అది చూడటానికి పెద్దది మాత్రమే కాదు… అది నిర్వర్తించే బాధ్యతలు కూడా పెద్దవే. మన శరీరంలో ఆరు వందకు పైగా ముఖ్యమైన విధులను నిర్వహించే కీలకమైన అవయవం. కానీ అతి చిన్న వైరస్.. దాని పనులన్నీ డిస్ట్రబ్ చేస్తుంది. దాంతో శరీరం అల్లకల్లోలం.. చివరికి ప్రాణానికే ప్రమాదం. ఆ అవయవమే కాలేయం. ఆ వైరస్.. హెపటైటిస్. నేడు.. అంటే జూలై 28న వరల్డ్ హెపటైటిస్ డే. ఈ సందర్భంగా ‘‘సేవ్ ద లివర్’’ ఫౌండేషన్ ద్వారా కాలేయ వ్యాధులపై అవగాహన, ఉచిత చికిత్సలూ అందిస్తున్న ప్రముఖ కాలేయ వ్యాధుల నిపుణులు, హెపటాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ రావుతో ముఖాముఖి.
ప్రశ్న: కాలేయానికి సమస్యలు ఎందుకు వస్తాయి?
జవాబు : మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కాలేయ వ్యాధులకు ప్రథమ కారణం మద్యపానం. ఆ తరువాత రెండోస్థానంలో ఉండి, కాలేయానికి చేటు చేసేవి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లు. కొన్ని రకాల ఔషధాలు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. క్షయ, కీళ్ల వాతం లాంటి సమస్యలకు వాడే మందులు కాలేయ వ్యాధులకు కారణం కావొచ్చు. కొన్ని రకాల ఆయుర్వేద, యునాని మందుల్లో లోహ పదార్థాలు ఉండటం వల్ల ఆ మందులు కాలేయాన్ని పాడు చేస్తాయి. రోగనిరోధక శక్తిలో లోపాలున్నా కాలేయం పాడైపోతుంది. కాలేయం దెబ్బతినడానికి మరో ముఖ్య కారణం ఫ్యాటీ లివర్. అంటే కాలేయంలో కొవ్వు చేరడం. ఇటీవలి కాలంలో ఇది ఎక్కువ అవుతున్నది. రాబోయే పదేళ్లలో ఇది కాలేయ వ్యాధులకు ప్రధాన కారణంగా పరిణమించవచ్చు.
ప్ర : హెపటైటిస్ గురించి కొంచెం చెప్తారా..?
జ : హెపటైటిస్లో చాలా రకాలున్నాయి. వాటిలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది శరీరంలో దీర్ఘకాలం ఉండిపోతుంది. సాధారణంగా రక్తం, రక్తానికి సంబంధించిన పదార్థాలు, లైంగిక కలయిక ద్వారా ఈ వైరస్లు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. హెపటైటిస్ ఉన్న తల్లి నుంచి పిల్లలకు కూడా రావొచ్చు. శస్త్రచికిత్స చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ రావొచ్చు. శస్త్రచికిత్సకు వాడే పరికరాలను సరిగా స్టెరిలైజ్ చేయకపోయినా ఈ వైరస్లు వ్యాప్తి చెందుతాయి.
ప్ర : హెపటైటిస్ వైరస్లు శరీరంలో ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
జ : సాధారణంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్లలో ఎటువంటి తీవ్రమైన లక్షణాలుండవు. అయితే ఈ వైరస్లు ఎక్కువ కాలం శరీరంలో ఉంటే కాలేయ కణాల వాపు వస్తుంది. ఇలాంటప్పుడు ఆ వాపు తగ్గించడానికి శరీరం వెంటనే దాన్ని రిపేర్ చేసే పని మొదలుపెడుతుంది. అయితే ఇలా పదే పదే మరమ్మతు చేస్తూ ఉండటం వల్ల కాలేయ కణాలపై మచ్చలు ఏర్పడుతాయి. వీటివల్ల కాలేయం పనితీరు దెబ్బతిని, క్రమంగా దాని సామర్థ్యం తగ్గిపోతుంది. ఇదే తీవ్రమైనప్పుడు లివర్ సిర్రోసిస్ అంటారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్లు లివర్ సిర్రోసిస్తోనే సాధారణంగా చనిపోతుంటారు. ఆల్కహాల్ తర్వాత ఇందుకు హెపటైటిసే కారణం. ఒకసారి లివర్ సిర్రోసిస్ వస్తే, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే హెపటైటిస్ను వీలైనంత త్వరగా నిర్ధారణ చేసుకుని, సకాలంలో చికిత్స తీసుకుంటే సిర్రోసిస్, క్యాన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చు.
ప్ర : హెపటైటిస్కి చికిత్స ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
జ : హెపటైటిస్ సి ని పూర్తి స్థాయిలో నయం చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైరస్ నిరోధక మందులతో 99 శాతం వరకు హెపటైటిస్ను తగ్గించవచ్చు. వీటివల్ల దుష్ప్రభావాలు కూడా పెద్దగా ఉండవు. హెపటైటిస్ బికి కూడా శక్తిమంతమైన వైరస్ నిరోధకాలు అందుబాటులో ఉన్నాయి. కాలేయ కణాల్లో వాపు ఉంటే ఈ యాంటీవైరల్ మందులు ఇస్తారు. కొందరిలో హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పటికీ అది క్రియారహితంగా (ఇనాక్టివ్ క్యారియర్) ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్లలో ఏ సమస్యలూ ఉండవు గానీ వాళ్ల ద్వారా ఇంకొకరికి మాత్రం వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇలా వైరస్ ఇనాక్టివ్గా ఉన్నవాళ్లకు చికిత్స అవసరం లేదు. కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకుంటుండాలి. ఎందుకంటే కొందరిలో హెపటైటిస్ బి వైరస్ యాక్టివ్గా మారి, కాలేయ కణాల్లో ఇన్ఫ్లమేషన్కు దారి తీయవచ్చు. కాలేయ కణాల్లో వాపు రాకముందే ఈ పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. ఆకలి లేకపోవడం, కడుపులో వికారం, వాంతులు, కళ్లు, మూత్రం పసుపు రంగుకి మారడం వంటి లక్షణాలున్నవారు తప్పకుండా కాలేయ పరీక్షలు చేయించుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు పెరిగి, సిర్రోసిస్ రాకుండా నివారించొచ్చు.
ప్ర : మీ సేవ్ ద లివర్ ఫౌండేషన్, దాని ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పండి.
జ : హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా సేవ్ ద లివర్ ఫౌండేషన్ ఏర్పడింది. దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక లోని పలు ప్రాంతాల్లో సుమారు 25 వేల మందికి హెపటైటిస్ పరీక్షలు నిర్వహించాం. కొన్ని ప్రాంతాల్లో హెపటైటిస్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. వీటిలో మన తెలుగు రాష్ట్రాలే ముందున్నాయి. హెపటైటిస్ బి, సి ఉన్నవాళ్లలో 400 మంది హెపటైటిస్ బి, 150 మంది హెపటైటిస్ బి పేషెంట్లకు ఉచితంగా చికిత్సను అందించాం. మందులు కూడా కొనలేని స్థితిలో ఉన్న వీళ్లు ఇప్పుడు పూర్తిగా హెపటైటిస్ నుంచి బయటపడ్డారు. అవగాహన, శాస్త్రీయమైన చికిత్స ద్వారా మాత్రమే హెపటైటిస్ నుంచి కాలేయాన్ని కాపాడుకోవచ్చు. అందుకే ఈ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున హెపటైటిస్ పట్ల అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. హెపటైటిస్ బి టీకాలు వేసుకునేలా ప్రోత్సహించి, వీటిని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా ఈ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది.
డాక్టర్ కుదరవల్లి సోమశేఖర్ రావు
జీర్ణవ్యాధులు, కాలేయ వ్యాధుల నిపుణులు
అపోలో హాస్పిటల్, హైదరాబాద్.
సేవ్ ద లివర్ ఫౌండేషన్
ఫోన్ : 9553778899
www.savetheliver.org