ల్యూప‌స్ వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే..?

వ‌ర‌ల్డ్ ల్యూప‌స్ డే సంద‌ర్భంగా స్పెష‌ల్ స్టోరీ

చ‌ర్మంపై ద‌ద్దుర్లు… కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌టం…. కీళ్ల‌లో వాపు…. ఇలా శ‌రీరంలోని ప్ర‌తి అవ‌య‌వాన్నీ ఏదో ఒక స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం చేసే వ్యాధి.. సిస్ట‌మిక్ ల్యూప‌స్ ఎరిథిమాటొసిస్ (ఎస్ఎల్ఇ)…. సింపుల్ గా ల్యూప‌స్‌. వ‌ర‌ల్డ్ ల్యూప‌స్ డే సంద‌ర్భంగా మ‌హిళ‌ల్ని ఎక్కువ‌గా బాధించే ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి 1000 మందిలో ఒక‌రు ల్యూప‌స్ వ్యాధితో బాధ‌ప‌డుతుండ‌గా.. మ‌న‌దేశంలో ప్ర‌తి ల‌క్ష మందిలో 3.2 మంది ల్యూప‌స్ బారిన ప‌డ్డార‌ని అంచ‌నా. ల్యూప‌స్ వ్యాధిగ్ర‌స్తులు రోజురోజుకూ పెరుగుతున్న సంద‌ర్భంగా 2004 సంవ‌త్స‌రం నుంచి ప్ర‌తి ఏటా మే నెల 10 వ తేదీన వ‌ర‌ల్డ్ ల్యూప‌స్ డే గా నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ల్యూప‌స్ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుకుని, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుంటే.. ల్యూప‌స్ వ్యాధి ఉన్నా సంతోషంగా జీవించ‌వ‌చ్చు.

ల్యూప‌స్ అంటే…?

మ‌న శ‌రీరాన్ని వ్యాధుల పాలు కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కాపాడే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌న వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌. ఇది ఎంత ప‌టిష్టంగా ఉంటే మ‌న ఇమ్యూనిటీ అంత బాగా ఉంటుంది. మ‌న శ‌రీరానికి హాని క‌లిగించే సూక్ష్మ‌జీవులు, ప‌దార్థాలు… ఇలా ఏవి లోప‌లికి ప్ర‌వేశించినా వాటిని మ‌ట్టుబెట్టే బాధ్య‌త ఈ ఇమ్యూన్ సిస్టమ్ లేదా వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ది. అది వెంట‌నే ఇమ్యూనిటీ లేదా వ్యాధి నిరోధ‌క‌త‌ను ప్రేరేపించి, వాటిపై దాడి చేయిస్తుంది. కొంద‌రిలో మాత్రం ఈ ఇమ్యూన్ సిస్ట‌మ్ త‌ప్పుదారి ప‌ట్టి, సొంత క‌ణాల‌నే హానిక‌ర‌మైన వాటిగా పొర‌బ‌డి, వాటిపై దాడి చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూనిటీ అంటారు. ఆటోఇమ్యూనిటీ వ‌ల్ల వ‌చ్చే వ్యాధుల‌ను ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటారు. అలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒక‌టి ల్యూప‌స్‌.

ఏమ‌వుతుంది?

ల్యూప‌స్ వ్యాధి వ‌చ్చిన వాళ్ల‌లో శ‌రీరంలోని ఏ అవ‌య‌వ‌మైనా ఆటో ఇమ్యూనిటీ ప్ర‌భావానికి లోను కావొచ్చు. అందుకే ఇది చాలా సంక్లిష్ట‌మైన వ్యాధి. ఎప్పుడు ఏ అవ‌య‌వానికి స‌మ‌స్య వ‌స్తుందో తెలియ‌దు. సాధార‌ణంగా చ‌ర్మం, జుట్టు, కీళ్లు, కండ‌రాలు, ఎముక‌లు దీనివ‌ల్ల ప్ర‌భావిత‌మ‌వుతాయి. అందుకే చ‌ర్మంపై ద‌ద్దుర్లు, జుట్టు రాలిపోవ‌డం, కీళ్ల‌లో వాపులు, ఎముక‌ల నొప్పులు, కండ‌రాల ప‌టుత్వం త‌గ్గిపోవ‌డం, జ్వ‌రం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కొంద‌రిలో నాడీ వ్య‌వ‌స్థ కూడా ప్ర‌భావితం అవుతుంది. ఇలాంట‌ప్పుడు ఆటో ఇమ్యూన్ క‌ణాలు మెద‌డు పొర‌లపై దాడిచేస్తాయి. అందువ‌ల్ల ఈ పొర‌ల్లో వాపు లేదా ఇన్ ఫ్ల‌మేష‌న్ క‌నిపిస్తుంది. ల్యూప‌స్ ఉన్న‌వాళ్ల‌లో కిడ్నీలు ప్ర‌భావిత‌మైతే కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే ల్యూప‌స్ వ్యాధి వ‌ల్ల ఇన్ ఫ‌ర్టిలిటీ స‌మ‌స్య‌లు ఉంటాయి. ప్రెగ్నెంట్ గా ఉన్న‌వాళ్ల‌లో అబార్ష‌న్లు ఎక్కువ‌.

ఎలా నిర్ధార‌ణ చేస్తారంటే…

ల్యూప‌స్ వ్యాధి ఆటో ఇమ్యూనిటీకి సంబంధించింది కాబ‌ట్టి దీనికి యాంటీ న్యూక్లియ‌ర్ యాంటీబాడీస్ (ఎఎన్ఎ) అనే ప‌రీక్ష చేస్తారు. అయితే పూర్తిగా దీనిమీదే ఆధార‌ప‌డ‌కుండా క్లినిక‌ల్ గా కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. పేషెంటు మెడిక‌ల్ హిస్ట‌రీ, శారీర‌క ప‌రీక్ష‌లు, ల‌క్ష‌ణాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కూడా వ్యాధిని నిర్ధారిస్తారు. ల‌క్ష‌ణాల ఆధారంగా ఆయా అవ‌య‌వాల ప‌నితీరును తెలిపే ప‌రీక్ష‌లు అవ‌స‌రం అవుతాయి. కిడ్నీ ఫంక్ష‌నింగ్ టెస్టు, బ్రెయిన్ సిటి స్కాన్ లాంటివి చేస్తారు.

ప‌రిష్కారం ఉందా?

ల్యూప‌స్ వ్యాధికి శాశ్వ‌త చికిత్స అంటూ ఏమీ ఉండ‌దు. ల‌క్ష‌ణాల‌కు మాత్ర‌మే చికిత్స అందించ‌గ‌ల‌రు. ఏయే అవ‌య‌వాల‌పై వ్యాధి ప్ర‌భావం ఉంద‌నే దాన్ని బ‌ట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి పెర‌గ‌కుండా, మేనేజ్ చేయ‌డానికి మాత్ర‌మే మందులు ఉప‌యోగ‌ప‌డుతాయి. సాధార‌ణంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి నాన్ స్టిరాయిడ‌ల్ యాంటీ ఇన్ ఫ్ల‌మేట‌రీ మందులు ఇస్తారు. ఇన్ ఫ్లమేష‌న్ ఎక్కువ‌గా ఉండి, ఎక్కువ కాలంగా వ్యాధి బాధ‌పెడుతూ ఉన్న‌ట్ట‌యితే ప్రెడ్నిసొలోన్ లేదా మిథైల్ ప్రెడ్నిసొలోన్  లేదా హైడ్రో కార్టిసోన్ లాంటి కార్టికోస్టిరాయిడ్స్ ఇస్తారు. ఇమ్యూనిటీని కంట్రోల్ చేసి, ఇన్ ఫ్ల‌మేష‌న్ ను త‌గ్గించ‌డంలో ఇవి ఉప‌యోగ‌ప‌డుతాయి. వీటితో పాటుగా మైకోఫినోలేట్ లాంటి డిసీజ్ మాడిఫ‌యింగ్ మందులు కూడా వ్యాధిని కంట్రోల్ చేయ‌డానికి స‌హాయ‌ప‌డుతాయి.

రాకుండా ఉండాలంటే….

ఆటో ఇమ్యూన్ వ్యాధులు రాకుండా నివారించ‌డం సాధ్యం కాదు. ల్యూప‌స్ వ్యాధి కూడా అంతే. ఇది ఎందుకు వ‌స్తుందో, ఏయే కార‌కాల వ‌ల్ల ప్రేరేపింపప‌డుతుందో మన‌కు ఇప్ప‌టి వ‌రకూ స్ప‌ష్టంగా తెలియ‌దు. అయితే బ్యాలెన్స్‌డ్ డైట్ ద్వారా కొంత‌వ‌ర‌కు ఉప‌యోగం ఉంటుంది. మంచి ఆహారం, రెగ్యుల‌ర్ గా వ్యాయామం, స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానం ద్వారా రిస్కు త‌గ్గించుకోవ‌చ్చు.

డాక్టర్ గౌరీ శంకర్ బాపనపల్లి,

జ‌న‌ర‌ల్ ఫిజీషియ‌న్‌

మల్లా రెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్

హైదరాబాద్‌

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *