బరువు తగ్గాలా..? అయితే నెయ్యి తినండి!!

‘‘పిల్లాడికి దగ్గు వస్తోంది కదా.. అన్నంలో నెయ్యి కలపకుండా పెట్టు..’’ ఓ అత్తగారి సలహా.
‘‘అమ్మో! ఇప్పటికే అయిదు కిలోలు ఎక్కువ బరువు పెరిగిపోయాను. నెయ్యి తింటే ఇంకా లావైపోతాను..’’ ఓ అమ్మాయి భయం.
‘‘నిద్ర పట్టట్లేదా.. చెంచాలు చెంచాలు నెయ్యి వేసుకుని తింటే ఇక రోజంతా బద్ధకంగా ఉండక ఏమవుతుంది…?’’ ఓ తల్లి మందలింపు.

ముద్దపప్పు.. కొత్తావకాయ.. ఆ అన్నంలోకి నెయ్యి.. ఆహా! ఒక్కో ముద్దా నోట్లోకి వెళుతుంటే.. అమృతమే కదా! అయినా కొందరు ఈ అమృతానికి దూరంగా ఉంటారు. కారణం.. ఇలాంటి ఎన్నో అపోహలు. ఇంతకీ నెయ్యి తినాలా.. వద్దా? ఏ నెయ్యి తినాలి? ఎంత తినాలి..? ఆయుర్వేదం ఏం చెప్తోంది?

ఒకప్పుడు వైద్యం అభివృద్ధి చెందని కాలంలో కూడా.. చాలామంది జబ్బులు రాకుండా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేవాళ్లు. అందుకు కారణం వాళ్లు తీసుకునే ఆహారమే. మనం తినే తిండిలోనే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పదార్థాలన్నీ ఉన్నాయి. వీటిని సక్రమంగా తీసుకుంటే ప్రత్యేకంగా మందులు తినాల్సిన అవసరం రాదు. అందుకే ఆహారమే ఆరోగ్యం అన్నారు. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహార పదార్థాల్లో అలా ఆరోగ్యాన్నివ్వడంలో ముందుండేది నెయ్యి. అయితే ఏ నెయ్యిని, ఎప్పుడు, ఎలా వాడాలనే దాని మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

ఆహారంలో నెయ్యి తీసుకోవాలంటే ఎక్కువ మందిని భయపెట్టే విషయం బరువు పెరుగుతామని. నెయ్యి తింటే లావైపోతామని అసలు చుక్క నెయ్యి కూడా తిననివాళ్లుంటారు. నెయ్యిలో కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటుందని తినడానికి సంశయిస్తుంటారు. అంతేకాదు.. నెయ్యి ఎక్కువగా తింటే దగ్గు మొదలవుతుందని, జలుబవుతుందని కూడా అనుకుంటారు. నెయ్యి తప్పనిసరిగా పెట్టాల్సిన చిన్న పిల్లలకు కూడా దగ్గు ఉందనో, జలుబైందనో నెయ్యి లేకుండా అన్నం పెడుతుంటారు. నెయ్యి తినడం వల్ల మగతగా ఉంటుందని మరికొందరి అభిప్రాయం. పిల్లలకు టాన్సిల్స్‌ సమస్య ఉంటే ఇక వాళ్లకు చుక్క నెయ్యి కూడా పెట్టొద్దని చాలామంది పెద్దవాళ్లు ఆదేశిస్తుంటారు. ఇవన్నీ నిజమే… కానీ అది గేదె నెయ్యి విషయంలో. గేదె పాల నుంచి తీసిన నెయ్యి వల్ల ఇలాంటి సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. నిజానికి నిద్ర పట్టనివాళ్లకు నిద్ర రావడానికి గేదె పాలను ఆయుర్వేద వైద్యంలో భాగంగా ఇస్తారు. కానీ ఆవునెయ్యి అలా కాదు. నిజానికి ఆవునెయ్యి తినకపోవడం వల్ల కూడా ఇప్పుడు చాలామందిలో సమస్యలు కనిపిస్తున్నాయి.

ఆవు నెయ్యి తినకుంటే…..

నెయ్యి తింటే లావు అయిపోవడం కాదు.. ఆవు నెయ్యి తినకపోతే లావైపోతారు.
హార్మోన్ల సమస్యలు, సంతానలేమికి గల కారణాల్లో ఒకటి ఆవునెయ్యికి దూరంగా ఉండటమే.
జుట్టు రాలిపోవడానికి ఆవు నెయ్యి తినకపోవడమూ ఒక కారణమే.

ఆవు నెయ్యి తింటే ఎన్ని లాభాలో!

  • గేదె నెయ్యి వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. కాని ఆవు నెయ్యి వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది.
  • ఏజింగ్‌ ప్రాసెస్‌ నెమ్మదించాలంటే ఆవునెయ్యి రెగ్యులర్‌గా తినాలి. ఆవు నెయ్యిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. దీనిలో ఉండే బ్యుటైరిక్‌ యాసిడ్‌ సెల్‌ ఏజింగ్‌ని కంట్రోల్‌ చేస్తుంది. అందువల్ల ఆవునెయ్యి తీసుకోవడం ద్వారా నిత్యయవ్వనం మీ సొంతమవుతుంది.
  • చిన్న వయసులోనే మోకాళ్లనొప్పులు రావడానికి ఆవు నెయ్యి తినకపోవడం కూడా ఒక కారణమే. ఆవు నెయ్యి కీళ్లలో వేర్‌ అండ్‌ టేర్‌ లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అందువల్ల మోకాళ్ల నొప్పులను నివారించొచ్చు.
  • ఆవునెయ్యి స్నిగ్ధత్వానికి అవసరం. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
  • ఆవు నెయ్యి రెగ్యులర్‌గా తీసుకుంటే మలబద్దకం దరి చేరదు.
  • ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్‌ నివారించడానికి ఆవు నెయ్యి తినాలి.
  • ఇది చర్మం, మెదడు, స్మృతి, మేధాశక్తికి మంచిది. అందుకే పిల్లలకు ఆవు నెయ్యి తప్పనిసరిగా ఇవ్వాలి.
  • ఆవు నెయ్యి నాచురల్‌ ఇమ్యునిటీ బూస్టర్‌. అందుకే రెగ్యులర్‌గా ఆవు నెయ్యి తింటే ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తక్కువ.

ఆయుర్వేద చికిత్సలో ఆవునెయ్యి

సాధారణంగా ఆయుర్వేదం చికిత్స రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో టాక్సిన్స్‌ను తొలగించి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తారు. దీన్ని పాచన అంటారు. ఇక రెండో దశ రసాయనం. మొదటి దశలో ఇన్‌ఫ్లమేషన్‌ను తీసేశాక, మళ్లీ సమస్య రాకుండా అదే స్థితిని మెయిన్‌టెయిన్‌ చేయడానికి మందులు ఇస్తారు. రసాయన దశలో మెయింటనెన్స్‌, రెజువినేషన్‌ సాధ్యమవుతాయి. ఈ దశలోనే ఆవు నెయ్యిని ఔషధంగా ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ఇతర ఔషధంతో కలిపి మెడికేటెడ్‌ నెయ్యిగా లేదా కేవలం ఆవునెయ్యినే చికిత్సగా కూడా ఇస్తారు.

స్నేహపానం

కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు స్నేహపాన చికిత్స ఇస్తారు. ఈ ప్రక్రియలో నెయ్యిని తాగిస్తారు. అయితే నెయ్యి తీసుకోవాలంటే ఆమం ఉండకూడదు. ఇందుకోసం ఆమ పాచన ఇస్తారు. దీని ద్వారా ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది. ఇంట్లోనే కషాయాల రూపంలో లేదా మందుల రూపంలో ఈ చికిత్స ఉంటుంది. ఆమ పాచన తర్వాత నెయ్యిని చికిత్సగా ఇస్తారు.

స్నేహపానం ఎప్పుడంటే…

  • ఆయుర్వేద చికిత్సల ద్వారా బరువు తగ్గొచ్చని చాలామందికి తెలియదు. కానీ ఎటువంటి సైడ్‌ ఎఫెక్టులు లేకుండా ఆయుర్వేదం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇలా ఫ్యాట్‌ లాస్‌ థెరపీ ఇచ్చేటప్పుడు నెయ్యి ద్వారా స్నేహపాన చికిత్స చేస్తారు.
  • అల్సర్లు, ఇతర గ్యాస్ట్రిక్‌ సమస్యలు, జుట్టు రాలిపోవడం, త్వరగా ఏజింగ్‌ అవుతుండటం
  • చర్మ సమస్యలకు ఆవునెయ్యి మంచి ఔషధం. ఇన్‌ఫ్లమేషన్‌ రాకుండా దీన్ని ఇస్తారు. తరచుగా చర్మంపై ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నప్పుడు ఆవునెయ్యితో చికిత్స చేస్తారు. సొరియాసిస్‌, ఆర్టికేరియా, అలర్జీలు ఉన్నప్పుడు కూడా ఆవునెయ్యి ఇస్తారు.
  • పీసీఓఎస్‌ లాంటి గైనిక్‌ సమస్యలకు
  • పార్కిన్‌సన్స్‌, స్పైనల్‌, డిస్క్‌ లాంటి న్యూరో సమస్యలున్నప్పుడు స్నేహపానం అవసరం.
  • వస్తికర్మకు ముందు కూడా స్నేహపానం ఇస్తారు.

ఆవు నెయ్యితో చికిత్స ఇలా..

మహాతిక్తక ఘృతం, ధన్వంతర ఘృతం, శతావరి ఘృతం, దాడిమాది ఘృతం లాంటివి ఆయుర్వేద ఆవు నెయ్యి ఔషధాలు. వీటిని ఒక కోర్సు లాగా ఇస్తారు. సమస్యను తగ్గించడానికి ఒకటే మోతాదులో ఒక కోర్సు ఇస్తారు. టాక్సిన్స్‌ తొలగించడానికైతే ముందు తక్కువ మోతాదులో స్టార్ట్‌ చేసి, క్రమంగా డోస్‌ పెంచుతూ పోతారు. రోగి పరిస్థితిని బట్టి 20, 30 మి.లీ. నుంచి 180 మి.లీ. వరకు ఇలా ఏడు రోజుల వరకు ఇవ్వొచ్చు.

ఆవు నెయ్యి ఇలానే తినాలి

  • నెయ్యిని ఎప్పుడైనా కరిగించి మాత్రమే తీసుకోవాలి. గట్టిగా గడ్డ కట్టిన స్థితిలో తీసుకోవద్దు.
  • అన్నం, చపాతీ, ఉప్మా, దోశ.. ఇలా దేంతో అయినా ఆవు నెయ్యి తీసుకోవచ్చు. అయితే ఆహారం వేడిగా ఉండేలా చూసుకోవాలి. అలా తీసుకుంటేనే ఒంటికి పడుతుంది.
  • కేవలం నెయ్యి మాత్రమే తీసుకుంటే వెంటనే వేడి నీళ్లు తాగాలి.
  • శరీర పరిస్థితిని బట్టి నెయ్యి ఏ మేరకు తీసుకోవచ్చో డిసైడ్‌ చేసుకోవాలి. ఇందుకు అవసరమైతే డాక్టర్‌ హెల్ప్‌ తీసుకోవాలి. సాధారణంగా ఏ సమస్య లేనివాళ్లయితే ఒక్కో మీల్‌కి ఒక టీ స్పూన్‌ నెయ్యి తినొచ్చు. నెయ్యి తీసుకోవడం వల్ల డ్రైనెస్‌ కూడా తగ్గుతుంది.
  • మహారాష్ట్ర లాంటి కొన్ని ప్రాంతాల్లో ఆవు నెయ్యితో ఫేస్‌ మసాజ్‌ కూడా చేస్తారు. ముఖం మెరుపు కోసం, నునుపైన చర్మం కోసం ఇది పనిచేస్తుంది.
డాక్టర్‌ రాజశ్రీ,
(ఎం.డి., ఆయుర్వేద),
ఆయుర్వేదిక్‌ ఫిజీషియన్‌,
రాధాస్‌ ఆయుర్వే,
మిలీనియమ్‌ స్వ్వేర్‌ బిల్డింగ్‌,
రత్నదీప్‌ పైన, గచ్చిబౌలి
హైదరాబాద్‌.
ఫోన్‌ : 91540 45404, 91000 58333
Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *