మైగ్రేన్ నుంచి పక్షవాతం దాకా నరాలకు సంబంధించిన జబ్బులున్నా, శరీరంలో ఎక్కడైనా నొప్పి సంబంధిత సమస్యలున్నా… తొందరగా రిలీఫ్ రావాలని ఇంగ్లీషు వైద్యం వైపు వెళ్లనవసరం లేదు. అల్లోపతి మందుల సైడ్ ఎఫెక్టులు లేకుండా మనదైన వైద్యం.. ఆయుర్వేదం అందిస్తున్న అద్భుతమైన చికిత్స గురించి మనలో చాలామందికి తెలియదు. వాత ప్రధాన వ్యాధులకు ఆయుర్వేదంలో ఉన్న ఆ చికిత్సే వస్తి కర్మ.
వాతం చేసింది… అనే మాట మన పెద్దవాళ్లు అంటుండటం వినే ఉంటాం. ఆయుర్వేదం చెప్పే వాత, పిత్త, కఫాలు మన శరీరంలో ఎప్పుడూ సమ పాళ్లలో ఉండాలి. వీటిలో దేనిలో హెచ్చుతగ్గులైనా సమస్యే. అలా మనలో వాత ప్రవాహంలో అడ్డంకులు ఎదురైనప్పుడు వచ్చే సమస్యలే వాత వ్యాధులు. వాత సమస్యలంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినవే అని అనుకోవద్దు. శరీరంలో ఎక్కడ వాత ప్రవాహంలో తేడాలు వచ్చినా ఆయా భాగాల్లో సమస్యలు రావొచ్చు. ఇలాంటప్పుడు సాధారణంగా నొప్పి, సెన్సేషన్ తగ్గిపోవడం, తిమ్మిర్లు, చీమలు పాకినట్టు ఉండటంతో సమస్యలు ప్రారంభమవుతాయి. చాలామటుకు వాత సంబంధ వ్యాధులు నరాలకు సంబంధించినవే అయివుంటాయి. ఇలాంటి వాత సంబంధిత వ్యాధులకు ప్రధాన చికిత్సగా వస్తికర్మ ఇస్తారు.
వస్తి అంటే..?
నిజానికి వస్తి లేదా బస్తి అనే పదానికి అర్థం మేక శరీరంలోని బ్లాడర్. పాత కాలంలో వస్తి ఇవ్వడానికి మేక బ్లాడర్‌ని వాడేవాళ్లు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. వాత సంబంధిత వ్యాధుల చికిత్సలో వస్తి వల్లనే సమస్య సగం పరిష్కారం అవుతుంది. అందుకే ఈ వ్యాధులను మేనేజ్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు వస్తి అర్ధ చికిత్సగా ఉపయోగపడుతుందంటాడు చరకుడు.
వస్తిని ఎనీమా లాగా ఇస్తారు. అలాగని ఇది కేవలం ఎనీమా కాదు. పెద్దపేగును శుభ్రం చేయడానికి వాడే ప్రక్రియ అసలే కాదు. ఒక ఔషధాన్ని మన శరీరంలోకి పంపించాలంటే రకరకాల మార్గాలున్నాయి. నోటి మాత్రలుగా కొన్ని వాడుతాం. లేదా రక్తనాళంలోకి లేదా కండరంలోకి ఇంజెక్షన్ రూపంలో పంపిస్తారు. అలా ఆయుర్వేద మందును మలద్వార మార్గం గుండా, రెక్టమ్ (మల నాళం లేదా పురీష నాళం) ద్వారా పంపితే వస్తి అంటారు. దీన్ని పేగును శుభ్రపరచడానికి కాదు, పేగులో శోషణ చెందడానికి (శరీరం గ్రహించడానికి) పంపిస్తారు.
వస్తి కర్మ ఎలా చేస్తారు?
వస్తి కర్మలో ప్రధాన థెరపీ వస్తి. అయితే దీనికన్నా ముందు ప్రీ-థెరపీ ఉంటుంది. దీనిలో వస్తి కోసం శరీరాన్ని, వస్తి ఇవ్వాల్సిన భాగాలను థెరపీ కోసం ప్రిపేర్ చేస్తారు. ఇందుకోసం అభ్యంగ, నాడీ స్వేదన అనే రెండు ప్రక్రియలుంటాయి. మొట్ట మొదట మెడిసిన్ పంపించాల్సిన భాగం దగ్గర అంటే మల ద్వారం లేదా కటి భాగం దగ్గరి నుంచి కాళ్లు అంతటా అభ్యంగం చేసి, అక్కడి కండరాలన్నింటినీ రిలాక్స్ చేస్తారు. తర్వాత నాడీ స్వేదన ఇస్తారు. నాడీ యంత్రం ద్వారా ఈ స్వేదం ఇస్తారు. నాడీ యంత్రంలో ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి పాత్ర, దానికి ఒక ట్యూబు ఉంటాయి. కుక్కర్లో కషాయాన్ని ఉడికిస్తూ ఉంటారు. అది ఉడికిన కొద్దీ దానిలో నుంచి ఔషధంతో కూడిన ఆవిరి బయటికి వస్తూ ఉంటుంది. ఈ ఆవిరిని పైపు ద్వారా వస్తి ఇవ్వాల్సిన చోట, దాని చుట్టుపక్కల భాగాలన్నింటికీ పంపిస్తారు. స్వేదన వల్ల అక్కడున్న రంధ్రాలు తెరుచుకుని, వాటి గుండా అక్కడి ఉపరితల భాగాల మీద ఉండే టాక్సిన్స్ (విష పదార్థాలు) అన్నీ బయటికి వచ్చేస్తాయి. అంతేగాక, అక్కడి కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి.
ఆ తరువాత ఆయా భాగాల్లో చేత్తో తడుతూ, అంతర్గతంగా ఉండే కండరాలు (ఇంటర్నల్ మజిల్స్) అన్నీ రిలాక్స్ అయ్యేలా చేస్తారు.
ఇప్పుడు వస్తి యంత్రం ద్వారా మెడిసిన్‌ని మల ద్వారం గుండా, రెక్టల్ మార్గం ద్వారా పేగు లోపలికి పంపిస్తారు. వస్తి యంత్రంలో ఒక క్యాన్, నాజిల్ ఉంటాయి. క్యాన్‌లో ప్రిపేర్ చేసి ఉంచిన ఔషధాన్ని నాజిల్ ద్వారా పంపిస్తారు. సమస్యని బట్టి దీనిలో ఔషధాన్ని తయారుచేస్తారు. వస్తి ద్వారా ఇచ్చిన ఔషధం పేగుల్లో గ్రహించబడి, మిగిలిన వ్యర్థ పదార్థం (ఆయిల్ లేదా కషాయంలలో మిగిలింది) బయటికి మలం ద్వారా విసర్జించబడుతుంది. అందుకే వస్తి తర్వాత కొద్దిసేపు హాస్పిటల్లోనే ఉండాలని చెప్తారు.
తైల వస్తి – కషాయ వస్తి
స్థూలంగా చెప్పాలంటే వస్తి కోసం ఉపయోగించే పదార్థాలను బట్టి ఇది రెండు రకాలు. తైలం (ఆయుర్వేద నూనె) ఉపయోగిస్తే తైల వస్తి లేదా మాత్ర వస్తి అంటారు. కషాయం ఉపయోగిస్తే కషాయ వస్తిగా చెబుతారు. సమస్యని బట్టి వేర్వేరు ఆయిల్స్, కషాయాలు ఉపయోగిస్తారు.
కషాయ వస్తి :
కషాయ వస్తిని ఆస్థాపన వస్తి అని కూడా అంటారు. దీని కోసం మాక్షిక అంటే తేనె, లవణ, తైల, కల్క (పేస్టు), క్వాధ (కషాయం) అనే అయిదు రకాల పదార్థాలను నిర్దుష్టమైన కొలమానంతో తీసుకుంటారు. మేక్షికం (తేనె), లవణం, తైలం, కల్కం – ఈ నాలుగింటిని ఖల్వం అంటారు. వీటిని కలిపి పేస్టులా చేస్తే ఖల్వం అంటారు. మరో పక్క అయిదో పదార్థమైన కషాయంను వేడి చేస్తారు. ఈ కషాయాన్ని ఫిల్టర్ చేసి, ఖల్వం పేస్టును దానికి కలుపుతారు. అప్పటి వరకు పాక్షిక ద్రవ పదార్థంగా ఉన్న పేస్టు కషాయం కలవగానే ద్రవంగా అవుతుంది. వీటన్నింటినీ సవ్య దిశలో (క్లాక్ వైజ్‌గా) కలుపుతారు. అయిదు రకాల పదార్థాలన్నీ బాగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని వస్తి యంత్రం లోని క్యాన్‌లోకి తీసుకుని, పైపు ద్వారా రెక్టల్ మార్గం గుండా లోపలికి పంపిస్తారు.
కషాయ వస్తిని తిన్న వెంటనే ఇవ్వకూడదు. కనీసం గంట గ్యాప్ ఇచ్చిన తర్వాతే ఇవ్వాలి. అలాగని ఖాళీ కడుపుతో ఇవ్వకూడదు. ఇది శరీరంలో ఉండే సమయం (రిటెన్షన్) తక్కువ. 45 నిమిషాలకు మించి ఉండదు. ఆ తర్వాత బయటికి వచ్చేస్తుంది. అందువల్ల తైల వస్తి అయ్యాక వెంటనే ఇంటికి పంపివ్వరు.
వివిధ రకాల సమస్యల్లో వేర్వేరు రకాల పదార్థాలను కల్కంగా తీసుకుంటారు.
శతకూప అనే మూలికతో చేసిన కల్కంను సాధారణంగా అందరికీ ఇవ్వొచ్చు. కానీ నువ్వుల పేస్టుతో చేసే తిల కల్కంను నొప్పి ఉన్నవాళ్లకే వాడుతారు. వేడి శరీరం ఉన్నవాళ్లకు ఇది ఇవ్వకూడదు. ఇకపోతే బరువు తగ్గడం కోసం లేఖన వస్తి చేస్తారు. ఇందులో కల్కంగా చింత ఆకుల పేస్టును తీసుకుంటారు.
తైల వస్తి :
తైలవస్తి లేదా మాత్ర వస్తినే అనువాసన వస్తిగా చెప్తారు. దీనిలో ఆయుర్వేద తైలాలను ఇస్తారు. సమస్య రకం, దాని తీవ్రతలను బట్టి ఏ రకమైనది ఇవ్వాలో నిర్ణయిస్తారు. తైలవస్తి ఇచ్చేటప్పుడు ఆర్ద్రపాణిగా ఇవ్వాలి అంటారు చరకుడు. అంటే ఆర్ద్ర అంటే తడి, పాణి అంటే చెయ్యి. ఆహారం తీసుకున్న పిదప, కడుక్కున్న చెయ్యి ఆరేలోపు వస్తి ఇవ్వాలని దీని అర్థం. ఇది అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి తిన్న వెంటనే వీలైనంత తొందరగా తైలవస్తి ఇస్తారు. ఇది కొద్ది సేపటి వరకు శరీరంలో ఉంటుంది. దీని రిటెన్షన్ సమయం 3 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత బయటికి వస్తుంది.
వస్తి తర్వాత
• ఏదైనా సరే వేడిగా తినాలి. నిజానికి ఏ పంచకర్మ తర్వాతైనా వేడి ఆహారమే తీసుకోవాలి.
• త్వరగా అరిగే ఫుడ్ తీసుకోవాలి. మైదా, ఆయిలీ, స్పైసీ తీసుకోవద్దు.
• పొగతాగడం, ఆల్కహాల్ అలవాట్లకు వస్తి తీసుకోవడానికి వారం ముందు నుంచి కనీసం సిట్టింగ్స్ అయ్యే వరకు దూరంగా ఉండాలి.
• వస్తి తీసుకున్న రోజు లేదా కనీసం ఒకట్రెండు గంటల వరకు ఏసీలో ఉండకూడదు.
ఎలా ఇవ్వాలంటే…
చికిత్స ప్లాన్‌ని బట్టి వస్తి మూడు రకాలు. అవి – యోగ వస్తి, కర్మ వస్తి, కాల వస్తి. వీటిలో యోగ వస్తికి 8 సిట్టింగ్స్, కర్మ వస్తికి 15 సిట్టింగ్స్, కాల వస్తికి 30 సిట్టింగ్స్ అవసరం అవుతాయి. ఏ రకమైన వస్తి అయినా తైల, కషాయ వస్తిలు కలిపి ఇస్తారు. మొదటి రోజు తైలం, తరువాత కషాయం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తారు. అయితే థెరపీని తైలవస్తితో మొదలు పెట్టి, చివరి రెండు రోజులూ తైల వస్తితోనే ముగించాలి. మధ్యలో కషాయ వస్తితో ఆపితే కాంప్లికేషన్లు వస్తాయి. దీనివల్ల :
• శరీరం పొడిబారుతుంది.
• ఆకలి తగ్గుతుంది.
• అనీజీగా, రెస్ట్‌లెస్‌గా ఉంటారు.
• యాంగ్జయిటీ పెరుగుతుంది.
• సమస్యకు సంబంధించిన లక్షణాలు పెరుగుతాయి. తిమ్మిర్లు, నొప్పుల వంటివి పెరుగుతాయి.
రెండు రోజుల్లోనే ఫలితం ..!
పంచకర్మ చికిత్సలు వ్యాధిపై ఎలా పనిచేస్తాయని తెలిపేదాన్ని ఆయుర్వేద పరిభాషలో కార్ముకత్వం అంటారు. మన జీర్ణ వ్యవస్థకీ, మెదడుకీ మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. దీన్ని గట్ – బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అంటే జీర్ణవ్యవస్థ పనితీరు, మెదడు పరస్పర ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నమాట. మన పేగులో రక్తనాళాలన్నీ గుంపుగా ఉండే చోటుని ఇంటెస్టినల్ ప్లెక్సస్ అంటారు. ఈ భాగాన్ని గట్ బ్రెయిన్ అంటారు. అంటే జీర్ణవ్యవస్థలోని మెదడు అన్నమాట. ఇక్కడే మనం తీసుకున్న ఔషధాన్నిశరీరం గ్రహిస్తుంది. ఇక్కడ శోషించబడిన ఔషధం కాలేయంలో డీటాక్సిఫై అవుతుంది. తరువాత రక్తంలో కలుస్తుంది. అలా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇది మైక్రో సర్క్యులేషన్ స్థాయిలో పనిచేస్తుంది. అంటే మందు నానో పార్టికల్స్‌గా వెళ్తుంది. నాడులను రెజువినేట్ చేస్తుంది. పూర్తిగా దెబ్బతిన్న నాడీకణాలు బాగవవు. కానీ బలహీనపడినవాటిని మాత్రం ఈ ఔషధం బలోపేతం చేస్తుంది. ఇందులో వాడే ఆయుర్వేద ఔషధాలు శరీరం దానికదే రిపేర్ చేసుకునేలా సహాయపడుతాయి. వ్యాధి మరింత ముదరకుండా ఆపుతాయి.
ఆయుర్వేదం మెల్లగా పనిచేస్తుందని అనుకోవడం అపోహ. పంచకర్మ చికిత్సల ద్వారా ఎప్పుడైనా సరే ఫలితం వెంటనే తెలుస్తుంది. అందువల్ల వస్తి కర్మ ఇచ్చిన రెండు సిట్టింగ్స్‌లోనే సాధారణంగా ఫలితం కనిపిస్తుంది.
ఎవరికి వద్దు?
• మలద్వారం దగ్గర ఏవైనా గాయాలున్నవాళ్లకు
• పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా లాంటి సమస్యలున్నవాళ్లకు
• అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లకు.
అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉంటే అది తగ్గిన తర్వాత అంటే నిరామవస్థలోకి వచ్చిన తర్వాత ఇస్తారు. అంటే ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఆకలి బావుండటం, గ్యాస్ తగ్గడం, మలబద్దకం తగ్గడం, నిద్ర బావుండడం, నొప్పి తగ్గడం – అప్పుడు ఇస్తారు.
యాంటీ బయాటిక్స్ వల్ల సిస్టమ్ డిస్ట్రబ్ అయితే దాన్ని తగ్గించి, వస్తి ఇస్తారు.