చలికాలంలో వేడి వేడినీటితో స్నానం భలే బావుంటుంది. అలాగే ఎండాకాలంలో చన్నీళ్ల స్నానం హాయినిస్తుంది. మరి రెండింటిలో ఏది మంచిదంటే మనకు రకరకాల డౌట్లు. ఏది ఏమైనా ఉదయాన్నే స్నానం చేస్తేనే గానీ ఫ్రెష్‌గా అనిపించదు. కానీ కొందరు మాత్రం సాయంత్రం వరకూ స్నానం లేకుండా ఉంటారు. లాక్డౌన్, వర్క్ ఫ్రం హోమ్ లాంటివి వచ్చాక నెమ్మదిగా చేయొచ్చులే అని స్నానాన్ని వాయిదా వేస్తున్నారు చాలామంది. నిజానికి స్నానం వల్ల శరీరం పైన ఉండే మురికే కాదు.. మనసులో ఉన్న డల్‌నెస్ కూడా పోతుంది. ఒక పద్ధతి ప్రకారం చేసే స్నానం ఆరోగ్యానికి బాటలు వేస్తుందంటుంది ఆయుర్వేదం. మరి ఆ పద్ధతులేంటో చూద్దామా…
• ఎప్పటి నుంచో పెద్దవాళ్లు చెప్పే ముఖ్యమైన విషయం.. శుభ్రంగా స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలి. ఏదైనా తిన్న వెంటనే స్నానం చేయకూడదు.
• ఆరోగ్యం బావుండకపోవడం వల్లో, మరే ఏ కారణం చేతనైనా ముందే తినేయాల్సి వస్తే, కడుపు నిండా తినగానే స్నానం చేయవద్దు. తిన్నాక రెండు మూడు గంటల పాటు ఆగి, ఆ తర్వాత స్నానం చేయాలి. అంటే స్నానం చేసేముందు కడుపు ఖాళీగా ఉండాలన్నమాట.
• ఇకపోతే అందరికి తరచుగా వచ్చే డౌట్… చన్నీళ్ల స్నానం మంచిదా.. వేడినీళ్లతో చేయవచ్చా? అని. మరీ చల్లని, వేడివి కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. చన్నీళ్ల స్నానం ఆరోగ్యానికి మంచిదని చెప్పే మాటలు నిజం కాదు. ఈ నమ్మకాలు అపోహలే.
• ఏ కారణం చేతనైనా చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తే స్నానానికి ముందు చల్లనీళ్లు తాగకూడదు.
• ఏ నదుల్లోనో స్నానం చేయాల్సి వస్తే ఆ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఇలాంటప్పుడు స్నానం కోసం ఎక్కువ సమయం వెచ్చించవద్దు.
• తలస్నానం చేసేటప్పుడు ఎక్కువ వేడినీళ్లు వాడటం అస్సలు మంచిది కాదు. ఇకపోతే స్టీమ్ బాత్ వంటివి కూడా పెద్దగా మేలు చేయవు. తలకు ఆవిరి పట్టడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
• వయసు పైబడినవాళ్లు, జబ్బు చేసినవాళ్లు, బలహీనంగా ఉన్నవాళ్లు మరీ చల్లటి నీళ్లు గానీ, వేడి నీళ్లు గానీ స్నానానికి ఉపయోగించకూడదు. వీటివల్ల గుండెపై ప్రభావం పడేందుకు ఆస్కారం ఉంటుంది.
• చన్నీళ్లు లేదా మరీ వేడినీళ్లతో స్నానం తర్వాత తలనొప్పి, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తే ఆ నీళ్లతో స్నానం మీకు సరిపడలేదని అర్థం చేసుకోవాలి.
• స్నానం చేయడానికి ముందు వ్యాయామం చేయడం వల్ల మరింత మేలు కలుగుతుంది.
Superb….Very valuable information.. taking care of small things maka big difference..In our lifes
thank you.