రామకృష్ణకి అయిదారేళ్లుగా డయాబెటిస్ సమస్య ఉంది. ఇటీవలే కొవిడ్ బారి పడ్డాడు. పది రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ మధ్యనే కొవిడ్ నుంచి కోలుకున్నాడు. కానీ గ్యాస్ సమస్య మరింత బాధపెడుతున్నది. ఇంతకుముందు కూడా అసిడిటీ సమస్య ఉండేది. కాబట్టి అవే మందులు మళ్లీ వాడుతున్నాడు. కానీ ఎటువంటి ఫలితం లేదు. కొంపదీసి గుండెకు సంబంధించిన సమస్యేమో అని కార్డియాక్ టెస్టులన్నీ చేయించాడు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. తనకు గ్యాస్ సమస్య చూసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులేవో మార్చి ఇచ్చాడు. ప్చ్! అయినా ఉపయోగం లేదు. ఒక స్నేహితుడి సలహా మేరకు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. పరీక్షల్లో తెలిసిన నిజం ఆశ్చర్యానికి గురి చేసింది. ఏమిటా షాకింగ్ నిజం!
కొవిడ్ వచ్చి వెళ్లిన తరువాత ఒక్కొక్కటిగా రకరకాల సమస్యలు బయటపడుతున్నాయి. నిన్నటి వరకూ బ్లాక్ ఫంగస్ ముక్కులో, సైనస్‌లలో వీర విహారం చేసింది. ఎందరికో ప్రాణాపాయం కలిగించింది. బ్లాక్ ఫంగస్ అంత ప్రమాదకారి కాకపోయినా మరో ఫంగస్ ఒకటి అన్నవాహికను ఇబ్బంది పెడుతున్నది. అదే ఈసోఫేగల్ కాండిడా. అన్నవాహికలో చేరే ఈ ఫంగస్ కొవిడ్ జీర్ణ సమస్యలకు కారణమవుతున్నదని ఇటీవలే బయటపడింది.
ఏమవుతుంది?
కొవిడ్ వచ్చి, తగ్గిన కొన్ని వారాలు, నెలల తరువాత చాలామందిలో కొత్తగా గ్యాస్ సమస్యలు రావడం గానీ, అప్పటికే ఉన్న సమస్య మరింత తీవ్రం కావడం గానీ జరుగుతున్నది. ఇలాంటప్పుడు సాధారణంగా గ్యాస్ తగ్గడానికి దానికి సంబంధించిన టాబ్లెట్లు మెడికల్ షాప్ నుంచి తెచ్చి వేసుకోవడమో, అంతకుముందు వాడిన మందులే మళ్లీ వాడటమో చేస్తున్నారు. కానీ అవి వేసుకున్న తరువాత కూడా సమస్య తగ్గకపోతే అప్పుడు డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. అలాంటి సమస్యతో నా దగ్గరికి వచ్చేవాళ్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.
అవే లక్షణాలు.. కారణం వేరు!
సాధారణంగా గ్యాస్ సమస్య ఉన్నవాళ్లకు పొట్టలో గ్యాస్ ఏర్పడి కడుపుబ్బరంగా ఉంటుంది. గుండెలో మంట అంటుంటారు. కొవిడ్ తర్వాత వస్తున్న ఈసోఫేగల్ కాండిడా ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా దాదాపు ఇలాంటి లక్షణాలే ఉంటున్నాయి. కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత చాలామందిలో జీర్ణాశయంలోని యాసిడ్ పైకి రావడం వల్ల (యాసిడ్ రిఫ్లక్స్) అసిడిటీ వచ్చి ఛాతిలో మంట, గుండె పట్టేసినట్టు ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది గ్యాస్ సమస్యే అనుకుని ఎన్ని యాంటాసిడ్‌లు వాడినా సమస్య తగ్గదు.
వీళ్లకు రిస్కు ఎక్కువ
సాధారణంగా ఈసోఫేగల్ కాండిడా డయాబెటిస్ పేషెంట్లలో, స్టిరాయిడ్స్ వాడిన వాళ్లు, దీర్ఘకాలం యాంటీబయాటిక్స్ వాడిన పేషెంట్లలో కాండిడా ఇన్‌ఫెక్షన్ రిస్కు ఎక్కువ. ఇమ్యునోకాంప్రమైజ్డ్ పేషెంట్లు అంటే క్యాన్సర్ ఉన్నా, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌తో హాస్పిటల్‌లో చేరినవాళ్లలో గానీ వచ్చే ప్రమాదం ఎక్కువ. అయితే కొవిడ్ ఇన్‌ఫెక్షన్ చాలా మైల్డ్‌గా ఉండి, ఇంట్లోనే చికిత్స తీసుకున్నవాళ్లకు కూడా కొన్ని వారాల తర్వాత కాండిడా ఇన్‌ఫెక్షన్ వస్తున్నది. ఇలాంటి వాళ్లు వారంలో ముగ్గురైనా వస్తున్నారు. కాబట్టి కొవిడ్ పాజిటివ్ తర్వాత గ్యాస్ సమస్య మొండిగా ఉండి, తగ్గట్లేదంటే ఈసోఫేగల్ కాండిడా కావచ్చని అనుమానించాలి.
ఏం చేయాలి?
కొవిడ్ తర్వాత మామూలు గ్యాస్ టాబ్లెట్లు వాడినా సమస్య తగ్గకపోతే అశ్రద్ధ చేయవద్దు. వెంటనే డాక్టర్‌ని సలహా మేరకు ఎండోస్కోపీ చేయించుకుని ఈసోపేగల్ కాండిడా ఉందేమో చెక్ చేయించుకోవాలి. ఎండోస్కోపీ చేసినప్పుడు అన్నవాహికలో తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలున్నాయంటే అది కాండిడా ఇన్‌ఫెక్షన్ అని నిర్ధారణ అయినట్టే. ఎండోస్కోపీ చేస్తేనే కచ్చితమైన చికిత్స అందించగలం. నార్మల్ అసిడిటీ కోసం ఇచ్చే చికిత్సకీ, ఈసోఫేగల్ కాండిడా కోసం ఇచ్చే చికిత్సకీ చాలా తేడా ఉంటుంది. ఈసోఫేగల్ కాండిడా ఉన్నప్పుడు నార్మల్ చికిత్స ఇస్తే సమస్య మరింత జటిలం అవుతుంది. ఎండోస్కోపీ చేయించుకోకుండా టాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయి. అందువల్ల కొవిడ్ తర్వాత వచ్చే గ్యాస్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ని కలిసి, ఈసోఫేగల్ కాండిడా ఉన్నట్టయితే వాళ్ల సలహా మేరకు యాంటీఫంగల్ టాబ్లెట్లను రోజుకొకటి చొప్పున డాక్టర్ చెప్పిన మోతాదులో వాడితే సమస్య పరిష్కారం అవుతుంది.