గుండెజబ్బుంటే వాక్సిన్‌ మానేయాలా?

లాక్ డౌన్ ఆగింది. కానీ కరోనా పోలేదు. కేసులు తగ్గాయని ఇక వాక్సిన్ ఎందుకులే అనుకుంటారు కొందరు.. నాకు బీపీ ఉంది.. టీకా తీసుకోవచ్చో లేదో.. అంటూ అనుమానం ఒకరిది. గుండెజబ్బుకు వాడుతున్న మందులు వేసుకోవచ్చా లేదా అన్న గందరగోళం మరొకరిది. నిజం ఏంటి ?

కొవిడ్‌కి వాక్సిన్‌ వచ్చి ఇంతకాలం అయినా, దీనిపై ఇప్పటికీ అనేక భయాలున్నాయి. వాక్సిన్‌ వేసుకుంటే కొవిడ్‌ వచ్చేస్తుందనీ, సైడ్‌ ఎఫెక్టులు తీవ్రంగా ఉంటాయనీ… ఇలా అనేక భయాలతో వాక్సిన్‌ వేయించుకోవడానికి జంకుతున్నారు. కానీ వాక్సిన్‌ వల్ల పూర్తి స్థాయిలో కొవిడ్‌ నివారించలేకపోయినా 80 శాతం వరకు దాని బారి నుంచి తప్పించుకోవచ్చని రుజువులున్నాయి. ఇప్పటికే రెండు కోట్ల మంది వాక్సిన్‌ తీసుకున్నారు. అయినప్పటికీ చాలామందికి ఇంకా అనేక భయాలున్నాయి. అపోహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా ఇతర జబ్బులున్నవాళ్ల సంగతేంటి.. తాము వాడుతున్న మందుల ప్రభావం వాక్సిన్‌పై ఉంటుందేమో, మందులు మానేయాలేమో.. ఇలాంటి అనుమానాలతో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.


గుండెజబ్బు ఉన్నవాళ్లు కొవిడ్‌ టీకా వేసుకోవాలా.. వద్దా? వాక్సిన్‌ వేసుకునేముందు టాబ్లెట్లు మానేయాలా…?


వయసు పైబడినవాళ్లు అందరూ తప్పనిసరిగా వాక్సిన్‌ తీసుకోవాలి. 45 ఏళ్లు పైబడినవాళ్లు, బీపీ, షుగర్‌, గుండెజబ్బులున్నవాళ్లకు కొవిడ్‌ వల్ల కలిగే ప్రాణాపాయం మరింత ఎక్కువ. అందుకే ఇలాంటి సమస్యలుంటే వాక్సిన్‌ తీసుకోవడం అస్సలు ఆలస్యం చేయవద్దు.

ఇవి మానవద్దు

వాక్సిన్‌ తీసుకునేముందు గానీ, తరువాత గానీ ఎవ్వరూ కూడా యాంటీప్లేట్‌లెట్‌ డ్రగ్స్‌, యాస్పిరిన్‌, ట్రోపోనిల్‌ లాంటి మందులు అస్సలు మానకూడదు. ముఖ్యంగా స్టెంట్స్‌ వేయించుకున్నవాళ్లు, గుండెకు సర్జరీ అయినవాళ్లు వీటిని మానితే చాలా ప్రమాదం. కొవిడ్‌ ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది.

ఇవి మానాలి

కొందరిలో బ్లడ్‌ క్లాటింగ్‌ తగ్గడానికి ఇచ్చే మందులైన యాంటీ థ్రాంబోటిక్‌ మందులు మానవలసి వస్తుంది. అవి వార్ఫ్‌, అసిట్రోమ్‌, కొత్తగా వచ్చిన నొవాక్సిన్‌, ఎపిక్జబాన్‌, డాబిగట్రాన్‌, డివొరాక్సబాన్‌ అనే ఈ అయిదు మందులు. అయితే వీటిని కూడా సొంత నిర్ణయంతో మానకూడదు. డాక్టర్‌ సూచించినట్టు చేయాలి. వాక్సిన్‌ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మీకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ను సంప్రదించి, ఏవి మానేయమంటారో కనుక్కుని మానేసి, ఆ తరువాత వాక్సిన్‌ వేయించుకోవాలి.

భయం వద్దు.. జాగ్రత్త ముద్దు

వాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్టులు వస్తాయని భయం అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వాక్సిన్లన్నీ 80 శాతం సమర్థవంతమైనవి. వాక్సిన్‌ తీసుకున్న తరువాత కూడా సామాజిక దూరం, మాస్కు వేసుకోవడం పాటించాలి.

డాక్టర్‌ ఎ. శ్రీనివాస్‌ కుమార్‌
సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌
డైరెక్టర్‌, కార్డియాలజీ అండ్‌ క్లినికల్‌ అండ్‌ రీసెర్చ్ సెంటర్‌
అపోలో హాస్పిటల్స్‌
హైదరాబాద్‌

Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *