ఉబ్బస వ్యాధి ఉన్నవాళ్లకు చలికాలం అంటే హడలే. ఏమాత్రం చల్లగాలి తగిలినా వీళ్లలో ఆస్తమా అటాక్స్ పెరుగుతుంటాయి. అందుకే ఈ సీజన్‌లో ఉబ్బస వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిట్కాలు పాటిస్తే చలికాలంలో కూడా ఆస్తమా దాడికి గురికాకుండా బయటపడవచ్చు. వైద్యులు చెబుతున్న ఆ సూచనలేంటంటే…
వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులు, పరిసరాల్లో అలర్జీని ప్రేరేపించే కారకాలు… వెరసి ఆస్తమా దాడిచేస్తుంది. అలర్జీని ప్రేరకాలకు దూరంగా ఉండటం వల్ల చాలావరకు ఆస్తమా అటాక్స్ నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఈ చలికాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయాసంతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. దగ్గు మొదలైతే అది ఆస్తమా వల్లనా, కొవిడ్ వచ్చిందా అన్న అనవసర భయాలకు కూడా ఆస్కారం ఉంటుంది. అందువల్ల చల్లగాలి, దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
• చలికాలం, వాతావరణ ఉష్ణోగ్రతలలో విపరీత వ్యత్యాసాలు ఉన్న కాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన మొట్టమొదటి జాగ్రత్త వైద్యులు సూచించిన మందుల వాడకాన్ని ఖచ్చితంగా కొనసాగించడం. ఎట్టి పరిస్థితుల్లోనూ మందులను ఆపవద్దు.
• దిండ్లపై దుమ్ము, ధూళి లేకుండా చూసుకొండి. కనీసం పదిహేను రోజులకు ఓ సారి పక్కబట్టలను మరుగుతున్న నీళ్లతో ఉతకండి.
• పెంపుడు జంతువులను పడకగదిలోకి తీసుకురావద్దు. ఇంట్లోని సోఫాలు, మంచాల పైన కూడా కూర్చోబెట్టవద్దు.
• పడక గదిలో కార్పెట్లు వేయకండి. దూదికూరి చేసిన పిల్లల బొమ్మలను పడకగదుల్లో పెట్టకండి.
• ఇంటి వాతావరణంలో తేమ అధికంగా ఉండకుండా చూసుకొండి. ఇంటిలోకి వస్తున్న గాలి నాణ్యతను గమనిస్తూ ఉండండి.
• పొగ తాగే అలవాటుంటే మానివేయండి. ప్యాసివ్ స్మోకింగ్‌కు లోనవకుండా ఉండేందుకు పొగతాగేవాళ్లకు, ధూమపానం కోసం ఉద్దేశించిన ప్రదేశాలకు దూరంగా ఉండండి.
• ఇళ్లలో ఫ్లోరింగ్, బాత్రూమ్ లను శుభ్రం చేసేందుకు ఘాటైన క్లీనర్లను, ఆసిడులను వాడకండి.
• మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి.
• తీవ్రమైన చలి ఉన్న రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయకండి.
• జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించినపుడు వెంటనే వాటి నివారణకు మందులు వేసుకోండి.
• ఆస్తమా తీవ్రం అయినపుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లండి. అటాక్ ప్రారంభంలోనే వైద్యులను కలవటం వల్ల సకాలంలో చికిత్స అంది, ఆస్తమాను వెంటనే అదుపు చేయటానికి వీలవుతుంది.