో జఠరాగ్ని అంటే ఆకలి వృద్ధి చెందుతుంది. అన్నవాహిక మృదువుగా అయ్యి ముద్ద తేలికగా కిందికి దిగుతుంది. మనకు ఆకలి వేస్తోందంటే జీర్ణాశయంలో ఆహారమేమీ లేదని అర్థం. లోపల ఖాళీగా ఉన్నప్పుడు వాయువు ఉత్పన్నమవుతుంది. ఇది తీక్షణంగా ఉంటుంది. దీన్ని నెయ్యి మృదువుగా మారుస్తుంది. అంటే జీర్ణాశయం ఖాళీగా ఉన్న సమయంలో పుట్టుకొచ్చే వాత ప్రకోపం తగ్గటానికి నెయ్యి తోడ్పడుతుందన్నమాట. నెయ్యి కొంచెంగా తీసుకుంటే జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. అదే ఎక్కువగా తీసుకుంటే జఠరాగ్ని మందగిస్తుందని గుర్తుంచుకోవాలి.
• తింటూ టీవీ చూడడం మనలో చాలామందికి అలవాటే. అయితే భోజనం చేసేటప్పుడు దాని మీదే దృష్టి పెట్టాలి. మాట్లాడుకుంటూనో.. టీవీ, ఫోన్చూసుకుంటూనో.. మరో పని చేసుకుంటూనో తినటం మంచిది కాదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఇష్టమైనవారితో కలిసి భోజనం చేయటం మంచిది. వేడి వేడిగా ఉన్న ఆహారమే తినాలి. ఇది రుచికరంగా ఉండటమే కాదు, త్వరగానూ జీర్ణమవుతుంది. వేడి ఆహారం వాయువును బయటకు వెళ్లగొడుతుంది, కఫాన్ని కూడా తగ్గిస్తుంది.
• భోజనానికీ భోజనానికీ మధ్యలో కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. ఈ సమయంలో తిన్నది జీర్ణమవుతుంది. ఒకవేళ ముందు తిన్నది జీర్ణం కాకముందే మళ్లీ తిన్నారనుకోండి. సరిగా జీర్ణం కాని అన్నరసం కొత్త ఆహారంతో కలిసిపోయి దోషాలు పెరిగేలా చేస్తుంది. సమయానికి ఆకలి వేయటం, ఎలాంటి రుచి లేని త్రేన్పులు రావటం, ఒంట్లో ఉల్లాసం, మల విసర్జన సాఫీగా అవటం, దాహం వేయటం.. ఇవన్నీ ఆహారం సరిగా జీర్ణమవుతోందనటానికి సూచనలని గుర్తించాలి.