క్యాన్సర్ పేరుతోనే భయపెట్టే జబ్బు. దీన్ని ఎంత తొందరగా కనుక్కుంటే అంత మంచి చికిత్స అందించడం వీలవుతుంది. క్యాన్సర్ వ్యాధికి అందించే చికిత్సలపై మాత్రమే కాదు దాన్నితొందరగా కనుక్కోగలిగేందుకు కూడా రకరకాల పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడో చిన్న రక్త పరీక్ష ద్వరా క్యాన్సర్ వ్యాధిని కనుక్కోగలిగే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.
క్యాన్సర్ అనే పేరు వింటేనే గుండెలో దడ మొదలవుతుంది. డిప్రెస్ అవుతారు. క్యాన్సర్ కు చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నప్పటికీ అవి కూడా నొప్పితో కూడుకున్నవి కావడంతో క్యాన్సర్ అంటే భయం కలుగుతుంది. క్యాన్సర్ ను ఎంత తొందరగా గుర్తించగలిగితే అంత మంచి చికిత్సలు అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ కి చికిత్సలు మాత్రమే కాదు, క్యాన్సర్ అవునో కాదో తెలుసుకునేందుకు చేసే బయాప్సీ పరీక్ష కూడా చిన్నపాటి శస్త్రచికిత్సలా అవుతుంది. పరీక్ష కోసం ట్యూమర్ నుంచి కొంత కణజాలాన్ని సేకరిస్తారు. ఈ క్రమంలో నొప్పిగా కూడా ఉంటుంది.
డిఎన్ఎతో గుట్టు రట్టు
క్యాన్సర్ వ్యాధిని చాలా ముందుగానే తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యమేనంటున్నాయి కొత్త పరిశోధనలు. చిన్న రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ ను చాలా ముందుగానే తెలుసుకోగలం అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డీ కార్వలో. రక్తంలో క్యాన్సర్ కణాల డిఎన్ఎను గుర్తించడం ద్వారా ఇది సాధ్యమేనంటున్నారు. 300 మంది పేషెంట్ల నుంచి రక్తం శాంపిల్ ని సేకరించి ఈ అధ్యయనాన్ని జరిపారు. వీరిలో ఊపిరితిత్తులు, పాంక్రియాస్, పెద్దపేగు, రొమ్ము, కిడ్నీ, బ్లాడర్ క్యాన్సర్లు, ల్యుకేమియా ఉన్నవాళ్లు ఉన్నారు. రక్తంలోని ప్లాస్మాలో ఉన్న సెల్ ఫ్రీ డిఎన్ఎ ను విశ్లేషించడం ద్వారా ఈ పరీక్ష జరుపుతారు. ఈ సెల్ ఫ్రీ డిఎన్ఎను ట్యూమర్ డిఎన్ఎతో పోల్చి చూసి క్యాన్సర్ అవునో కాదో విశ్లేషిస్తారు.
ఈ రక్త పరీక్ష పైన మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు 700 ట్యూమర్ల శాంపిళ్లను మాత్రం పరిశీలించారు. ఈ పరీక్ష అందరికీ అందుబాటులోకి వస్తే క్యాన్సర్ ను గుర్తించడానికి నొప్పి లేని పరీక్ష వచ్చేసినట్టే. అంతేగాక క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించి తొందరగా చికిత్స మొదలుపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.