మీ అబ్బాయికి మాటలు ఇంకా రావడం లేదా? అయితే వెంటనే వినికిడి పరీక్ష చేయించండి అని చెప్తారు డాక్టర్లు. ఎందుకంటే వినిపించకపోతే మాట్లాడడం కూడా రాదు. అందుకే కన్ను తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన ఇంద్రియం చెవి. అలాంటి చెవిని, వినికిడినీ కొన్నిసార్లు మన అజాగ్రత్తలతో పోగొట్టుకుంటాం. వినికిడికి ప్రమాదం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మనం ఏవైనా పనులు చేయడానికి కనిపించడం ఎంత ఇంపార్టెంటో, వినిపించడం కూడా అంతే ముఖ్యం. చిన్నపిల్లలకైతే వినికిడి లేకపోతే మాటలు కూడా నేర్చుకోలేరు. మూగవాళ్లయిపోతారు. అంతటి ప్రాధాన్యం ఉన్న చెవిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి.. కానీ అది ఎంత ముఖ్యమో మనలో చాలామంది గ్రహించడం లేదు. మనకు వినిపించాలంటే శబ్ద ప్రకంపనలు ఒక క్రమ పద్ధతిలో ఏర్పడాలి. వాటిని చెవి గ్రహించి శ్రవణ నాడి ద్వారా మెదడుకు పంపిస్తుంది. అక్కడ ఆ శబ్దాన్నివిశ్లేషిస్తుంది మెదడు. అలా ఆ శబ్దం ఏంటన్నది మనకు తెలుస్తుంది. ఈ ప్రక్రియలో అత్యంత ప్రధానమైంది కర్ణభేరి.
చెవికి చిల్లు
ఇప్పుడు కరోనా వల్ల నిశ్శబ్దం అలముకుంది. వీకెండ్ పార్టీల హోరు నగరాల్లో మామూలే. ఇంట్లో యూత్ కూడా పెద్ద సౌండ్ తో పాటలు వినడం అలవాటే. ఇక దీపావళి వచ్చిందంటే చాలు.. చెవులకు నరకమే. పెద్ద పెద్ద సౌండ్లతో పేలే బాంబులతో వీధులన్నీ దద్దరిల్లిపోతాయి. ఇక పార్టీలు, పబ్ లలో చెప్పే పనే లేదు. ఆ శబ్ద హోరుకు చెవులు చిల్లులు పడతాయా అనిపిస్తుంది. అనిపించడం మాత్రమే కాదు. నిజంగానే చిల్లు పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు కర్ణభేరికి రంధ్రం పడి, అది చిరిగిపోతుంది. దీన్నే చెవికి చిల్లు పడడంగా చెప్తాం.
100 డెసిబుల్స్ దాటితే.. అంతే !
- 100 డెసిబుల్స్ కన్నాఎక్కువ శబ్దానికి కర్ణభేరి చిరిగిపోతుంది. పండగలు, ఫంక్షన్లలో వినిపించే సౌండు 100 డెసిబుల్స్ ఉంటుంది. ఈ శబ్దంలో కూడా 45 నిమిషాల పాటు ఉంటే వినికిడి దెబ్బతింటుంది.
- మనం మామూలుగా మాట్లాడుకునే మాటల శబ్దం 60 డెసిబుల్స్ ఉంటుంది.
- శబ్దాన్ని ఎంత దూరంలో, ఎంత సేపు విన్నామనే దాన్ని బట్టి ప్రమాదం ఉంటుంది.
- విమానం ఇంజన్ కి 10 అడుగుల దూరం వరకు 110 డెసిబుల్స్ శబ్దం ఉంటుంది. ఈ శబ్దాన్ని 15 నిమిషాల పాటు వింటే చాలు వినికిడి నరాలు పూర్తిగా పాడవుతాయి.
- 113 డెసిబుల్స్ శబ్దాన్ని ఏడున్నర నిమిషాలు వింటే చాలు నరాలు దెబ్బతింటాయి.
- 116 డెసిబుల్స్ శబ్దానికి మూడున్నర నిమిషాలు ఎఫెక్ట్ అయితే చాలు వినికిడి పోవచ్చు.
- ఇక శబ్దం 120 నుంచి 125 డెసిబుల్స్ దాటితే దానికి 1 సెకను ప్రభావితం అయినా సరే.. అది చెవికి చాలా ప్రమాదం.
- 150 డెసిబుల్స్ ఉంటే కర్ణభేరి పగిలిపోవడంతో పాటు ప్రాణాపాయం కూడా ఉంటుంది.
ఈ అలవాట్లు ప్రమాదం..
చెవిలో దురదగా అనిపించగానే ఇయర్ బడ్స్ తిప్పితే హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది పదే పదే చెవిలో ఇయర్ బడ్స్ పెడుతుంటారు. కొందరైతే కాగితాన్ని పొడవుగా చుట్టి చెవిలో పెట్టి శుభ్రం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది శుభ్రం కావడం మాట అటుంచి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇకపోతే కొందరు పిల్లలకు తలస్నానం చేయించే ముందు చెవుల్లో నూనె వేస్తుంటారు. దురద వస్తోందని కూడా నూనె వేసుకుంటుంటారు. దీనివల్ల దురద తగ్గడం కాదు గానీ ఇన్ ఫెక్షన్ మాత్రం వచ్చిపడుతుంది. ఇలాంటి పనుల వల్ల కొన్నిసార్లు వినికిడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇలా అయితే డాక్టర్ ని కలవాలి
చెవిలో బడ్ పెట్టి కూడా శుభ్రం చేయొద్దంటే మరెలా? చెవిలో చేరిన గులిమి వల్ల ప్రమాదం లేదా? అనిపించొచ్చు. కానీ దీనివల్ల సమస్య ఉండదు. కొన్ని సందర్భాల్లో మాత్రం డాక్టర్ ను కలవాల్సి వస్తుంది. నిజానికి చెవిని శుభ్రం చేసే మెకానిజమ్ దానిలోనే ఉంటుంది. కాని కొన్నిసార్లు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి శుభ్రం చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బయటకు కనిపించే చెవి చిన్నగా ఉన్నవాళ్లు ప్రత్యేకంగా డాక్టర్ చేత చెవిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
కర్ణ భేరికి రంధ్రం పడినప్పుడు మాత్రమే కాదు, వినికిడికి సంబంధించిన కణాలు దెబ్బతిన్నప్పుడు కూడా వినగలిగే సామర్థ్యం పోతుంది. అతి పెద్ద ధ్వనులు విన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు ఏ చికిత్సా ఉండదు. కాబట్టి పెద్ద పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి.