కడుపుబ్బరమా… అశ్రద్ధ వద్దు!

ఐబిడి కి డయెటరీ ట్రీట్‌ మెంట్‌

తినగానే కడుపుబ్బరం, మలబద్ధకం, డయేరియా… లాంటివి నార్మల్ కదా అనుకుంటాం. కానీ ఇన్‌ ఫ్లమేటరీ బొవెల్‌ డిసీస్ ఉన్నవాళ్లు ఇలాంటి సమస్యలతో నరకం చూస్తారు. ఈ చిన్న విషయాలే అశ్రద్ధ చేస్తే క్యాన్సర్ల దాకా పోవచ్చు. ప్రతి ఏటా మన దేశంలో 1.5 మిలియన్ మంది ఐబిడి తో బాధపడుతున్నారు. ఇటీవల హైద్రాబాద్ లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిర్వహించిన సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

25 సంవత్సరాల క్రితం పశ్చిమ దేశాల్లో కనిపించిన ఇన్‌ ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌ (ఐబిడి) ఇప్పుడు మన దేశంలో కూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం ఐబిడి బారిన పడుతున్న 1.5 మిలియన్ల మందిలో 20 శాతం పిల్లలే ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఐబిడి వల్ల పిల్లల శారీరక ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. తల్లిదండ్రులు మానసికంగా స్ట్రెస్‌ అవుతారు. అయితే ఇన్‌ ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌ కీ, మనం తీసుకునే ఆహారానికీ మధ్య సంబంధం ఉందనీ, ఆహారం దీనిపై ఏ రకంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఐబిడి పేషెంట్ల పైన ఏఐజీ హాస్పిటల్‌ ఒక సర్వే చేసింది. ఈ సర్వేకు సంబంధించిన వివరాలను ఐబిడి డే సందర్భంగా మే 19న మీడియాకి వివరించారు. ఇందులో సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ డి. నాగేశ్వర్‌ రెడ్డితో సహా, ఐబిడి సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రూపా బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు.

దక్షిణాది ఫుడ్‌ బెటర్‌

ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా ఐబిడి సపోర్ట్‌ ఫోరమ్‌ కి చెందిన 1455 మంది ఐబిడి పేషెంట్ల పైన ఈ సర్వే నిర్వహించారు. ఇది ఆన్‌ లైన్‌ ద్వారా నిర్వహించిన సర్వే. మార్చి 15 నుంచి మే 15 మధ్యలో జరిగింది. ఈ మూడు నెలల కాలంలో ఆయా పేషెంట్ల ఆహారపు అలవాట్లను అధ్యయనం చేశారు. రిఫైన్డ్‌ కార్బోహైడ్రేట్లు, బాగా ఫ్రై చేసిన పదార్థాలు, ఫైబర్‌ లేని ఆహారాన్ని తీసుకునేవాళ్లలో ఐబిడి ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఇందులో తేలింది. దక్షిణ భారతీయులు ఫర్మెంట్‌ చేసిన పిండితో చేసే ఇడ్లీ, దోస తీసుకోవడం, స్టీమ్‌ చేసిన ఫుడ్‌, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వీళ్లలో ఇన్‌ ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌ తక్కువగా ఉన్నది. అదే విధంగా తరచుగా బ్రేక్‌ ఫాస్ట్‌ లేదా భోజనాన్ని స్కిప్‌ చేసేవాళ్లు, బయటి తిండి ఎక్కువ తినేవాళ్లలో కూడా ఐబిడి పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. అయితే దక్షిణాది ఆహారానికి కూడా ఒక ప్రామాణికమైన పద్ధతి ఏర్పరుచుకోవడం అవసరమన్నారు డాక్టర్‌ డి. నాగేశ్వర్‌ రెడ్డి.

ఎమల్సిఫయర్స్‌, ప్రిజర్వేటివ్స్‌ అధికంగా ఉండే మయొనీస్‌, ఐస్‌ క్రీమ్స్‌, సాస్‌ ల వంటివి పొట్టలో ఉండే మంచి బాక్టీరియాపై దుష్ప్రభావం చూపి, పేగులను అల్లకల్లోలం చేస్తున్నాయి.”

– డాక్టర్‌ డి. నాగేశ్వర్‌ రెడ్డి.

ఎందుకిలా?

ఒకప్పుడు మన దేశంలో ఇన్‌ ఫెక్షన్లు ఎక్కువగా ఉండేవి. ఆధునిక చికిత్సలు, వాక్సిన్ల వల్ల వీటికి అడ్డుకట్ట వేశాం. అయితే అనాదిగా మనది సహజసిద్ధమైన జీవనశైలి. మన పిల్లలు మట్టిలో ఆడుకుంటారు. అందువల్ల చిన్నప్పటి నుంచి అనేక రకాల సూక్ష్మ జీవులకు ఎక్స్‌ పోజ్‌ అవుతారు. తద్వారా ఇమ్యూనిటీ బలంగా డెవలప్‌ అవుతుంది. ఇప్పుడు ఒకరకంగా చెప్పాలంటే మరీ ఎక్కువ పరిశుభ్రత అని, మట్టికి దూరమవడం కూడా ఇందుకు కారణమవుతున్నది. ఇప్పుడు జీవనశైలి మొత్తం మారిపోయింది. తినే ఫుడ్‌ పక్క దారి పట్టింది. ఎమల్సిఫయర్స్‌, ప్రిజర్వేటివ్స్‌ అధికంగా ఉండే మయొనీస్‌, ఐస్‌ క్రీమ్స్‌, సాస్‌ ల వంటివి పొట్టలో ఉండే మంచి బాక్టీరియాపై దుష్ప్రభావం చూపి, పేగులను అల్లకల్లోలం చేస్తున్నాయి. తల్లి పాల బదులు చేరిన పోతపాలు పిల్లల్లో స్వతహాగా పెరగాల్సిన ఇమ్యూనిటీని, గట్‌ బాక్టీరియాని తగ్గించేస్తున్నాయి. స్థూలకాయం దీనికి మరింత దోహదం చేస్తున్నది. మనం ఇంట్లో వండుకోవడం మరిచిపోయి, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వైపు పరుగులు తీస్తున్నాం. మన పొట్ట ఆరోగ్యానికి దోహదపడే సూక్ష్మజీవులు నిర్వీర్యం అయిపోతున్నాయి. వీటన్నింటి ఫలితమే… ఇన్‌ ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌.

‘‘మనం తినే ఆహారమే మన పొట్టలో ఉండే మంచి బాక్టీరియాను నిర్ణయిస్తాయి.”

– డాక్టర్‌ శశికిరణ్‌

తెలుపు కి నో చెప్పండి!

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ న్యూట్రిషన్‌ (ఎన్‌ ఐ ఎన్‌), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్‌) సంస్థల మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ శశికిరణ్‌ మాట్లాడుతూ, ‘‘మనం తినే ఆహారమే మన పొట్టలో ఉండే మంచి బాక్టీరియాను నిర్ణయిస్తాయని’’ అన్నారు.
సాధారణ గోధుమ పిండి కూడా ఒక రకమైన ప్రాసెస్ చేసిన ఆహారమే. కానీ ఇది అంత హానికరం కాదు. మరీ ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన (అల్ట్రా ప్రాసెస్డ్‌) ఫుడ్‌ వల్లనే ఎక్కువ నష్టం కలుగుతుందన్నారాయన. ఫ్యాక్టరీల్లో తయారు చేసిన రొట్టెలు, చిప్స్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తుల వంటివి గట్‌ హెల్త్‌ కి గొడ్డలిపెట్టు. మైదా, చక్కెర, ఉప్పు వంటి తెల్లని ఉత్పత్తులను నివారించడం ఉత్తమ మార్గం. ప్రాసెస్‌ చేయని గోధుమ పిండి, పచ్చి చెరకు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే మార్గం అని సూచించారు డాక్టర్‌ శశికిరణ్‌.

ఐబిడి పేషెంట్ల కోసం, జనరల్‌ గట్‌ హెల్త్‌ కోసం డయెటరీ థెరపీ రెసిపీల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ డి. నాగేశ్వర్‌ రెడ్డి, డాక్టర్‌ శశి కిరణ్‌, డాక్టర్‌ రూపా బెనర్జీ

ఆహార చికిత్స

క్రానిక్‌ ఐబిడి పేషెంట్లకు ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్స బయలాజికల్‌ డ్రగ్స్‌. ఇవి చాలా ఖరీదైనవి. ఖర్చు లేకుండా మైక్రో బయోమ్‌ ఆధారిత డయెటరీ థెరపీ ద్వారా పొట్ట ఆరోగ్యాన్ని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఇన్‌ ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌ నుంచి బయటపడేసే తారక మంత్రం ఈ ప్రత్యేకమైన డయెటరీ థెరపీనే. మన దక్షిణాది ఆహారంలో కూడా ప్రామాణికమైన ఆహార పద్ధతి అంటూ లేదు. కాబట్టి ఒక ప్రామాణికమైన ఆహారాలను రుచికరంగా మార్చడం అవసరం. ఏఐజీ ఆధ్వర్యంలో రుచికరంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలతో రూపొందించిన బుక్‌ లెట్‌ ను విడుదల చేశారు. ఐబిడి ఉన్న వాళ్లకు ఇందులోని రెసిపీలు డయెటరీ థెరపీ (ఆహార చికిత్స)గా ఉపయోగపడుతాయి.

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *