పళ్లు పచ్చబడుతున్నాయా..?

ఈ పేస్ట్‌వాడితే మీ దంతాలు మెరుస్తాయి, ఈ పేస్ట్‌వాడితే తాజాదనం అంటూ టీవీ యాడ్స్‌లోనో, సినిమాల్లోనో తెల్లగా మెరిసే దంతాలు కనిపిస్తుంటాయి. కానీ ఏ పేస్ట్‌వాడినా చాలా మంది దంతాలు లేత పసుపు రంగులో కనిపిస్తుంటాయి. ఈ సమస్యలకు కారణాలు తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దంతాల సమస్యల నుంచి బయటపడొచ్చు.

మన దంతాలు పచ్చబడడానికి చాలా రకాల కారణాలున్నాయి. తినే ఆహారం దగ్గరి నుంచి ఆరోగ్య పరిస్థితి వరకు ఎన్నో అంశాలు దంతాలపై ప్రభావం చూపుతాయి. ఎక్కువ మటుకు దంతాలపై ఏర్పడే పాచి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇలా దంతాలు పసుపు రంగులోకి మారవచ్చు.

ఎనామిల్ తగ్గితే..

దంతాల్లో ఎనామిల్‌పొర, డెంటిన్‌పొర, మెత్తటి కణజాలం అని మూడు భాగాలు ఉంటాయి. అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్‌పొర. ఇది పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది. దంతాలకు అత్యంత దృఢత్వాన్ని ఇచ్చేది ఇదే. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే అదే పరిమాణమున్న ఉక్కు కంటే ఎనామిల్‌ఎక్కువ దృ ఢంగా ఉంటుంది. ఎనామిల్‌పొర కింద డెంటిన్‌పొర ఉంటుంది. డెంటిన్‌అంటే ఎముకల వంటి కణజాలం. ఇది కూడా దృఢంగా ఉంటుంది. ఎనామిల్‌ మందంగా ఉంటే దంతాలు తెల్లగా కనిపిస్తాయి. ఎనామిల్ అరిగిపోయి సన్నగా ఉంటే పళ్లు పసుపు రంగులో కనిపిస్తాయి. మనలో వయసు పెరిగిన కొద్దీ ఎనామిల్‌మందం తగ్గిపోతుంటుంది. దాంతో దంతాలు పసుపురంగులో కనిపిస్తుంటాయి. దీనికితోడు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎనామిల్‌పొరపై మరకలు పడతాయి.

కారణం ఇదీ..

మనం తినే ఆహారం నోటి మూలల్లో, దంతాల మధ్య ఉండిపోయినప్పుడు దానిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. దాంతో దంతాలపై పాచి ఏర్పడుతుంది. దీని నుంచి కొన్ని రకాల ఆమ్లాలు వెలువడతాయి. ఈ యాసిడ్‌ల కారణంగా దంతాలకు రక్షణగా ఉండే ఎనామిల్‌ పొర దెబ్బతింటుంది. దాంతో పళ్లు పసుపు రంగులోకి మారడమే కాకుండా, రంధ్రాలు ఏర్పడతాయి. వాటినే కావిటీలు లేదా పిప్పిపళ్లు అంటారు. ఈ కావిటీలను నిర్లక్ష్యం చేస్తే.. చివరికి దంతాలు పూర్తిగా దెబ్బతిని, రాలిపోవడానికి కారణ మవుతాయి. క్యావిటీలు ఎనామిల్‌పొరతోపాటు డెంటిన్‌పొరకు కూడా విస్తరిస్తే.. దంతాల పరిస్థితి బాగా దెబ్బ తిన్నట్లే లెక్క.

అసిడిక్‌ స్వభావం ఉన్న పండ్లు, ముదురు రంగు ఆహార పదార్థాలు, ద్రాక్ష, నేరేడు, దానిమ్మ వంటి పండ్లు, రెడ్‌వైన్‌, శీతల పానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటితో దంతాలు ఎక్కువగా పసుపు రంగులోకి మారుతాయి. కాఫీ, టీ, వైన్‌లాంటి వాటిలో ఉండే టానిన్లు అనే రసాయనాల వల్ల కూడా ఎనామిల్‌పై మరకలు ఏర్పడతాయి. చిగుళ్లవ్యాధికి, మొటిమల నివారణకు, రక్తపోటును నియంత్రణకు వాడే మందుల వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. తాగునీటిలో ఫ్లోరైడ్‌శాతం అధికంగా ఉండడం వల్ల దంతాలు పూర్తిగా పచ్చబడతాయి.

ఇలా చేయండి…

దంతాలు పసుపు రంగులోకి మారకుండా ఉండాలంటే రోజుకు రెండు సార్లు శుభ్రంగా బ్రష్ చేసుకోవడం ముఖ్యం. దంతాలపై ఏర్పడిన పాచి గట్టిపడకుండా ఎప్పటికప్పుడు పాచి తీసేయించుకోవాలి. బ్రషింగ్ తరువాత ఫ్లాసింగ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. అసిడిక్ నేచర్ ఉన్న పండ్లు, ఇతర ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దు. రాత్రిపూట కాఫీ, టీ లు తాగొద్దు. స్మోకింగ్, పాన్ లాంటి అలవాట్లు మానివేయాలి.
ఎన్ని జాగ్రతలు తీసుకున్నా దంతాల పచ్చదనం అలాగే ఉంటే దంత వైద్యుని కలవండి.

డాక్టర్ చంద్రకాంత్
సీనియర్ మాక్సిలోఫేషియల్ సర్జన్, మహావీర్ హాస్పిటల్స్
హైదరాబాద్
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *