అయ్యో.. బరువు పెరిగిపోతున్నామే.. అని బాధపడిపోతుంటామే గానీ, అది తగ్గడానికి బద్ధకించేవాళ్లే ఎక్కువ. నానా కష్టాలూ పడి నియమానుసారం తిండి తింటూ బరువు తగ్గించినప్పటికీ, మళ్లీ పెరగకుండా చూసుకోవడం కూడా కత్తిమీద సామే అవుతుంటుంది. తగ్గిన బరువును అలాగే కొనసాగించాలంటే చాలామందికి సాధ్యం కాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా బరువు పెరిగిపోతారు. ఇన్నాళ్లూ పడిన కష్టమంతా వృథా అవుతుంది. ఇలా జరుగకుండా ఉండాలంటే…
వారం రోజుల్లో పది కిలోల బరువు తగ్గిస్తామంటూ ప్రకటనలు చూస్తూ ఉంటాం. కానీ, ఒక్కసారిగా బరువు తగ్గాలనుకోవడం మంచిది కాదు. నెమ్మదిగా ఒక్కొక్క కిలో చొప్పున తగ్గడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు తగిన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడమే అసలైన పద్ధతి. అయితే వ్యాయామం బోర్ కొట్టకుండా ఉండాలంటే రకరకాల వ్యాయామ పద్ధతులు అవలంబిస్తే మంచిది. ఏ పనైనా బలవంతంగా కాకుండా ఆనందంగా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది.
డిసిప్లిన్ మొదటి మెట్టు
బరువు తగ్గే విధానం ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది మొదటి కొన్ని వారాల్లో త్వరగా బరువు తగ్గిపోతారు. మరికొందరిలో ఏ మార్పూ ఉండకపోవచ్చు. అంతమాత్రాన డీలా పడిపోవద్దు. సరైన సమయంలో తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం మాత్రం పాటిస్తూ ఉండాలి. ఈ అలవాటు బరువు తగ్గడానికే కాదు, మంచి నిద్రకు, ఒత్తిడి నివారణకు, ఇమ్యూనిటీ పెరగడానికి కూడా దోహదపడుతుంది.
భోజనం.. ఇలా
ఒక్క పూట భోజనం చేయకపోతే కేలరీలు తగ్గుతాంలే అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటప్పుడు శరీరంలో జీవక్రియ రేటు తగ్గిపోతుంది. అందుకే ఉదయం టిఫిన్ తప్పనిసరిగా చేయాలి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ల సైకిల్ ఫాలో కాకపోయినా సరే.. కొద్ది కొద్ది ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాలి. మూడు పూటలకు బదులు ఆరు పూటలు తినవచ్చు. కానీ ప్రతిసారీ ఆహార మోతాదు తగ్గించాలి. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, కేలరీలను పరిగణనలోకి తీసుకోవడం మరిచిపోవద్దు.
- తక్కువ కేలరీలతో మార్కెట్లో దొరికేవాటిని వాడుకోవడం మంచిది. దీంతో రెట్టింపు స్థాయిలో కేలరీలు పెరగకుండా తగ్గించవచ్చు.
- ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనే స్పృహతో తినాలి. ఒంటరిగా తినడం కంటే పుస్తకం చదువుతూ, కబుర్లు చెబుతూ, టీవీ చూస్తూ తింటున్నప్పుడు ఎక్కువగా తినేస్తాం. కాబట్టి ఒంటరిగా తినడమే బెస్ట్.
- గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక మోస్తరుగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా కూడా శక్తిమంతంగా ఉండవచ్చు. బరువును నింయంత్రించొచ్చు. గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవాలంటే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఇడ్లీ లేదా దోశ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నప్పుడు చట్నీ బదులు సాంబార్ వల్ల ప్రొటీన్ ఎక్కువ అందుతుంది.
- రోజూ కనీసం రెండు మూడు లీటర్ల నీటిని తాగాలి. నీరు కూడా బరువు తగ్గిస్తుంది.
బరువు తగ్గాలంటే ఇలా తినండి
బ్రేక్‌ఫాస్ట్
ఒక కప్పు గ్రీన్ టీ/బ్లాక్ టీ/ టీ లేదా కాఫీ
ఒక గ్లాసు మజ్జిగ/కొబ్బరి నీళ్లు/స్కీమ్డ్ మిల్క్
రెండు ఇడ్లీలు/ఒక దోశ/పప్పు లేదా సాంబార్‌తో
ఒక బ్రౌన్ బ్రెడ్‌తో చేసిన టోస్ట్ గుడ్డు తెల్ల సొనతో లేదా కూరగాయలతో
లంచ్
పండ్లు/సలాడ్లు/గింజలు/సూప్/రసం
ఒకట్రెండు చపాతీలు/ఒక కప్పు అన్నం, సాంబార్ లేదా పప్పుతో
ఒక కప్పు ఉడికించిన కూరగాయలు. కనీసం ఒక భోజనంలో అయినా ఆకుకూరలుండేలా చూసుకోవాలి.
ఒక కప్పు పెరుగు/పెరుగు పచ్చడి/ఒక గ్లాసు మజ్జిగ
స్నాక్స్
ఒక కప్పు పాప్‌కార్న్/మొలకెత్తిన విత్తనాలు/కాల్చిన శనగలతో ఒక కప్పు కాఫీ/టీ
రాత్రి
ఒక కప్పు పాలు లేదా మజ్జిగ