ఇలా అయితే బ్లాక్‌ ఫంగస్‌తో భయం లేదు!

కొవిడ్‌ ఎంతగా భయపెడుతున్నదో.. ఇప్పుడు వినిపిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ అంతకు రెట్టింపు భయం కలిగిస్తున్నది. ఇంతవరకూ వినని ఈ బ్లాక్‌ ఫంగస్‌ ఇప్పుడే పుట్టుకువచ్చిందా అంటే ఎప్పటి నుంచో ఇది ఉందనే అంటున్నారు డాక్టర్లు. గతంలో కేవలం డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేనివాళ్లలో మాత్రమే అదీ నెలకో, రెండు నెలలకో ఒక పేషెంటు వస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. అయితే అప్పుడైనా.. ఇప్పుడైనా సకాలంలో, సరైన చికిత్స అందకపోతే ప్రాణాంతకమేనంటున్నారు. సకాలంలో చికిత్స అందితే బ్లాక్‌ ఫంగస్‌ను తీసేయడం పెద్ద విషయమేమీ కాదు. ముందు జాగ్రత్తపడితే కొవిడ్‌ వచ్చినా, ఈ ఫంగస్‌ బారిన పడకుండా తప్పించుకోవచ్చని హామీ ఇస్తున్నారు.

బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ను మ్యూకార్‌ మైకోసిస్‌ అంటారు. సాధారణంగా ఈ ఫంగస్‌ వాతావరణంలో ఉంటుంది. సాధారణంగా దీర్ఘకాలిక సైనస్‌ ఇన్‌ఫెక్షన్‌లో వచ్చే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను అలర్జిక్‌ సైనోనేసల్‌ ఆస్పర్‌జిల్లోసిస్‌ అంటారు. సైనసైటిస్‌లో పాలిప్స్‌, నేసల్‌ పాలిప్స్‌ ఉన్నవాళ్లకు, అలర్జీలుంటే ఇది ఎక్కువగా వస్తుంది. దీన్ని వైట్‌ ఫంగస్‌ అని కూడా అంటున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ అలా కాదు. ఇది ప్రాణాంతకం. దీన్ని రైనో (ముక్కు) ఆర్బిటో (కన్ను) సెరిబ్రల్‌ (మెదడు) మ్యూకార్‌ మైకోసిస్‌ అంటారు.


ఇది ముక్కులోకి ప్రవేశించి, అక్కడి నుంచి సైనస్‌ గదులలోకి చేరుతుంది. అదేవిధంగా అంగిలి (ప్యాలెట్‌), దంతాలు, చిగుళ్లలోకి కూడా వ్యాపించవచ్చు. దాంతో దంతాలు ఊడిపోతాయి. చిగుళ్లు నల్లబడి, చిగురు పైన ఉండే ఎముక నెక్రోసిస్‌ (కణజాలం చనిపోవడం) అవుతుంది. కంటి వరకూ వ్యాపించి, చూపు తగ్గడం, మెదడు వరకూ చేరి ఇన్‌ఫార్‌క్షన్‌ ఆఫ్‌ ది బ్రెయిన్‌ సమస్యతో పక్షవాతానికి కూడా దారితీయవచ్చు. అయితే కొందరు భయపడుతున్నట్టు ఇది అంటువ్యాధి కాదు. కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. సాధారణంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లకి, డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేనివాళ్లకి, ల్యుకేమియా (బ్లడ్‌ క్యాన్సర్‌) పేషెంట్లకు, అవయవమార్పిడి చేసుకున్నవాళ్లకు, క్యాన్సర్‌కు చికిత్సగా కీమోథెరపీ తీసుకునేవాళ్లకు, ఐసియులో టోసిలీజెమాబ్‌ లాంటి మందులు ఇచ్చిన వాళ్లకు బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. సైనస్‌ సమస్య ఉన్నవాళ్లకు బ్లాక్‌ ఫంగస్‌ త్వరగా వస్తుందన్న భయాలు కొందరిలో ఉన్నాయి. కానీ అలా ఏమీ ఉండదు.

బ్లాక్‌ ఫంగస్‌ ఎందుకు వస్తుందంటే…

కొవిడ్‌ వైరస్‌లో మ్యుటేషన్‌ వల్ల ఈ సెకండ్‌ వేవ్‌లో బ్లాక్‌ ఫంగస్‌ ఎక్కువగా కనిపిస్తోందని భావిస్తున్నారు.

డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేనివాళ్లకు కార్టికోస్టిరాయిడ్స్‌ ఎక్కువగా ఇవ్వడం వల్ల డయాబెటిక్‌ కీటోఅసిడోసిస్‌ వచ్చి, షుగర్‌ లెవల్స్‌ 400, 500 వరకు కూడా పెరుగుతుండటం వల్ల ఈ బ్లాక్‌ ఫంగస్‌ లేదా మ్యూకార్‌ మైకోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా వస్తుంది.

కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ అంటూ సోషల్‌ మీడియాలో ముఖ్యంగా వాట్సప్‌లలో కార్టికోస్టిరాయిడ్స్‌తో కూడిన నాలుగైదు మందుల ప్రిస్క్రిప్షన్లు సర్క్యులేట్‌ అవుతున్నాయి. వీటిని ఇంట్లోనే ఉండి వాడుకోవచ్చని ఉండటంతో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న చాలామంది ఈ మెసేజ్‌లను చూసి వాటిని వాడుతున్నారు. అలాంటి వాళ్లలో బ్లాక్‌ ఫంగస్‌ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది.

  • సాధారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్నవాళ్లకు, ఆక్సిజన్‌ శాచురేషన్‌ 93 కన్నా తక్కువ ఉన్నవాళ్లకు మాత్రమే వీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మైల్డ్‌ లక్షణాలు ఉన్నవాళ్లకు కూడా కార్టికోస్టిరాయిడ్స్‌ను ముఖ్యంగా ఈ సెకండ్‌ వేవ్‌లో ఎక్కువగా వాడుతున్నారు.
  • అతిగా స్టీమ్‌ ఇన్‌హలేషన్‌ చేయడం వల్ల ముక్కులోపలి లైనింగ్‌ దెబ్బతిని, నేసల్‌ ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీనివల్ల బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.
  • వ్యాక్సిన్‌ తీసుకోనివాళ్లలో కూడా ఇది వస్తున్నదని కూడా కొంతమంది అనుభవాలు చెబుతున్నాయి.

లక్షణాలేంటి?

తలకు ఒకవైపు భరించలేనంత తీవ్రమైన తలనొప్పి బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవాళ్లలో సాధారణంగా కనిపిస్తున్న లక్షణం.
చెంప, ముఖం అంతటా నొప్పి, చెంప మొద్దుబారినట్టు ఉంటుంది.
డబుల్‌ విజన్‌ రావడం, కళ్లు మసకబారడం, క్రమంగా చూపు తగ్గుతూ రావడం, టోసిస్‌ అంటే పై కనురెప్ప కిందికి జారిపోయి కంటిని మూసేయడం, కనుగుడ్డు కదలికలు తగ్గిపోవడం, కనుగుడ్డు కదలకుండా ఉండి, చూపు పూర్తిగా పోవొచ్చు. బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల 3, 4, 6 క్రేనియల్‌ నరాలు, మెదడులోని కావర్నస్‌ సైనస్‌ ప్రభావితం అయినప్పుడు ఈ ఆఫ్తాల్మోప్లీజియా అనే లక్షణాలు కనిపిస్తున్నాయి.
ముక్కులో నుంచి వచ్చే స్రావం ముదురు గోధుమ రంగు, నల్లగా ఉండొచ్చు. కొందరికి ఎర్రగా రక్తం మరకతో కూడా రావొచ్చు. ముక్కు బ్లాక్‌ అవుతుంది. ముఖం నొప్పి, దంతాలు వదులైపోవడం, చిగుళ్లకు చీము పట్టడం, అంగిలి దగ్గరి ఎముక కణజాలం దెబ్బతింటుంది. సైనస్‌ల నుంచి ఇన్‌ఫెక్షన్‌ మెదడుకు పాకితే (ఇంట్రాక్రేనియల్‌ ఇన్‌ఫెక్షన్‌) పక్షవాతం, అపస్మారకంలోకి వెళ్లి, ప్రాణాపాయం సంభవిస్తుంది.

అది బ్లాక్‌ ఫంగసేనా..? ఎలా తెలియాలి?

బ్లాక్‌ ఫంగస్‌ను నిర్ధారించడానికి తొలుత నేసల్‌ ఎండోస్కోపీ ద్వారా నిర్ధారిస్తారు. ముక్కులోపల ఎండోస్కోప్‌ పెట్టి చూస్తే మానిటర్‌లో నల్లగా మసిబొగ్గులా కనిపిస్తుంది. ఇన్‌ఫీరియర్‌ లేదా మిడిల్‌ టర్బినేట్స్‌, నేసల్‌ సెప్టమ్‌ అంతా నల్లగా అయిపోతుంది. ముక్కు లోపలి పొర అంతా అబ్‌నార్మల్‌గా అయిపోతుంది. కుళ్లిపోయినట్టు కనిపిస్తుంది. సైనస్‌ గదుల్లో చీము నిండుకుని ఉంటుంది. ఇలా నల్లగా అయిపోయిన దాన్ని తీసి, మైక్రోబియల్‌ పరీక్ష కోసం పంపిస్తారు. దీనిలో కొన్ని గంటల్లో పొటాషియం హైడ్రాక్సైడ్‌ మౌంటింగ్‌ టెస్ట్‌ ద్వారా ఈ బ్లాక్‌ ఫంగస్‌ జైగోమైసిటీస్‌ లేదా మ్యూకార్‌ మైకోసిస్‌ వ్యాధిని నిర్ధారించవచ్చు. హిస్టోపాథాలజీ టెస్టుల ద్వారా కూడా డయాగ్నస్‌ చేయవచ్చు. వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో, ముక్కు, సైనస్‌ గదుల్లో ఏ మేరకు వ్యాపించిందో కనుక్కోవడానికి పారానాసల్‌ సైనస్‌లకు సీటీ స్కాన్‌ చేస్తారు. ఆర్బిట్‌, మెదడు భాగాలకు ఎంఆర్‌ఐ ద్వారా కంటి కండరాలు, కనుగుడ్డు, మెదడులో మెనింజస్‌, నేసల్‌ గాంగ్లియాలపై ప్రభావం ఏ మేరకు ఉంది, మెదడు ఇన్‌ఫార్‌క్షన్‌ ఎంత ఉన్నదనేది తెలుసుకోవచ్చు.

చికిత్స ఏంటి?

ముక్కు, సైనస్‌ గదుల్లో ఉన్న ఫంగస్‌ పదార్థాన్ని ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ ద్వారా తీసివేస్తారు.
మైక్రోబయాలజికల్‌ టెస్టు ద్వారా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ నిర్ధారణ కాగానే ఇంట్రావీనస్‌ యాంపోటెరిసిన్‌ బి ప్రత్యేకించి లైపోజోమల్‌ యాంపోటెరిసిన్‌ బి అనే యాంటీ ఫంగల్‌ మెడికేషన్‌ను 5 శాతం డెక్స్‌ట్రోజ్‌లో కలిపి 5 నుంచి 6 గంటల వరకు ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. ఈ మందును ఆపరేషన్‌ ముందు మొదలుపెట్టవచ్చు. రెండు మూడు వారాల వరకు దీన్ని కంటిన్యూ చేయాలి. వ్యాధి తగ్గిందనుకుంటే ఆపవచ్చు. అయితే ఇది దొరకడం లేదు. అందువల్ల లయోఫిలైజ్‌డ్‌ యాంఫోటెరిసిన్‌ బి, అనేది రెండో ఆప్షన్‌గా వాడుతున్నారు. ఈసావోకొనజోల్‌, పోసెకొనజోల్‌ లను టాబ్లెట్‌ రూపంలో వాడవచ్చు. కొన్ని ఇంజెక్షన్ల రూపంలో కూడా ఉన్నాయి. తరువాత వారానికోసారి ముక్కులో ఎండోస్కోపిక్‌ పరీక్ష చేస్తూ, ఇంకా అనారోగ్యకరమైన పదార్థాలుంటే రెండుమూడుసార్లు తొలగించాల్సి రావొచ్చు
కన్ను ప్రభావితమై ఉంటే ఆఫ్తాల్మిక్‌ ఆక్యులోప్లాస్టిక్‌ సర్జన్‌ సలహా మేరకు కనుగుడ్డు తీయాల్సిన అవసరం కూడా రావొచ్చు. లేకుంటే ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్‌ దృష్టినాడి ద్వారా పెరిన్యూరల్‌గా మెదడు దాకా వెళ్తుంది. కొందరికి అంటే అంగిలి ఎముక కణజాలం దెబ్బతిన్నవాళ్లకు (నెక్రోసిస్‌), దంతాలు, చిగుళ్లు డ్యామేజీ అయినవాళ్లకు పార్షియల్‌ మాక్జిలెక్టమీ చేసి, దెబ్బతిన్న ఎముక భాగాన్ని తొలగిస్తారు. అంగిలిని రిపేర్‌ చేస్తారు.

బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా నివారించొచ్చా?

తప్పకుండా నివారించొచ్చు. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నవాళ్లకు సాధారణంగా రెండు మూడు రోజుల్లో పారాసిటమాల్‌తో జ్వరం తగ్గుముఖం పడుతుంది. ఒళ్లు నొప్పులు ఉపశమిస్తాయి. కాబట్టి వీళ్లకు కార్టికోస్టిరాయిడ్స్‌ ఇవ్వకూడదు. శ్వాస ఆడకుండా, ఆక్సిజన్‌ అవసరం అయినవాళ్లు డాక్టర్‌ పర్యవేక్షణలో, అవసరమైన మోతాదులో మాత్రమే ఇవ్వాలి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఆక్సిజన్‌ ఇచ్చేవాళ్లలో హ్యుమిడిఫయర్‌, పైపింగ్‌ సిస్టమ్‌ శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌ వస్తోందని అంటున్నారు. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా కార్టికోస్టిరాయిడ్స్‌ ఇవ్వడం ఆపేయాలి.

డాక్టర్‌ విష్ణుస్వరూప్‌ రెడ్డి
హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌, ఇఎన్‌టి విభాగం
చీఫ్‌ ఇఎన్‌టి సర్జన్‌, కేర్‌ హాస్పిటల్స్‌
హైదరాబాద్‌
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *