ప్రతి అయిదుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉన్నారు. లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం 41 మిలియన్ల మంది స్థూలకాయులతో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో ఉంది. స్థూలకాయ సమస్య ఎక్కువగా ఉన్నప్పటికీ దీని గురించి అనేక అపోహలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. అలాంటి అపోహల్లోని వాస్తవాలు ఇవి..
అపోహ : ఒబెసిటీ అందానికి సంబంధించిన సమస్య మాత్రమే.
వాస్తవం : స్థూలకాయం తీవ్రమైన జీవనశైలి జబ్బు. అనేక రకాల వ్యాధులకు మూలకారణం స్థూలకాయమే. గుండెజబ్బులు, క్యాన్సర్, ఇన్ ఫర్టిలిటీ (పిల్లలు పుట్టకపోవడం), డయాబెటిస్, స్లీప్ అప్నియా లాంటివి పెరగడానికి బరువు ఎక్కువగా ఉండటమే కారణం. ఈ వ్యాధులకు దూరంగా ఉండాలంటే ముందు అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి.
అపోహ : స్థూలకాయం జీవనశైలి అపసవ్యత మాత్రమే.. వ్యాధి కాదు.
వాస్తవం : స్థూలకాయం అసాధారణ జీవనశైలి అపసవ్యత మాత్రమే కాదు, ఇదొక వ్యాధి కూడా. అనేక రకాల సమస్యలను కలిగించే జబ్బు. అయితే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు.
అపోహ : ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బరువు తగ్గవచ్చు
వాస్తవం : మనసులో గట్టిగా అనుకోవాలే గానీ బరువు తగ్గడం ఎంతసేపు! అనుకుంటాం. విల్ పవర్ ఉంటే చాలు వ్యాయామంతో బరువు తగ్గిపోవచ్చు. ఇప్పుడు బరువు పెరిగినా ఆ తరువాత నేను తగ్గించుకుంటాలే.. అంటుంటారు. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గాలంటే ఎంత కష్టమో స్థూలకాయులకు మాత్రమే తెలుసు. 25 కిలోల కన్నా ఎక్కువ అదనపు బరువు పెరిగితే, దాన్ని తగ్గించుకోవడం కత్తి మీద సామే. ఒక సవాలుగా పరిణమిస్తుంది. ఇలాంటప్పుడు కేవలం ఆహారంలో మార్పులు, వ్యాయామం ద్వారా బరువు తగ్గడం సాధ్యం కాదంటారు లివ్ లైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నందకిశోర్ దుక్కిపాటి. అప్పుడు బేరియాట్రిక్, మెటబాలిక్ సర్జరీలు అవసరం అవుతాయని చెబుతున్నారాయన.
అపోహ : ఒబెసిటీ పట్టణ వాసుల సమస్య
వాస్తవం : నగరంలో లగ్జరీ జీవితం గడిపేవాళ్లు మాత్రమే బరువు పెరుగుతారనీ, ఇదొక ధనికుల సమస్య అనీ అనుకుంటారు. కానీ ఇండియాలోని మురికివాడల్లో నివసించేవాళ్లలో 3 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని అంచనా. పోషకాహారలేమికి ఇది కారణమవుతుంది. ఇనుము లోపం, విటమిన్ డి3 లోపానికి కూడా ఒబెసిటీ కారణమవుతుంది.
అపోహ : బొద్దుగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక బరువు తగ్గుతారు.
వాస్తవం : పిల్లలు బొద్దుగా ఉంటేనే ముద్దు కాదు. లావుగా ఉండటం ఆరోగ్య సూచిక కానే కాదు. చిన్నప్పుడు స్థూలకాయంతో ఉన్న పిల్లల్లో 80 శాతం మంది పెద్దయ్యాక కూడా స్థూలకాయంతోనే ఉంటారంటున్నారు ఢిల్లీకి చెందిన మెటబాలిక్ సర్జన్ డాక్టర్ ప్రదీప్. ఇలాంటి పిల్లల్లో దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, అధిక రక్తపోటు చిన్న వయసులోనే వస్తాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని సూచిస్తున్నారు.
అపోహ : ఇన్ ఫర్టిలిటీ వల్ల స్థూలకాయం వస్తుంది.
వాస్తవం : నిజానికి స్థూలకాయం వల్లనే ఇన్ ఫర్టిలిటీ సమస్య వస్తుంది. బరువు ఎక్కువగా ఉండేవాళ్లలో హార్మోన్లలో తేడాలు వస్తాయి. అందువల్ల సంతానలేమి సమస్యలు మొదలవుతాయి. స్త్రీలలో చిన్నవయసులోనే ఇన్ ఫర్టిలిటీ కనిపించడానికి కారణం ఇదే.
అపోహ : థైరాయిడ్ చికిత్స తీసుకుంటే బరువు తగ్గుతుంది.
వాస్తవం : థైరాయిడ్ సమస్య ఉందనగానే దానివల్లనే బరువు పెరిగామని చెబుతుంటారు. థైరాయిడ్ తక్కువగా ఉండటమే బరువు పెరగడానికి కారణం కాబట్టి ఆ టాబ్లెట్ వేసుకుంటే బరువు తగ్గిపోతాంలే అనుకుంటారు. కానీ హైపోథైరాయిడిజమ్ ఒకటే స్థూలకాయానికి కారణం కాదు. కాబట్టి థైరాయిడ్ చికిత్స తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గాలంటే వ్యాయామమూ చేయాల్సిందే. బరువు తగ్గుతామనే భ్రమలో సొంతంగా థైరాయిడ్ సప్లిమెంట్ తీసుకోవడం మంచిది కాదు.