తినండి… కానీ బరువు తగ్గండి!

బరువు పెరగడం… ఎక్కువ మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రపంచవ్యాప్త సమస్య అంటే అతిశయోక్తి కాదేమో! కొంచెం బరువు పెరిగితేనే టెన్షన్‌ పడిపోయి, నానా రకాల డైట్‌లు పాటిస్తూ కడుపు మాడ్చుకునేవాళ్లు కొందరైతే.. అసలు తాము ఎక్కువ బరువు ఉన్నామన్న స్పృహే లేనివాళ్లు మరికొందరు. ఏది ఎలా ఉన్నా బరువు పెరగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నది మాత్రం సత్యం. అయితే ఇందుకోసం టెన్షన్‌ పడి, తిండి మీరు తగ్గించక్కర్లేదు. మీ శరీరమే తక్కువ ఆహారం తీసుకునేలా చేసే సరికొత్త వైద్య ప్రక్రియ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చికిత్స చేసే అతికొద్ది వైద్యుల్లో డాక్టర్‌ చంద్రశేఖర్‌ పులి ఒకరు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఈ ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రోప్లాస్టీ చికిత్సను అందిస్తున్న ఒకే ఒక్కరాయన. అధిక బరువు, ఆధునిక చికిత్స గురించి ఆయన మాటల్లోనే…

లండన్‌ గ్యాస్ట్రో క్లినిక్‌లో… ఒకరోజు..

అప్పుడే ఒక ఎండోస్కోపిక్‌ ప్రొసిజర్‌ చేసి వచ్చి కూర్చున్నాను. అప్పుడు వచ్చిందామె. పొడవుగానే ఉంది. దాదాపు 5 అడుగుల 3 అంగుళాలు ఉంటుందేమో. కానీ చాలా లావుగా ఉంది. ఎంత అని చూస్తే 145 కిలోలు. బరువు తగ్గడానికి వచ్చే పేషెంట్‌ కోసమైనా నేను కనీసం గంట కన్సల్టేషన్‌ తీసుకుంటాను. ఎందుకంటే ఇది జీవితాన్ని మర్చేసే ప్రక్రియ. అందువల్ల వాళ్ల శారీరక, మానసిక పరిస్థితులన్నీ నాకు తెలియాలి. ఆమెతో కూడా అలాగే మాట్లాడాను. నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగాను. దానికామె చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. తను వెళ్లిన గైనకాలజిస్టు, కార్డియాలజిస్టు తప్పనిసరిగా బరువు తగ్గాలని చెబితే తప్ప ఆమెకు తాను బరువు తగ్గాలన్న అవగాహనలో కూడా లేదు. వాళ్ల ఇంట్లో అందరూ లావుగానే ఉండటంతో అదే నార్మల్‌ అనుకుందామె. ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉంటే ఆరోగ్యకరం అనే విషయంలో మనకు అవగాహన లేకపోవడమే ఎక్కువ మందిని సమస్యల్లోకి నెడుతున్నది. ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రోప్లాస్టీ చేసిన తర్వాత కొన్ని వారాల్లో 14 కిలోల బరువు తగ్గింది. అప్పటివరకూ 400 ఉన్న షుగర్‌ 150కి వచ్చేసింది. రోజుకి 180 యూనిట్ల ఇన్సులిన్‌ అవసరమయ్యే ఆమెకు ఇప్పుడు కేవలం 6 యూనిట్ల ఇన్సులిన్‌ సరిపోయింది.
ఆలస్యం చేయకుండా ముందే ఆమె బరువు తగ్గించుకునే ప్రయత్నం చేసివుంటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ ఎదురయ్యేవి కాదు కదా.

ఏది నార్మల్‌ బరువు?

మనం సాధారణం కన్నా ఎక్కువ లావు ఉన్నామా లేదా అని తెలియడానికి ఉపయోగించే కొలతే బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎంఐ). బాడీ మాస్‌ ఇండెక్స్‌ 18 – 25 మధ్యలో ఉండాలి. ఆ తర్వాత ప్రతీ బిఎంఐ యూనిట్‌ పెరుగుదలకీ మన జీవిత కాలం, ఆరోగ్య స్థాయి 3 నుంచి 10 శాతం తగ్గిపోతుంది. బిఎంఐ 30 కన్నా ఎక్కువ ఉంటే మన జీవితంలో అయిదేళ్లు తగ్గినట్టే. బరువుతో పాటు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ పెరుగుతాయి. మోకాలిపై బరువు ఎక్కువై ఆర్థరైటిస్‌ వస్తుంది. పొట్ట ముందుకు పెరగడం వల్ల వెన్నుపామును లాగేసి దానిపై ఒత్తిడి పడుతుంది. సయాటికా వంటి సమస్యలు వస్తాయి. గుండెజబ్బుకు గురవుతారు. బిఎంఐ 25 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటూ, తగినంత అంటే కనీసం రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వర్కవుట్స్‌ చేస్తే బరువు తగ్గేందుకు ఆస్కారముంటుంది. అయితే ఇవన్నీ చేసినా కొందరు బరువు తగ్గరు. ఇలాంటప్పుడు జన్యు సమస్యులు గానీ, హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నదా అని గానీ చెక్‌ చేసుకుని, ఆయా సమస్యలకు చికిత్స తీసుకోవడం అవసరం.

ఆపరేషన్‌ లేకుండా బరువు తగ్గాలంటే…

సాధారణంగా బరువు తగ్గాలనుకున్నవాళ్లు కనీసం ఓ మూడు నాలుగు డైట్‌లు అయినా ప్రయత్నం చేసి ఉంటారు. వీళ్లు కొంతవరకు బరువు తగ్గుతారు కూడా. కానీ 97 శాతం మంది మళ్లీ బరువు పెరుగుతారని అధ్యయనాలున్నాయి. ఇందుకు వాళ్లు సీరియస్‌ ప్రయత్నం చేయలేదని కూడా చెప్పలేం. కొంతమంది జన్యు పరిస్థితులు అలా ఉంటాయి. ఇలాంటప్పుడు సాధారణంగా బేరియాట్రిక్‌ సర్జరీయే శరణ్యమేమో అని భయపడుతుంటారు. కానీ ఇప్పుడు ఎటువంటి సర్జరీ లేకుండా బరువు పెరగకుండా చేయగల ఎండోస్కోపిక్‌ ప్రొసిజర్లు ఉన్నాయి. వీటిలో స్లీవ్‌ గ్యాస్ట్రోప్లాస్టీ ముఖ్యమైనది.

ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రోప్లాస్టీ (ఇఎస్‌జి) అంటే…?

డ్రెస్‌ వదులుగా ఉన్నప్పుడు మన సైజుకి తగినట్టుగా లోపలి నుంచి కుట్లు వేసుకుని సరిచేసుకుంటాం. ఈ కుట్లు వేసేటప్పుడు అదనంగా ఉన్న డ్రెస్‌ భాగాన్ని కత్తిరించి, కుట్లు వేసుకోవచ్చు. లేదా కత్తిరించకుండా కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా జీర్ణాశయాన్ని చిన్న సైజుకి మార్చడానికి బేరియాట్రిక్‌ సర్జరీ ద్వారా దాన్ని కత్తిరించి కుట్లు వేయవచ్చు. లేక ఎండోస్కోపిక్‌ ప్రొసిజర్‌ ద్వారా కత్తిరించకుండా కూడా కుట్లు వేయవచ్చన్నమాట. బేరియాట్రిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రోప్లాస్టీ సర్జరీ ద్వారా జీర్ణాశయ భాగాన్ని కొంత తొలగించి, మిగిలిన దానికి కుట్లు వేస్తారు. అయితే దీనివల్ల లీక్స్‌ అయిపోయి, ఇతరత్రా సమస్యలు వచ్చేవి. అందువల్ల జీర్ణాశయానికి కోత పెట్టకుండా కుట్లు వేయగలమా అనే ఆలోచన 2012 నుంచి ఉంది. ఆ ఆలోచన నుంచే ఈ ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రోప్లాస్టీ ప్రక్రియ పుట్టింది. ఈ ప్రక్రియలో నోటి ద్వారా ట్యూబు లాంటి ఎండోస్కోప్‌ను పంపించి, 80 శాతం జీర్ణాశయాన్ని అరటి పండు ఆకారంలో ట్యూబ్‌ లాగా చేసి కుట్లు వేసేస్తాం. ఇక్కడ కత్తిరింపులు ఉండవు కాబట్టి లీక్స్‌ అయ్యే అవకాశం ఉండదు. ఇది చాలా ఆధునికమైన ప్రొసిజర్‌. ఇలా చేసేవాళ్లు ప్రపంచంలోనే చాలా తక్కువ. లండన్‌లోనే నేను మరో ఇద్దరు, ముగ్గురమే ఉన్నాం.

ఇవీ లాభాలు

• ఇఎస్‌జి ప్రక్రియ వల్ల నొప్పి ఉండదు.
• కోతలుండవు. కాబట్టి మచ్చలుండవు.
• అదే రోజు డిశ్చార్జి అయి వెళ్లిపోతారు.
• మరుసటి రోజు నుంచి ఎప్పటిలా అన్ని పనులూ చేసుకోవచ్చు.
• త్వరగా రికవర్‌ అవుతారు.
• పూర్తిగా సురక్షితమైనది.
• మనం తినే క్వాంటిటీ తక్కువ అవుతుంది. తద్వారా బరువు తగ్గుతారు.

రిస్క్‌ ఉందా?

ఈ ప్రక్రియ వల్ల సర్జరీ మాదిరిగా రిస్క్‌లేమీ ఉండవు. కొందరిలో కొద్దిగా వికారంగా అనిపించవచ్చు. అది కూడా ప్రొసిజర్‌ తర్వాత రెండు గంటల పాటు మాత్రమే. అది కూడా మందులతో తగ్గిపోతుంది. జీర్ణాశయం సైజు తగ్గిస్తాం కాబట్టి కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. క్రాంప్స్‌ లాగా అనిపిస్తుంది. కానీ సాధారణ పారాసిటమాల్‌తో సెట్‌ అయిపోతుంది.

డాక్టర్‌ చంద్రశేఖర్‌ పులి
FRCP Edin, MRCP Gastro (UK), MRCP (Oxford), MBBS
ఛైర్మన్‌, లండన్‌ గ్లోబల్‌ క్లినిక్స్‌
కూకట్‌పల్లి
కన్సల్టెంట్‌ మెడికల్‌గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌,
అడ్వాన్స్‌డ్‌ఇంటర్వెన్షనల్‌ఎండోస్కోపిస్ట్‌
కిమ్స్‌హాస్పిటల్స్‌, హైదరాబాద్‌
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *