ఎవరన్నారు భారతదేశం వైద్య పరిశోధనల్లో వెనుకబడిందని….
ఎవరన్నారు మనవాళ్లు రీసెర్చ్‌పై ఖర్చు పెట్టడానికి వెనుకాడుతారని…
ఎవరన్నారు అంతర్జాతీయ స్థాయి విజ్ఞాన పరిశోధనలు మనవాళ్లు చేయరని…
ఎవరన్నారు మనదేశంలో అధ్యయనాలు జరగవని….
మనదేశంలో… మన రాష్ట్రంలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌పై జరిగిన అధ్యయనం ప్రపంచంలోనే మొదటిది.
మొన్న కొవిడ్‌కి వాక్సిన్ తయారీలో మనవాళ్లూ ముందున్నారు. నిన్న కాక్టైల్ యాంటీబాడీ చికిత్స ప్రభావాల అధ్యయనంలోనూ మనవాళ్లే.. అదీ మన తెలుగువాళ్లూ ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఇందుకు వేదికైంది. ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి ప్రోత్సాహంతో ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్త సారథ్యంలో ప్రతిష్ఠాత్మకమైన అధ్యయనం జరిగింది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కి కొత్తగా వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స సమర్థతపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇంతకుముందే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ ఇంజెక్షన్‌ను తీసుకున్నారు. మరికొన్ని అధ్యయనాలు జరిగినప్పటికీ డెల్టా వేరియెంట్‌పై ఇంత పెద్ద ఎత్తున అధ్యయనం చేయడం ప్రపంచంలోని ఇదే మొదటిసారి. ఈ అధ్యయన ఫలితాలు ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ప్రపంచం మీద కొవిడ్ విరుచుకుపడిన కొత్తల్లో అదేంటో.. ఎలా వస్తున్నదో.. ఏ చికిత్సలివ్వాలో అర్థం కాక తల పట్టుకున్నది వైద్యరంగం. దాన్ని అధ్యయనం చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడ్డాయి. పరిశోధనలు చేస్తున్న కొద్దీ కొత్త ఆశలు చిగురించాయి. ప్రపంచమంతా కొవిడ్ గురించిన పరిశోధనల్లోనే లీనమైంది. మెల్లగా ప్లాస్మా థెరపీ, రెమిడిసివిర్, ఐవర్‌మెక్టిన్ లాంటివి వాడారు. ఆ తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీల ద్వారా అందించే చికిత్స ఈ మధ్యే ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ దాని సమర్థతపై పూర్తి స్పష్టత రాలేదు. ఇప్పుడు జరిగిన ఈ అధ్యయనం ద్వారా సార్స్ కరోనా వైరస్ 2 డెల్టా వేరియెంట్ ఇన్ఫ్టె్ అయిన వాళ్లలో వ్యాధి తీవ్రం కావడం, ప్రాణాపాయం కలిగే రిస్కును మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ వంద శాతం తగ్గిస్తుందని రుజువైంది. ఇందులో రెండు రకాల యాంటీబాడీలు వాడుతారు కాబట్టి దీన్ని కాక్టైల్ మోనోలోనల్ యాంటీబాడీ చికిత్సగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇదీ స్టడీ
ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన ఫీవర్ క్లినిక్ నుంచి 285 మంది ఎక్కువ రిస్కు ఉన్న పేషెంట్లను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. అందరికీ కూడా లక్షణాలు మొదలై 7 రోజులైంది. అందరూ ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ ఉన్నారు. ఈ పేషెంట్లను రెండు విభాగాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లో 208 మందికి మోనోక్లోనల్ థెరపీ ఇచ్చారు. రెండో గ్రూప్‌లో అప్పటికే ప్రామాణికంగా ఉన్న రెమిడిసివిర్ ఇచ్చారు. ఈ అధ్యయనం ప్రారంభించడానికి ముందే ఆయా పేషెంట్లలో డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షనేనా కాదా అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా తెలుసుకున్నారు. వాళ్లలో 98 శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉంది.
అధ్యయనం అందించిన అద్భుత ఫలితాలు
- మోనోక్లోనల్ థెరపీ ఇచ్చినవాళ్లలో క్లినికల్‌గా లక్షణాలు ఉన్నవాళ్లలో 78 శాతం మంది ఇంప్రూవ్ అయ్యారు. కాగా రెమిడిసివిర్ ఇచ్చినవాళ్లలో 50 శాతం మాత్రమే మెరుగయ్యారు.
- కాక్టైల్ థెరపీ ఇచ్చిన 7వ రోజునే 75 శాతం మంది ఆర్టి-పిసిఆర్ నెగటివ్ అయ్యారు. రెమిడిసివిర్ తీసుకున్నవాళ్లలో 52 శాతం మంది 7 రోజుల తర్వాత కూడా ఆర్టి- పిసిఆర్ పాజిటివ్‌గానే ఉన్నారు.
- మోనోక్లోనల్ యాంటీబాడీలు తీసుకున్నవాళ్లలో 7 రోజుల తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్లు పెరగలేదు. రెమిడిసివిర్ తీసుకున్నవాళ్లలో మాత్రం ఇంకా పెరిగాయి.
- మోనోక్లోనల్ థెరపీ ఇచ్చినవాళ్లలో ఒక్కరికీ కూడా వ్యాధి తీవ్రం కాలేదు. ప్రాణాపాయం అసలే రాలేదు. కానీ రెమిడిసివిర్ తీసుకున్నవాళ్లలో కొందరికి తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. వాళ్లను హాస్పిటల్లోనే ఇంకొన్ని రోజులు మానిటర్ చేసి, డిశ్చార్జి చేశారు.
- అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీలు ఇచ్చిన వాళ్లకు ఎవరికీ కూడా పోస్ట్ కొవిడ్ లక్షణాలేవీ కనబడలేదు.
ఏమిటీ థెరపీ..?
మోనోక్లోనల్ యాంటీబాడీలు… అంటే ఒకే రకమైన క్లోన్ నుంచి పెరిగిన యాంటీబాడీలను ఉపయోగించి ఇచ్చే చికిత్స ఇది. అయితే ఇందులో రెండు రకాల మోనోక్లోనల్ యాంటీబాడీలను కలిపి ఒకే ఇంజెక్షన్‌గా ఇస్తారు. Casirivimab, Imdivimab అనే రెండు రకాల మోనోక్లోనల్యాంటీబాడీలను కలిపి కాక్టైల్ థెరపీ రూపంలో ఇస్తారు. అయితే ఈ చికిత్సను ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదు. ఆర్టి-పిసిఆర్ పాజిటివ్ వచ్చిన 3 నుంచి 7 రోజుల తర్వాత గానీ లేదా లక్షణాలు మొదలైన రోజు గానీ ఈ చికిత్సను ఇవ్వవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉండి, హాస్పిటల్లో చేరినవాళ్లకు, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి, సప్లిమెంటల్ ఆక్సిజన్ ఇవ్వాల్సిన వాళ్లకు కూడా ఇది పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా అధ్యయనాలు చేస్తున్నారు.
వీళ్లకు మాత్రమే…!
మోనోక్లోనల్ థెరపీ అందరికీ ఇవ్వడానికి కుదరదు. రిస్కు ఎక్కువగా ఉన్నవాళ్లకు ఇస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధి మైల్డ్‌గా లేదా మాడరేట్‌గా ఉన్నవాళ్లకు మాత్రమే ఇవ్వాలి. ఇంట్లో ఎవరికైనా కొవిడ్ వస్తే మిగిలినవాళ్లు ముందుజాగ్రత్తగా ఈ థెరపీ తీసుకోవచ్చు. కానీ ఇది వాక్సిన్‌కి ప్రత్యామ్నాయం కాదు. ఈ కింది రిస్క్ గ్రూపుల్లో ఉన్నవాళ్లకు మోనోక్లోనల్ థెరపీ ఇస్తారు.
- పెద్ద వయసువాళ్లకు (65 ఏళ్లు పైబడినవాళ్లు)
- స్థూలకాయం ఉన్నవాళ్లు లేదా బిఎంఐ 25 కి.గ్రా/మీ2 కన్నా ఎక్కువ ఉన్నవాళ్లు
- గర్భిణులు
- దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (సికెడి)
- డయాబెటిస్
- ఇమ్యూనోసప్రెసివ్ వ్యాధులున్నవాళ్లు
- ఇమ్యునోసప్రెసివ్ చికిత్స తీసుకుంటున్నవాళ్లు
- క్రానిక్ లంగ్ డిసీజ్
- సికిల్ సెల్ వ్యాధి
- సెరిబ్రల్ పాల్సీ లాంటి న్యూరోడెవలప్‌మెంటల్ డిజార్డర్లు ఉన్నవాళ్లు