కొవిడ్ భయం వచ్చినప్పటి నుంచి ముందుజాగ్రత్తగా విటమిన్ సప్లిమెంట్ల వెంట పడ్డారు చాలామంది. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ లాంటి సప్లిమెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయని ఇష్టానుసారంగా వేసుకుంటున్నారు. కానీ, వీటిని డాక్టర్ల సూచనలు లేకుండా వాడవద్దంటున్నారు వైద్యులు.
నాలుగు పదుల్లో అడుగుపెట్టారో లేదో.. ఇక విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుందని అనుకుంటుంటారు. అయితే సరైన ఆహారం తీసుకుంటుంటే మల్టీవిటమిన్ టాబ్లెట్లు తీసుకునే అవసరం లేదు. ప్రెగ్నెంట్ అయితేనో, డాక్టర్ సూచిస్తేనో తప్ప ప్రత్యేకంగా సొంతంగా మల్టీవిటమిన్లు వాడొద్దు. నిజానికి వీటి మోతాదు ఎక్కువైతే కూడా నష్టమే. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, గింజలు తీసుకుంటుంటే శరీరానికి సరిపడా విటమిన్లు లభిస్తాయి. కాబట్టి ప్రత్యేకించి సప్లిమెంట్లు వాడాల్సిన పనిలేదు. గర్భిణుల్లో కూడా పుట్టబోయే బిడ్డలో లోపాలు లేకుండా ఉండడం కోసం ఫోలిక్ ఆమ్లం లాంటి సప్లిమెంట్లు ఇస్తారు. అంతేగానీ సొంతంగా విటమిన్ టాబ్లెట్లు, మినరల్ సప్లిమెంట్లు తెచ్చుకుని వాడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇమ్యూనిటీ పెంచుతాయన్న నమ్మకంతో విటమిన్ డి సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి మాటేమో గానీ విటమిన్ డి టాక్సిసిటీ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. కాల్షియం, ఐరన్ సప్లిమెంట్లు కూడా అవసరానికి మించి వాడవద్దు. విటమిన్ సి సాధారణంగా మన ఆహారం ద్వారా లభ్యమయ్యేదే సరిపోతుంది. ఏది ఏమైనా సప్లిమెంట్లు వాడదలచుకుంటే డాక్టర్ సలహా తప్పనిసరి.