ఇక బైపాస్ సర్జరీ అవసరం లేదు !

ఛాతీ కోసి గుండెకు ఆపరేషన్ చేస్తే మనిషి ఆత్మ బయటికి వెళ్లిపోతుందట.. జపాన్ వాళ్ళ ఈ నమ్మకమే చాలావరకు గుండె సర్జరీ లకు ప్రత్యామ్నాయాలను కనుక్కుంది. కొన్నేళ్ళ క్రితమే ఈ చికిత్స అపోలో హాస్పిటల్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. బైపాస్ అవసరం లేని అలాంటి చికిత్స గురించి చెప్తున్నారు అపోలో కార్డియాలజిస్ట్ డాక్టర్ పి. సి. రథ్.

ఆపరేషన్ అంటే భయపడని వాళ్ళు ఉండరు. ఇక గుండెకు సర్జరీ అంటే మరింత భయమే. స్టెంట్స్ అందుబాటులోకి వచ్చాక సర్జరీ అవసరం తగ్గింది. కానీ కొందరికి ఇంకా సర్జరీ మాత్రమే చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇలాంటి వాళ్ళకు జపాన్ చికిత్స మంచి ఫలితాన్ని ఇస్తున్నది.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో రక్త సరఫరాకు అంతరాయం కలిగితే గుండెపోటు వస్తుందని మనకు తెలిసిందే. సాధారణ ఆరోగ్యవంతుల కన్నా బీపీ, డయాబెటిస్ వంటి జబ్బులు ఉన్నవాళ్లకు గుండెపోట్లు వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వీళ్లలో నెమ్మదిగా రక్తనాళాలు బ్లాక్ అయ్యేందుకు ఆస్కారం ఎక్కువ. క్రమంగా అవి పూర్తిగా పూడుకు పోతాయి. అయితే రక్తనాళాలు పూర్తిగా వందశాతం పూడుకు పోతే చికిత్స చేయడం కొంచెం కష్టమైన విషయమే.

చాప కింద నీరులా..

సాధారణంగా 70 శాతం బ్లాక్ ఉన్నా హార్ట్ ఎటాక్ వస్తుంది. కానీ కొంతమందిలో చాలా నెమ్మదిగా బ్లాక్ అవుతూ వంద శాతం బ్లాక్ అయ్యేదాకా గుండెపోటు రాదు. వీళ్ళకు నడిస్తే ఆయాసం, ఛాతీలో నొప్పి వస్తుంది. కానీ చాలామంది దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అది క్రమంగా క్రానిక్ టోటల్ అక్లూజన్ గా మారుతుంది. అలా మొత్తం ధమని బ్లాక్ అయిపోయి, రక్త ప్రసరణకు పూర్తి ఆటంకం కలుగుతుంది. 5 శాతం వాళ్ళలో ఇలా ధమనులు పూర్తిగా బ్లాక్ అయిపోతాయి. ఇలాంటప్పుడు బైపాస్ సర్జరీ చేస్తుంటారు.

నమ్మకం నుంచి పుట్టిన చికిత్స

అయితే ఈ పరిస్థితిలో కూడా సర్జరీ లేకుండా ఆంజియోప్లాస్టి ద్వారా స్టెంట్ అమర్చడం సాధ్యం అవుతుంది. కానీ ఇందుకోసం చాలా అనుభవం, చాకచక్యం కావాలి. కొన్ని కొత్త మెడికల్ డివైస్ లు కావాలి. ఇందులో జపాన్ వాళ్ళు ముందుండటానికి కారణం వాళ్ళ నమ్మకాలే అంటే అతిశయోక్తి కాదు. సర్జరీ కోసం ఛాతీ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి ఆత్మ బయటికి వెళ్లిపోతుందని జపాన్ వాళ్ళ నమ్మకం. అందువల్ల సాధ్యమైనంత వరకూ సర్జరీ జోలికి వెళ్లరు. అందుకే సర్జరీ కి బదులుగా ఇంటర్వెన్షన్ లను ప్రాక్టీస్ చేస్తారు. అందుకే వాళ్ళకు మనకన్నా అనుభవం ఎక్కువ. వాళ్ళ టెక్నాలజీ అడ్వాన్స్డ్ గా ఉంటుంది.

జపాన్ తో దీటుగా..

కరోనరి ధమనులు పూర్తిగా బ్లాక్ అయినప్పుడు సర్జరీ ని అవాయిడ్ చేయడానికి చేసే ఈ చికిత్సను ఆంజియోప్లాస్టి ఫర్ టోటల్లీ బ్లాక్డ్ ఆర్టెరి అంటారు. సాధారణంగా రక్తనాళాలు పూర్తిగా బ్లాక్ అయినప్పుడు 60 నుంచి 70 శాతం కేసులు ఓపెన్ సర్జరీ నే చేస్తున్నాం. ఈ సర్జరీ ద్వారా మన దగ్గర కొన్ని కేస్ లు మాత్రమే చేస్తున్నాం. జపాన్ వాళ్ళు మాత్రం 90 నుంచి 100 శాతం ఆంజియోప్లాస్టి నే చేస్తున్నారు. వాళ్ళకు 90 నుంచి వంద శాతం సక్సెస్ రేట్ ఉంటే మనజీ 70 శాతం మాత్రమే ఉంటున్నది.

సర్జరీ బదులు స్టెంటింగ్ .. ఇలా సాధ్యం

ఇలా రక్త నాళాలు పూర్తిగా బ్లాక్ అయినప్పుడు రక్తనాళం లోకి బెలూన్, వైర్ పంపించడం కూడా కష్టం కావొచ్చు. అందుకే రెండు మూడేళ్ళ క్రితం ఆధునిక వైర్ లను తీసుకొచ్చారు. వీటి సాయంతో స్టెంట్ ను పంపించడం సులువు అయింది. మైక్రో కెథటర్, స్టెంటింగ్ కోసం వాడే పరికరాలను పంపించే వైర్ లు వేరుగా ఉంటాయి. స్టెంట్స్ మాత్రం అవే అయినప్పటికీ వాటిని పంపించడానికి వాడే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆధునికమైనవి కావడం వల్ల 90 నుంచి వంద శాతం మంచి ఫలితాలను సర్జరీ లేకుండానే పొందవచ్చు.

డాక్టర్ పి.సి. రథ్
హెడ్, కార్డియాలజీ విభాగం
అపోలో హాస్పిటల్
హైదరాబాద్
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *