అప్పుడప్పుడు ఆరోగ్య సమస్య రావడం వేరు. కాని కొన్నిసార్లు కొందరికి పదే పదే ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతుంటుంది. ఇది సీరియస్ గా ఆలోచించదగిన విషయమే. మీరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారనడానికి ఇది సంకేతం కావొచ్చు. ఒత్తిడి అనేది చాలా సందర్భాల్లో సైకోసొమాటిక్ వ్యాధులుగా వ్యక్తమవుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నారని హెచ్చరించే అలాంటి సమస్యలేంటో చూద్దామా..
చర్మ సమస్యలు
ఒత్తిడి ప్రభావం చర్మం మీద డైరెక్ట్ గా ఉంటుంది. ఒత్తిడి చర్మ సమస్యలుగా బయటకు కనిపిస్తుంది. సొరియాసిస్, మొటిమల వంటి చర్మ సమస్యలు ఒత్తిడి వల్లనే స్టిమ్యులేట్ అవుతాయి. ఈ విషయం అనేక స్టడీస్ లో తేలింది. ఎలుకలపై చేసిన రీసెర్చ్ లో కూడా ఇదే రకమైన రిజల్ట్ కనిపించింది. చదువు ఒత్తిడితో బాధపడుతున్న స్టూడెంట్స్ పై చేసిన స్టడీ ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నది. అందుకే ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యేవాళ్లు చర్మ సంబంధ ఇన్ ఫెక్షన్లకు గురయ్యేందుకు ఆస్కారం ఉందంటున్నారు పరిశోధకులు.
బరువులో హెచ్చు తగ్గులు
మీరు ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారా? లేక తగ్గుతున్నారా? హఠాత్తుగా బరువులో వస్తున్న మార్పులకు ఇతర కారణం ఏదీ లేదా? శారీరకంగా ఎన్ని ఎక్సర్ సైజ్ లు చేసినా ఫలితం లేదా? అయితే అందుకు కారణం మీరు ఒత్తిడితో బాధపడుతుండడమే అంటున్నారు నిపుణులు. పదే పదే విపరీతమైన ఒత్తిడికి గురవడం వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ హార్మోను మనం తీసుకున్న ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ ను సక్రమంగా జరిగేట్టుగా స్థిరపరుస్తుంది. రక్తంలో అవసరమైనంత మేరకు చక్కెర విడుదల కావడానికి దోహదపడుతుంది. కాని ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తవుతుంది. తద్వారా ఎక్కువగా తినేస్తుంటారు. శరీరం అతి తక్కువ కేలరీలను వినియోగించుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. ఒత్తిడి, ఆందోళన వల్ల కొంతమంది విపరీతంగా బరువు తగ్గిపోతుంటారు కూడా. రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. అడ్రినలిన్ మెటబాలిక్ చర్యలను వేగవంతం చేస్తుంది. అందువల్ల బరువు తగ్గిపోతారు.
స్ట్రెస్ వల్ల పెరిగే కార్టిసాల్ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అయితే ఎక్కువ కాలం నుంచి స్ట్రెస్ ఉండడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ కార్టిసాల్ సెన్సిటివ్ అవుతుంది. అందువల్ల తీవ్రమైన ఇన్ ఫ్లమేషన్ కు కారణమవుతుంది. తద్వారా పదే పదే జలుబు అవుతుంది. చల్లగాలి ఉండడమో, వాతావరణంలో మార్పుల వల్లనో అయితే వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనమై జలుబు చేస్తుంది. కాని వాతావరణంతో సంబంధం లేకుండా పదే పదే జలుబు చేస్తుంటే మాత్రం మీరు దేనికోసమో విపరీతంగా ఆందోళన చెందుతున్నారని అర్థం.
గ్యాస్ సమస్యా...? సైకాలజిస్టును కలవండి
పదే పదే కడుపు ఉబ్బరంగా ఉంటోందా..? తిన్నది అరగనట్టుగా అనిపిస్తోందా? ఈనో లాంటివి తీసుకున్నా తగ్గట్లేదా? మనసులో అలజడి, ఆందోళన ఇలాంటి ఇబ్బందులుగా కనిపించవచ్చు. గ్యాస్ సమస్య ఎక్కువైపోయిందని గ్యాస్ట్రోఎంటరాలజిస్టును కూడా కలుస్తుంటారు. కాని ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో సైకాలజిస్టును కలిస్తేనే మంచి ఫలితం ఉంటుంది.
చాలా టెన్షన్ తో ఉన్నప్పుడు కడుపులో ఏదో అలజడిగా ఉంటుంది. మనసులో ఆందోళన కడుపులో అలజడిగా వ్యక్తమవుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ముందుగా జీర్ణ వ్యవస్థ మీదనే ప్రభావం చూపిస్తుంది. అధిక ఒత్తిడి జీర్ణ వ్యవస్థ పైన నెగటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందని అనేక పరిశోధనల్లో తెలిసిన విషయమే. కొన్నిసార్లు జీర్ణ సమస్యలకు, గ్యాస్ లాంటి ఇబ్బందులకు ఎటువంటి మందులు వేసుకున్నా రిజల్ట్ కనిపించదు. దానికి కారణం స్ట్రెస్ అనే అనుకోవాలి.
జుట్టు రాలుతోందా..?
జుట్టు రాలిపోతున్నదంటే అతిగా ఆలోచిస్తున్నావేమో అంటుంటారు. ఇది కొంతవరకు కరెక్టే. స్ట్రెస్ వల్ల జుట్టు రాలిపోయి బట్టతల తొందరగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. జుట్టు రాలే సమస్యకు విటమిన్లు, ఇతర పరిష్కారాలు కూడా ఫలితం చూపించకపోతే దాని వెనుక కారణం మీ ఒత్తిడే అనుకోవాలి.
తలనొప్పి తగ్గట్లేదా..?
మనసు బాగాలేనప్పుడు ఎవరైనా పలకరిస్తే.. ‘అబ్బ.. తలనొప్పిగా ఉంది.. డిస్ట్రబ్ చేయకు’ అంటుంటాం. మనసులో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు నిజంగానే తలనొప్పి కూడా వచ్చేస్తుంది. తలనొప్పే కాదు.. స్ట్రెస్ లో ఉన్నవాళ్లు దేని మీదా ఏకాగ్రత పెట్టలేరు. పనిపై ఫోకస్ చేయలేరు. దీనికి నాడులలో ఒత్తిడే కారణం.
తల నొప్పి రావడానికి అనేక కారణాలున్నాయి. తగినంత నిద్ర లేకపోవడం, బీపీ పెరగడం, సైనసైటిస్, ప్రెగ్నెన్సీ లాంటి వెన్నో కారణం. కాని కొన్నిసార్లు భావోద్వేగపరమైన ఒత్తిడి కూడా తలనొప్పికి కారణం అవుతుంది. తలనొప్పి టాబ్లెట్ వేసుకోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం అనిపించినా పదే పదే తలనొప్పి వస్తుంటుంది. ఒత్తిడి కొన్నిసార్లు సీరియస్ సమస్యలను కూడా తీసుకురావొచ్చు. దీర్ఘకాలికంగా ఒత్తిడి ఉన్నవాళ్లు నిద్రలేమితో బాధపడవచ్చు. నిద్ర సరిగా లేకపోతే మరిన్ని సమస్యలు వస్తాయి.
శృంగారానికి నో
శృంగారానికి మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది. అందుకే మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్లు శృంగారం పట్ల ఆసక్తి చూపించలేరు. మానసిక ఒత్తిడి వల్ల గుండె పై కూడా ప్రభావం చూపిస్తుందన్నది శాస్త్రీయంగా రుజువైన విషయమే. దీర్ఘకాలిక ఒత్తిడి కార్డియోవాస్కులర్ సమస్యలను ప్రేరేపిస్తుంది.