ఆస్తమా – అపోహలు

ఆస్తమా వ్యాధి గురించి ప్రత్యేకించి దాని కోసం వాడే ఇన్ హేలర్ల దాకా ఎన్నో నమ్మకాలు, భయాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు అన్నీ అనవసర భయాలే తప్ప నిజాలు కావు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అపోహ : ఆస్తమాకు వాడే ఇన్ హేలర్లు అలవాటు అవుతాయా? 

నిజం : ’ఇన్హేలర్లు కాదు.. అలవాటయింది.. స్వేచ్ఛగా జీవించడం, గొప్పగా కలలు కనడం‘ అంటుంది ఆస్తమా అంబాసిడర్ ప్రియంకా చోప్రా. నిజానికి ఇన్ హేలర్లు వాడడం చెడ్డ అలవాటు కాదు. వాటిని వాడే అలవాటు ఉంటేనే ఆస్తమా రోగులు హ్యాపీగా ఉంటారు.

అపోహ : ఆస్తమా అంటువ్యాధా?

నిజం : అసలు అంటువ్యాధులు వస్తే జాగ్రత్తలు తీసుకోరు గానీ లేని పోని అపోహలతో ఆస్తమా పేషెంట్లను చులకన చేయడం కరెక్ట్ కాదు. ఆస్తమా అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి అంటుకోదు. దూరంగా ఉండాల్సింది ఆస్తమా రోగులకు కాదు.. ఆస్తమా కలిగించే పదార్థాలకు.

అపోహ : రోజులు, నెలల వయసు పసిబిడ్డలకు ఆస్తమా వస్తుందా?

నిజం : మరీ చంటి బిడ్డ.. ఆస్తమా లాంటి జబ్బు ఎలా వస్తుంది? అని అనుకోవద్దు. ఆస్తమా ఏ వయసులో వారికైనా రావొచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా రావొచ్చు.

అపోహ : కుటుంబంలో ఎవరికీ లేకపోతే ఆస్తమా రాదు అనడంలో నిజం ఉందా?

నిజం : ఇలాంటి జబ్బు మా ఇంటా వంటా లేదు.. మా వాడికి ఎలా వస్తుందండీ…? అంటుంటారు. అయితే ఆస్తమా వంశపారంపర్య వ్యాధి. అయితే జన్యువులే కాకుండా వాతావరణంలోని మార్పులు, వాతావరణ కాలుష్యం కూడా ఆస్తమా రావడానికి కారణం అవుతుంది.

అపోహ : వ్యాధి మరీ ముదిరిపోతేనే ఇన్ హేలర్ ఇస్తారా?

నిజం : ఆస్తమాకు దీర్ఘకాలం వాడాల్సింది ఇన్ హేలర్ మాత్రమే. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ నాలుగైదు రోజులు వాడడానికి మాత్రమే టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇస్తారు. ఆస్తమా మొదలైనప్పటి నుంచి రెగ్యులర్ గా వాడాల్సింది మాత్రం ఇన్ హేలర్లే.

అపోహ : గర్భిణులకు ఆస్తమా ఉంటే మందులు వాడొద్దా?

నిజం : గర్భిణి అనగానే ఏ మందులైనా చేటు చేస్తాయనుకుంటారు. కాని ఆస్తమా మందులు మాత్రమే వాడకపోతేనే ప్రమాదం. బిడ్డలో ఎదుగుదల తగ్గుతుంది. ఇన్ హేలర్లలో స్టిరాయిడ్స్ ఉంటాయి కదా అని భయపడుతారు. కాని స్టిరాయిడ్స్ ని టాబ్లెట్ రూపంలో తీసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఉంటాయే గానీ ఇన్ హేలర్ రూపంలో తీసుకుంటే ఏ సమస్యా ఉండదు.

అపోహ : ఆస్తమా ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదా?

నిజం : ఎటువంటి సంకోచం లేకుండా పాలివ్వొచ్చు. నిజానికి పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఆస్తమా వచ్చే రిస్కు తగ్గించవచ్చు.

డాక్టర్ శుభాకర్
ఛాతీ, శ్వాసకోశ వైద్య నిపుణులు
హైదరాబాద్
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *