పొట్ట బాలేదు.. నీళ్లు బాగా తాగండి.
బరువు తగ్గాలి… నీళ్లు బాగా తాగండి.
చర్మం మెరుపు తగ్గింది… నీళ్లు బాగా తాగండి.
ఇలా సమస్య ఏదైనా.. నీళ్లు బాగా తాగితే తగ్గుతుందని అంటుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే అలాగని లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం ఎంతవరకు కరెక్టు? ‘బాగా’ అంటే ఎన్ని నీళ్లు తాగాలి..?
అతి సర్వత్ర వర్జయేత్! అనేది ఎక్కడైనా వర్తిస్తుంది. ఆరోగ్యానికి మంచిది కదా అని ఏదైనా సరే పరిమితికి మించి తీసుకోకూడదని మన పెద్దలే కాదు.. ఇప్పటి డాక్టర్లు కూడా చెబుతారు. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యం అనుకుంటే పొరపాటే. ఏ కిడ్నీ సమస్యో ఉన్నవాళ్లు లీటర్ల కొద్దీ నీళ్లు తాగితే అసలుకు ఎసరే వస్తుంది.
అందుకే అంటారు… ‘అధికంగా నీరు తాగడం వల్ల ఎక్కువ సార్లు మూత్రం చేయాల్సి వస్తుంది. కానీ, చర్మం ఏమీ మెరిసిపోదు’ అని. ఇది సరదాగా అనుకునే మాటే అయినా ఇందులో వందశాతం నిజం ఉంది. నీరు ఆరోగ్యానికి మంచిదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొంతమంది ప్రముఖులు, కొంతమంది హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రాక్టీషనర్ల ప్రచారం నీళ్లు తాగడం గురించి తప్పుడు అభిప్రాయాలను ఏర్పరుస్తున్నది. ఆరోగ్యవంతులైన వాళ్లు కూడా అధికంగా నీళ్లు తాగాలన్న అపోహతో ఉంటున్నారు చాలామంది. ఇది నిజం కాదు. దీన్ని వైద్య శాస్త్రం ఆమోదించదు.
ప్రకటనల్లో నిజమెంత?
అధికంగా నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలు శుద్ధి అవుతాయి. అయితే ముఖానికి మెరుపును, సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనే ధోరణితో శరీరానికి నిజంగా అవసరమయ్యే దానికంటే ఎక్కువగా నీళ్లు తాగాలని ప్రోత్సహిస్తున్నట్టుగా కొన్ని రకాల ప్రకటనలు, ప్రచారాల ద్వారా అనిపిస్తున్నది. దీనికి కచ్చితమైన శాస్త్రీయ ఆధారం అంటూ ఏమీ లేదు. పైగా పరిమితికి మించి అధికంగా నీళ్లు తాగడం వల్ల శరీరానికి హాని కూడా కలుగవచ్చు.
ఎక్కువ తాగితే ఏమవుతుంది?
అనవసరంగా అధికంగా నీరు తీసుకోవడం వల్ల కూడా శరీరంపై అనారోగ్యకరమైన ప్రభావాలు ఉంటాయి. అవసరానికి మించి నీళ్లు తాగితే రక్తంలో సోడియం తక్కువై వివిధ రకాల సమస్యలకు దారి తీస్తుంది. ఎక్కువ కాలం పాటు అలా అధికంగా నీరు తీసుకుంటూ అలవాటుగా మారితే క్రమంగా కిడ్నీలు మూత్రాన్ని వడపోసే సామర్థ్యం కోల్పోవచ్చు. ఆందోళన, మెదడులో వాపు, మూర్ఛల వంటి సమస్యలు రావొచ్చు. మనిషి కోమాలోకి కూడా వెళ్లిపోవచ్చు. ఎడిమా కారణంగా శరీరమంతా ఉబ్బినట్టు కావొచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు. కొందరికి సైకోజెనిక్ పాలిడిప్సియా అనే పరిస్థితిగా మారి, అధికంగా నీరు తీసుకోవడమనే ఒక అసంకల్పిత అలవాటుగా అవుతుంది. దీనివల్ల తమకు తెలియకుండానే అవసరం లేకపోయినా అధికంగా నీరు తాగుతుంటారు.
ఎన్ని నీళ్లు తాగాలి?
• నీళ్లు తాగాలనిపించకపోయినా, కడుపులో తిప్పుతున్నా పదే పదే జగ్గుల కొద్దీ నీళ్లు తాగడం కరెక్ట్ కాదు. ఆరోగ్యవంతమైన మనిషి చేయాల్సింది దాహమేసినప్పుడు మాత్రమే నీరు తాగడం. ఆరోగ్యవంతమైన శరీరంలో అది సాధారణంగా ఉన్నటువంటి శరీర ధర్మం. కానీ దాహం ఎక్కువగా అవుతూ తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తున్నదనుకుంటే మాత్రం శరీరంలో ఏదైనా సమస్య ఉందని అర్థం. ఇలాంటప్పుడు డాక్టర్‌ను కలవాలి. ఒకసారి షుగర్ టెస్టు చేయించుకోవడం మంచిది.
• ఇకపోతే హార్మోన్లు, గుండె, కిడ్నీ, మెదడు లేదా కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లు రోజువారీ ఎన్ని నీళ్లు తాగాలన్న అంశం గురించి నిపుణుల సలహాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
• వ్యాయామం చేస్తున్నప్పుడు, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు తాగాల్సి వస్తుంది.
• నీళ్ల విరేచనాలు లేదా వాంతుల వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు శరీరానికి అదనపు నీరు అవసరమవుతుంది.
• రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు కూడా నీళ్లు ఎక్కువగా తాగాల్సి వస్తుంది.
ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అదనపు నీటిని తీసుకోవాలే గానీ సాధారణ ఆరోగ్యం ఉన్నవాళ్లు అధికంగా నీళ్లు తాగడం సమర్థనీయం కాదు. కాబట్టి ఆరోగ్యం పేరుతో ప్రతిరోజూ అదనంగా జగ్గుల కొద్దీ నీరు తాగడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
Informative &educative article
thank you andi.
thank you madam.