అసలే చలికాలం అలర్జీలు, ఇన్ఫెక్షన్ లు ఎక్కువ. ఇప్పుడు కొవిడ్ భయం కూడా తోడయింది. మరి దగ్గు విషయంలో ఎప్పుడు భయపడాలి?
శరీరంలోని అసంకల్పిత ప్రతీకార చర్యల్లో ఒకటి దగ్గు. నిజానికి ఇదొక సమస్య కాదు. ఊపిరితిత్తుల్లోకి హానికర పదార్థాలు వెళ్లనీయకుండా అడ్డుకునే రక్షణ చర్య. చిన్న చిన్న రేణువుల దగ్గరి నుంచి సూక్ష్మ క్రిముల దాకా ఏవైనా సరే ఊపిరితిత్తుల్లోకి వెళ్లబోతుంటే వాటిని బలంగా బయటకు నెట్టేసే క్రమంలో మనకు దగ్గు వస్తుంది. మన శ్వాస వ్యవస్థలో తయారయ్యే తెమడ, స్రావాల వంటివాటన్నింటినీ బయటకు పంపేందుకు కూడా సాయపడుతుంది దగ్గు.
కాబట్టి దగ్గు మంచిదే. కాకపోతే అది రోజుల తరబడి వేధిస్తుంటేనే మనకు అందోళన మొదలవుతుంది. ఉన్నట్టుండి మొదలై, కొద్దిసేపు దగ్గు వస్తే పొలమారిందా? గాలి గొట్టంలోకి ఏదైనా జొరబడిందా? అని ఆలోచిస్తాం. అలాగే ఒకటి, రెండు రోజులుగా బాధిస్తుంటే జలుబు, ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్ల వంటివేమైనా ఉన్నాయేమో అనుకోవచ్చు. కానీ రోజులు, వారాల తరబడి దగ్గు వస్తుంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎందుకంటే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుంచి.. నయం చెయ్యటానికి వీలైన రుగ్మతల వరకూ.. చాలా సమస్యల్లో కనబడే లక్షణం ఈ దగ్గు. ఇది విడవకుండా వస్తుంటే.. కచ్చితంగా కారణాలేమిటో తరచి చూసి, చికిత్స తీసుకోవటం అవసరం.
దగ్గు ఎలా వస్తుంది?
మన గొంతు, శ్వాస నాళాల్లో అక్కడక్కడ ఉండే ‘దగ్గు గ్రాహకాలు’ చికాకుకు గురవటమే దగ్గుకు కారణం. దుమ్ము ధూళి, అలర్జీ కారకాలు, పొగ, రంగుల వాసనలు, చల్లగాలి వంటివి లోనికి వెళ్లినపుడు ఈ గ్రాహకాలు వాటిని గుర్తించి.. ఆ సమాచారాన్ని నాడుల ద్వారా మెదడుకు పంపిస్తాయి. మెదడులోని ‘మెడుల్లా అబ్లాంగేటా’లో దగ్గును నియంత్రించే ప్రత్యేక కేంద్రం ఉంటుంది. అది వెంటనే దగ్గు ప్రక్రియకు ఆదేశాలు పంపిస్తుంది. దాంతో మనం దగ్గుతాం.
దగ్గు – కారణాలు
ఈ దగ్గు గ్రాహకాలు గొంతు, శ్వాస నాళాల్లోనే కాదు.. మన చెవిలో, అన్నవాహికలో, జీర్ణాశయంలో, ఊపిరితిత్తుల పైపొరలో, అలాగే గుండె చుట్టూ ఉండే పొరలో కూడా ఉంటాయి. అందుకే కొందరికి చెవిలో గుబిలి పేరుకున్నా.. అక్కడి గ్రాహకాలు చికాకుపడి, దగ్గు మొదలవుతుంది. అలాగే పొట్టలోని ఆమ్లం పైకి, అంటే అన్నవాహికలోకి ఎగదన్నుకొచ్చినా దగ్గు మొదలవుతుంది. అలాగే ఈ కేంద్రాలుండే చోట కణుతుల వంటివి పెరిగినా దగ్గు మొదలవుతుంది. ఇలా ఎన్నో అంశాలు దగ్గును ప్రేరేపిస్తాయి కాబట్టి ఇది దీర్ఘకాలంగా వేధిస్తున్నప్పుడు లోతుగా చూడటం చాలా అవసరం. ఒకటి రెండు వారాల పాటు దగ్గు ఉంటే బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాస వ్యవస్థలో తలెత్తే సమస్యలు ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు. దగ్గు 8 వారాలకు మించి వేధిస్తుంటే మాత్రం దాన్ని దీర్ఘకాలిక దగ్గుగా.. ‘క్రానిక్ కాఫ్’గా గుర్తిస్తారు. ఇప్పుడు దగ్గు అనగానే కొవిడ్ వచ్చిందేమో అని భయం వేస్తుంది.
జ్వరంతో పాటు, జలుబు, దగ్గు, ఆయాసం ఉంటే మాత్రం కొవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
మానసిక వేదనతో దగ్గు
శ్వాస వ్యవస్థలో ఎక్కడన్నా క్యాన్సర్ కణుతులు పెరుగుతుంటే దగ్గు వీడకుండా వేధించొచ్చు. అలాగే గుండె వైఫల్యం బాధితుల్లో వూపిరితిత్తుల్లో నీరు చేరి, దగ్గు వీడకుండా బాధించొచ్చు. * మన దేశంలో ఎవరికైనా గానీ దీర్ఘకాలం దగ్గు వేధిస్తోందంటే తప్పనిసరిగా అనుమానించాల్సింది క్షయ. * కొందరిలో ఇన్‌ఫెక్షన్లు, ఇతరత్రా ప్రత్యేక సమస్యలేమీ లేకుండా కేవలం మానసికపరమైన కారణాల వల్లనే (హిస్టీరికల్) దగ్గు వేధిస్తుంటుంది. కుటుంబ సమస్యలు, బాల్యంలో మానసిక వేదన వంటివన్నీ దగ్గు రూపంలో బయటపడుతుండొచ్చు. దీన్ని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే వీరిలో దగ్గు తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
సైనస్ కూడా కారణమే
దీర్ఘకాలిక దగ్గుకు ప్రధానంగా మరో మూడు కారణాలు కూడా ఉంటాయి. వాటిలో ఒకటి సైనస్. చాలామందికి ముక్కులోనూ, సైనస్ గదుల్లోనూ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వంటివి సమస్యలుంటాయి. వీటివల్ల పల్చటి స్రావాలు, కఫం వంటివి తయారవుతుంటాయి. ఇవి ముందుకు కారిపోతే.. మనకు ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తాయి. కానీ కొందరిలో ఈ స్రావాలు ముందు నుంచి కాకుండా.. ముక్కు వెనకాల భాగం నుంచి బొట్లుబొట్లుగా గొంతులోకి జారి పడుతుంటాయి. దీన్నే ‘పోస్ట్ నేసల్ డ్రిప్’ అంటారు. ఇలా బొట్లుబొట్లుగా పడుతున్న స్రావాలకు గొంతులో చికాకు మొదలవుతుంది. ఇది దగ్గుకు దారి తీస్తుంది. ఈ సమస్య వారాల తరబడి కొనసాగుతూ… ఇది దీర్ఘకాలిక దగ్గుకు ముఖ్యకారణంగా పరిణమిస్తుంది.
పోస్ట్ నేసల్ డ్రిప్ కి ఆవిరి పట్టటం, వైద్యుల సలహాతో అలర్జీ చికిత్స, అవసరమైతే యాంటీబయాటిక్స్ తీసుకోవటం వంటివి చేస్తే ఈ సమస్య తగ్గుతుంది, దగ్గూ పోతుంది!
దగ్గు – పరిష్కారాలు
దీర్ఘకాలం దగ్గు వేధిస్తున్నప్పుడు సొంతవైద్యం పనికిరాదు. సిగరెట్ల అలవాటుంటే మానేయాలి. దగ్గును అశ్రద్ధ చేస్తే మరిన్ని సమస్యలు రావొచ్చు. అందుకే వెంటనే డాక్టర్ ను కలవాలి. వారాల తరబడి దగ్గు వేధిస్తుంటే ఏ మెడికల్ షాప్ నుంచి తెచ్చిన మందుల పైనో ఆధారపడకుండా వెంటనే డాక్టర్ ని కలవాలి.
జలుబైందంటే ఏ యాంటిబయాటిక్కో, దగ్గు వచ్చిందంటే ఏ దగ్గుమందో మెడికల్ షాప్ నుంచి తెచ్చుకుని వాడటం చాలామందికి అలవాటే. కాని ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దగ్గులో పొడి దగ్గు, కళ్లెతో కూడిన దగ్గు.. రెండూ ఉండొచ్చు. ఈ తేడా గుర్తించటం చాలా అవసరం. ఒక రకమైన దగ్గుకి ఇంకో రకమైన మందు వాడితే సమస్య తగ్గడం మాట అటుంచి మరింత ఎక్కువ అవుతుంది.
దగ్గు మందుల్లో- లోపలి కఫాన్ని బయటకు తీసేవి (ఎక్స్‌పెక్టొరెంట్), దగ్గు రాకుండా బలవంతాన ఆపేసేవి (సప్రసెంట్) అని రెండు రకాలుంటాయి. కళ్లె, తెమడ వస్తున్నవాళ్లు వాటిని బయటకు తీసేవి తాగితే మంచిదే. కానీ తెలిసీ తెలియక వాళ్లు.. సప్రెసెంట్ మందులు తాగితే.. దగ్గు ఆగిపోయినా, లోపలి స్రావాలు లోపలే పేరుకుని, జబ్బు ఇంకా తీవ్రతరమవుతుంది. కాబట్టి- డాక్టర్ సలహా లేకుండా దగ్గు మందులు తాగకూడదు.
దీర్ఘకాలం దగ్గు వేధిస్తుంటే వైద్యులు అది ఎప్పటి నుంచీ బాధిస్తోంది? కళ్లె పడుతోందా? ఇతరత్రా బాధలేమున్నాయి? మందులేమన్నా వాడుతున్నారా? వంటివన్నీ పరిశీలిస్తారు. ఛాతీ ఎక్స్‌రే, సైనస్‌ల ఎక్స్‌రేలు, స్పైరోమెట్రీ, రక్తపరీక్షల వంటివి చేయిస్తారు. కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు.
సాధారణ దగ్గుకు దగ్గుమందు, మందుల తో తగ్గిపోతుంది. దీర్ఘకాలిక దగ్గుకు యాంటిబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. టిబి ఉంటే తదనుగుణమైన చికిత్స ఇస్తారు. వీరికి తెమడ పరీక్షలు చేయించటం తప్పనిసరి. ఇన్ ఫెక్షన్లకు యాంటిబయాటిక్స్, యాంటి వైరల్ మందులు ఇస్తారు. వీడని దగ్గుకు పొగ ఒక ముఖ్యకారణం. పొగ తాగే అలవాటుంటే దాన్ని తక్షణం మానెయ్యటం మంచిది.
దగ్గు వచ్చిన తరువాత దానికి చికిత్స తీసుకోవడం ఒక ఎత్తయితే.. ఆ దగ్గు ఇతరులకు స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం మరో ఎత్తు. దగ్గినప్పుడు నోటి నుంచి గాలి.. సాధారణం కంటే 80 రెట్లు అధిక పీడనంతో వెలువడుతుంది. ఆ తుంపర్ల వంటివన్నీ 6 మీటర్ల వరకూ కూడా విస్తరిస్తాయి! అందుకే దగ్గేప్పుడు నోటికి గుడ్డ అడ్డం తప్పనిసరిగా పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకుంటే సాధారణ ఇన్ఫెక్షన్ లనే కాకుండా కొవిడ్ ను కూడా అడ్డుకోవచ్చు.